12, జనవరి 2015, సోమవారం

ప్రశ్న



వ్రాయాలా?
నిజంగా?

ఒకవేళ వ్రాస్తే నీ గురించి వ్రాయాలి
లేదంటే యిక నా గురించి వ్రాయాలి

నీ గురించి ఏమి వ్రాయాలో తెలియదు
నా గురించైతే వ్రాయటానికి ఎమీ లేదు

నీ లీలావిలాసమంతా రహస్యాఖ్యానాలమయం
నా జీవనగ్రంధమంతా రహస్యాధ్యాయాలమయం

నీ మహర్దివ్యప్రకాశానికి కళ్ళు మూతలుపడి ఇబ్బంది
నా తిమిరమయలోకంలో కళ్ళు కనిపించక ఇబ్బంది

అందుకే నీ గురించిన సత్యాలేవీ వ్రాయగల శక్తి నాకు లేదు
అలాగే నా గురించి అసత్యాలు వాయగల యుక్తి నాకు లేదు

నా కోసం ఎదురుచూస్తున్నావని వ్రాస్తే సరిపోతుందా
నీ కోసం వెదుకులాడుతున్నానని వ్రాస్తే సరిపోతుందా

నీ వెలుగే నా గాయాలన్నీ మాన్పుతోందని తెలుసు
ఆ వెలుగులో నే లీనం కావటం మంచిదని తెలుసు

ఆ ఒక్కముక్కా వ్రాసేస్తే సరిపోతుందా
అసలా ముక్క వ్రాయ నవసరముందా

నాకు నీనుండి ఆదేశం రావాలి
అవసరమంటేనే నేను వ్రాయాలి


5 వ్యాఖ్యలు:

 1. ప్రశ్న అర్ధం కాలేదు, లైఫులైను ఇస్తారా?

  PS: నాకు డాక్టరేటు లేదు!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లైఫ్ లైన్ మీ హక్కే కదా, ప్రత్యేకంగా నేనిచ్చేది యేముంటుంది?

   తొలగించు
  2. అన్ని వాడేసానండీ అయినా జవాబు రాలేదు. ఇక సదరు తెలుగు డాక్టరు గారి మల్లె ఇంటికి వెళ్ళిపోతున్నాను.

   మీరు ఆ ప్రోగ్రాము నడిపితే ఎవరికీ వంద రూపాయిలు కూడా రావు!

   Leaving aside my flippancy:

   మీకు భాష మీద ఉన్న పట్టు పంచడానికి ఒక బ్లాగు సెరీస్ ("Telugu for dummies") రాస్తే బాగుంటుంది. ఎప్పుడో స్కూలులో చదివి మరిచిపోయిన నాలాంటి వారికి ఉపయోగం అవుతుంది.

   తొలగించు

 2. మానవా ,

  ఏమిటీ నీ నా అంటూ విభజించి వ్రాయడం ! నీ గురించి రాసినా నా గురించే కదా ! నా గురించి రాసినా నీ గురించే కదా !

  వ్యధ మాని నీ నా మరచి వ్రాయి ! ఏకం సత్ !

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చిత్తం చిత్తం. ఈ నీ - నా అనే బేధం వదిలేసాక ఇంక వ్రాయటానికి ఎలాగూ ఏమీ ఉండదేమోనండీ.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.