ఎవరి మాట లెటు లున్న నేది నీమాట నా
కెవరయ్యా నీకన్న నెక్కువ రామా
పవలురేలును నీదునామము వదలని వాడ ఈ
భువిని కాదా దివిని గూడను భూరికృపాళో ఓ
పవనసూనుసమర్చితం బును పరమపావనము ఈ
భవరుజాంతక మైన నామము వదలనే కాదా
పదుగు రాడెడు మాట చెల్లగ వచ్చునీ భువిని ఆ
పదుగురును నను తెగడి యెగ్గులు పలికితే నేమి ఓ
సదయ నీకృప నేను బడయగ జాలితి నేని నా
మదిని నిన్నే నమ్మియుంటిని మాటలాడవయా
ఎవరి మెప్పును కోరబోనే యెఱుగవా నీవు నే
నెవరి తప్పుల నెంచబోనే యెఱుగవా నీవు న
న్నెవరు మెచ్చిన మెచ్చకున్నను యించుకంతగ ఓ
భువనమోహన నీవుమెచ్చిన మురిసెదను గాదా