కొంత వెదికిన తరువాత నాకు వ్యాసభారతం (సంస్కృతమూలం) ఆన్లైన్లో తెలుగులో చదువుకొనే అవకాశం కలిగించే సైట్ కనిపించింది.
మహాభారతం https://sanskritdocuments.org వారి పేజీల్లో ఒకటి. ఇక్కడకు వెళ్ళిన తరువాత మనకు Devanagari (and other Indian scripts from each sarga page) అని లింక్ కనిపిస్తుంది. దాన్ని తెరవండి.
మనకు పర్వాల పేర్లు దేవనాగరిలోనే కనిపిస్తాయి. మనకు కావలసిన పర్వం పేరు మీద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి తెరవండి. నేను सभापर्वम् తెరుస్తున్నాను. ఇప్పుడు మనకు సభాపర్వం పేజీ దేవనాగరి లిపిలో తెరుచుకుని కనిపిస్తుంది.
ఇబ్బంది లేదు. ఆపేజీలో పైన కుడివైపున ఒక చిన్న డబ్బాలో మనం కావలసిన భాషను ఎన్నుకోవచ్చును. నేను తెలుగును ఎన్నుకున్నాను.
చక్కగా శ్లోకాలన్నీ అన్నీ తెలుగులిపిలో కనిపిస్తున్నాయి చదువుకుందుకు వీలుగా. మొత్తం సభాపర్వం అంతా మనకు ఒకే పేజీగా కనిపిస్తుంది!
ఇలాగే మనకు కావలసిన పర్వం తాలూకు మూల గ్రంథపర్వాన్ని చక్కగా చదువుకోవచ్చును.
ఇలా ఆన్లైన్లో కనిపిస్తున్నది కేవలం మూలగ్రంథం మాత్రమే.
ఇదంతా తెలుగులిపిలో ఉన్నా, గ్రంథభాష సంస్కృతమే.
మూలగ్రంథం శ్లోకాలతో కావాలీ, తెలుగులిపిలో చదువుకోవాలీ. అంతేకాదు తెలుగులో అర్ధతాత్పర్యాలు కూడా కావాలీ అనుకొనే వారికి కూడా ఒక ఉపాయం ఉంది. గీతాప్రెస్ వారు అటువంటి విధంగా వ్యాసభారతాన్ని అచ్చుపుస్తకాలుగావేసి అమ్ముతున్నారు. ధర నాకు గుర్తున్నంతవరకూ ప్రస్తుతం రెండున్నరవేలు అనుకుంటాను. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లో గీతాప్రెస్ వారి విక్రయశాల ఉందని ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు చెప్పారు.