మాటయిచ్చి తప్పవుగా మధుసూదనా
ఇచట నావాడ వగుచు నెసగు నీవు రేపకడ
అచట కొంతకాల ముండ నరుగరాదో
యెచటనున్న నీవాడనె విచారించ నేల నని
విచలితు నన్నోదార్చి పృథివి నుంచి వెడలితివి
ఏళ్ళాయెను పూళ్ళాయెను ఎన్నో యుగములాయెను
కళ్ళజూడ నైతిని నిను కటాక్షించరా
వెళ్ళలేక వెళ్ళునన్ను వెళ్ళిరమ్మన్నది నీవు
మళ్ళీ కనిపించ కున్న మాటతప్పి నట్లేగా
నాడు నీవాడనే మరి నేడు కాకపోయితినా
వేడుకొందును దేవుడా విశ్వనాథుడా
నాడు నేడు నేనాడును నమ్మకముగ నావాడవె
గోడు వినర మాట్లాడర కోదండరాముడా