నేనెంత చక్కగా నినుపొగడ నేర్తునో
జానకీనాథ నా శక్తి స్వల్ప
ఆవిరించి యున్నాడే యత డెంతటి వాడు
వేవిధముల నిన్నెప్పుడు పెద్దగ పొగడు
దేవా నాకొక తలయును తెలియ వానివి నాల్గు
భావింప నాత డేమో భాషాపతియు
ఆదిశేషు డున్నాడే యత డెంతటి వాడు
మోదముతో నిచ్చలునిను పొగడుచున్నాడు
నాదొక్కటి నాల్కయైన నాగేంద్రునకు వేయి
కాదు కాదు రెండువేలు కదా నాల్కలు
హరుని మహాదేవుని గను మత డెంతటి వాడు
హరి నిన్ను లోనెప్పుడు ధ్యానించునే
హరుడు నీవు వేరే కాదని యందురు పెద్దలు
హరుని వలె నిన్ను పొగడ నన్యుల వశమె