ఈ ధర్మరాజుగారు జూదం ఆడటం ప్రస్తావన వచ్చింది ఒక కష్టేఫలీ బ్లాగుటపా తాలూకు చర్చలో. సరే వచ్చింది. నేనా చర్చలో దూరి (అనవసరంగా అంటారా? కావచ్చును!) ఒక మాట అన్నాను. "జూదం ద్వారా వచ్చిన లబ్ధిని దృతరాష్ట్రుడు రద్దుచేసి జూదానికి పూర్వం ఉండిన పరిస్థితిని పునరుధ్ధరించాడు. పాండవుల సిరిని అపహరించాలని మరొకప్రయత్నం చేసారు దుష్టచతుష్టయం. దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం వలన పునర్ద్యూతం జరిగి, వనవాసమూ అజ్ఞాతవాసమూ నెత్తిన బడ్డాయి పాండవులకు." అని. ఇది చూసి ఒక వ్యాఖ్యాత గారు "ఇది నాకు తెలియని కొత్తవిషయం. రిఫరెన్స్ ఇవ్వగలరా?" అని అడిగారు.
అలా అడగటాన్ని ఎద్దేవాచేస్తూ మరొకరు "వెతికి పట్టుకోవోయ్ అంతా అరటిపండు ఒలిచి యిస్తే తినేసే రకంగా వున్నారే" అన్నారు కాని అది సరైన మాట కాదు.
ఎందుకంటే ఆంధ్రమహాభారతంలో మీకు ఈవిషయానికి సంబంధించిన వివరాలు దొరకవు. అలా ఎందుకో కొంచెం వివరిస్తాను.
సంస్కృతంలో వేదవ్యాసమహర్షి విరచించిన మహాభారతం ముఫ్ఫైలక్షల శ్లోకాల మహాపర్వతం. దానిని మానవమాత్రులు చదవటం మహాదుష్కరం. కాబట్టి మానవలోకంలో కేవలం లక్షశ్లోకపరిమితిగా మహాభారతం ఇవ్వబడింది. కాని కాలక్రమేణా, కలిముదిరి లక్షశ్లోకాల సంగతి అటుంచి సంస్కృతభాషలో ఉన్న ఇతిహాసాన్ని జనసామాన్యం చదవటం అసాధ్యం ఐపోయింది.
కవులు జనభాషల్లోనికి దానిని యధాశక్తిగా తీసుకొని రావటం మొదలైంది. సంస్కృతభారతాన్ని తెలుగులోకన్నా ముందుగా కన్నడంలో అనువాదం చేసారు. ఆచేసినాయన జైనమతస్థుడు. దానితో పాండవులంతా మహాశ్వేత భక్తులైపోయారు. ఇంకా చాలా మార్పులు జరిగి సనాతనధర్మాన్ని ప్రబోధించే మహాభారతం దుర్గతి పాలౌతోందని పెద్దలు వాపోవటం మొదలైంది. అప్పట్లో తెలుగు కన్నడ భాషలింకా పూర్తిగా విడిపోలేదు. మనవాళ్ళు రెండుభాషల్నీ ఆదరించేవారు. దాని వలన తెలుగుదేశంలో భారతాన్ని ఆంధ్రీకరించాలీ అనే ఒక తపన మొదలయ్యింది. నన్నపార్యుడు దానికి పూనుకోవటంతో శ్రీమదాంధ్రమహాభారతం రూపుదిద్దుకోవటం జరిగింది.
ఇది పూర్తికావటానికి బహుకాలం పట్టింది. నన్నయ్య, తిక్కన్న, ఎఱ్ఱన్న అని ముగ్గురు మహాత్ములు శ్రీమదాంధ్రమహాభారతంమనకి అందించారు మొత్తం మీద.
ఈ మహాభారతాంధ్రీకరణం అంటే మూలంలోని లక్షశ్లోకాలనూ ఎలాఉన్నవి అలా తెలుగులోనికి తేలేదు. అక్కడ ఉన్న కధలూ ఉపకథలూ అన్నీ అలాగే తేలేదు. కొంత ప్రణాళికవేసుకొని చేసారు. మనకాలం వారి శక్తికి అనుకూలంగా కొంత క్లుప్తీకరించారు.
గరుత్మంతుడి కథ రెండు చోట్ల వస్తుంది మూలంలో - దాన్ని ఆదిపర్వంలో మాత్రం చెప్పారు. ఇల్లాంటివి చాలానే స్వతంత్రమైన పోకడలు పోయారన్నమాట.
ఇక విషయంలోనికి వద్దాం.
ధర్మరాజు గారు రాజసూయ యాగం చేసారు. అందరికీ తెలిసిన సంగతే. ఆయాగంలో కృష్ణుడికి అగ్రపూజ చేయటమూ దాన్ని అక్షేపించిన శిశుపాలుణ్ణి కృష్ణుడు వధించటమూ కూడా అందరికీ తెలిసినదే.
యాగం పూర్తి అయ్యాక దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళారు. చివరగా బయలుదేరినది వేదవ్యాసమహర్షి. ఆయన్ను ఊరిపొలిమేర దాకా పాండవులు సాగనంపారు.
సరిగ్గా ఆసందర్భంలో ధర్మరాజుగారు వేదవ్యాసుల వారిని ఒక ప్రశ్న వేసారు.
ఈ రాజసూయమహాయాగం కారణంగా జనక్షయం అన్నది చెప్పారు కదా. అది ఈ శిశుపాల వధతో తీరిపోయినట్లే కదా అని అడిగారు.
దానికి వేదవ్యాసుడు చెప్పిన జవాబు వినండి. ధర్మరాజా, నీవీ ప్రశ్న అడగకుండా ఉంటేనే బాగుండేదేమో. విను. ఈరాజసూయం తెచ్చే కలహం మాసిపోలేదు శిశుపాలవధతో. అది పదమూడు సంవత్సరాల తరువాత వస్తుంది మహా జనక్షయం జరుగుతుంది. అది నీ నిమిత్తంగా జరుగుతుంది. దానికి దుర్యోధనుడు కారణం అవుతాడు తన అత్యాశతో.
ఈసమాధానంతో ధర్మరాజు గారు హతాశుడయ్యాడు. ఇంటికి పోయి సోదరులతో సమావేశం ఐనాడు. వ్యాసభగవానుడు సెలవిచ్చిన మాటలు చెప్పి దుఃఖపరవశుడయ్యాడు.
హఠాత్తుగా ఒక నిర్ణయం ప్రకటించాడు. కలహానికి దుర్యోధనుడి దుర్బుధ్ది కారణం ఐనా అది నా నిమిత్తంగా వచ్చే ప్రళయం ఐనప్పుడు దానిని శాయశక్తులా నివారించాలి. ఇకమీద దుర్యోధనాదులు ఏమి కోరినా కాదనను. అలా చేస్తే కలహానికి కారణమే ఉండదు కదా. అదే కర్తవ్యం నాకు అని.
దుర్యోధనుడు పాండవశ్రీని ఓర్వలేక తానూ రాజసూయం చేయాలని తలపోసాడు. కాని అది కుదరదు. చక్రవర్తి కాని వాడు చేయరాదనీ అసలు దుర్యోధనుడు మూర్ధాభిషిక్తుడైన రాజే కాదు కనక కుదరదనీ పురోహితులు తేల్చి చెప్పారు. ఐతే ప్రత్యామ్నాయంగా వైష్ణవం అనే దొడ్డయాగం చేయవచ్చుననీ చెప్పారు.
సరే అని ఆ వైష్ణవయాగం చేసాడు దుర్యోధనుడు. గొప్ప సభాభవనం కూడా కట్టించాడు. పాండవులను ఆహ్వానించాడు. అపైన జరిగినది తెలిసినదే.
ఆవిషయంలో కొంచెంగా చెప్పుకోవాలి ఐనా సరే. పాండవులను సరదాజూదం పేరుతో సర్వవిధాలా అవమానించిన తరువాత ద్రౌపదీదేవి శపిస్తే పుట్టగతులుండవని ధృతరాష్ట్రుడు ఆవిడకు వరాలిస్తాడు.
అంతేకాక తనంత తానుగా ఆవిడ ధర్మపరాయణత్వానికి ముగ్ధుడై మరొక వరం ఇస్తాడు. ఈ జూదం ముందు ఉన్న స్థితిని పునరుధ్ధరించుతున్నానని ప్రకటించాడు.
కడుపుమండి, దుర్యోధనుడు మళ్ళా జూదం నడిపించి పాండవులను అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించాడు.
అదీ సంగతి.
ఈ కథాక్రమంలో నన్నయ్య గారు తెలుగు చేయకుండా వదిలిన ఘట్టాల్లో ధర్మరాజు గారు ప్రయత్నపూర్వకంగా విరోధాన్ని నివారించటానికి పెట్టుకున్న ఒట్టు విషయం ఒకటి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా ఐనది. ధర్మరాజు అలా ఒట్టు పెట్టుకోక పోతే జూదానికి ఒప్పుకోవలసిన అగత్యం ఉండేది కాదు. కలహ నివారణకోసం పెట్టుకున్న ఒట్టే కలహానికి బీజం వేసింది!