నీకు బంటుగ నేను నెగడుచుండగను
సకల లోకాధార సకల ధర్మాధార
సకల జీవాధార సర్వేశ్వర
సకల క్రియలును నీదు సంకల్పములె కాన
నొక వికారము లేక యుందును నేను
సురనాథసంస్తుత్య హరదేవసంస్తుత్య
నరనాథసంస్తుత్య నారాయణ
ధర మీద నా యునికి అరయ నీ యాన యని
హరి యెంచుకొను వాడ నంతియే కాని
మానక నీనామ మంత్రమే పలుకుచు
పూని నిన్నెప్పుడును పొగడుచుందు
నేను నీ చాయనై నిలచియుందును కాని
లేనిపోనివి తలపు లెందుకు నాకు