22, మే 2021, శనివారం

ఏనిముషానికి ఏమి జరుగునో - నిజమే‌ కదా

ఈరోజున ఏనిముషానికి ఏమి జరుగునో అన్న తన టపాలో భండారు శ్రీనివాసరావు గారు ఒకముక్క అన్నారు "నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!" అని.

నా అనుభవం వ్రాస్తున్నాను. నిజానికి ఇది పరోక్షానుభవం అన్నమాట.

మానాన్నగారు స్వర్గస్థులైనపుడు నేను దగ్గర లేను. ఆయన కోరి రాజోలు హైస్కూలు ప్రథానోపాథ్యాయులుగా బదిలీ చేయించుకొని ఆరుమాసాలు కాబోలు ఐనది. నేనేమో అప్పడప్పుడే‌ ఈహైదరాబాదులో కుదురుకుంటున్నాను. ఇ.సి.ఐ.యల్ కంపెనీలో ప్రోగ్రామరుగా ఒకసంవత్సరం పాటు సాగిని నా  ట్రైనింగు ముగిసి కొద్ది మాసాలు ఐనది అప్పుడు. ఆపరేటింగ్ సిస్టం టీములోనికి తీసుకున్నారు నన్ను. అసలు సిసలు పనిలో అప్పుడప్పుడే రుచి తెలుసుకుంటున్నాను. హఠాత్తుగా ఒక ఉదయం టెలిగ్రాం ద్వారా ఈవార్త వచ్చింది.

మా బేబీపిన్ని (సువర్ణలక్ష్మి) ఇరవైల్లోనే హఠాత్తుగా ఒకనాటి రాత్రి, బహుశః తెల్లవారుజామున కోమాలోనికి వెళ్ళిపోయింది. నిడదవోలులో తెలుగుపండిట్ ఉద్యోగం చేస్తూ  వారాంతాల్లో అన్నగారింటికి కొవ్వురు వచ్చేది. తెల్లవారితే సోమవారం. ఉదయమే లేచి తయారయేది హడావుడిగా ఎప్పుడూ. ఈసారి లేవకపోయేసరికి వదినగారు వచ్చి చూచి ఒక్కకేక పెట్టిందట. మామావయ్య ఆమెను ఉన్నపళాన బుజానవేసుకొని ఆస్పత్రికి పరుగెత్తాడు. కోమాలో ఉంది. కొద్దిసేపటికే స్వర్గస్థురాలైనది. అంతకు ముందు రోజునే‌ సంజయ్ గాంధీ మరణించారు. ఆఫిబ్రవరిలో హైదరాబాదు వచ్చింది పెద్దన్న వద్దకు - మాయింటికీ వచ్చింది - అరోజున సంపూర్ణసూర్యగ్రహణం. అమె నాకు ప్రాణస్నేహితురాలు. ఒక యేడాదే‌ పెద్దది మరి. తిరిగివెళ్తూ ఒకసారి నిడదవోలు రారా నీతో చాలా మాట్లాడాలీ‌ అంది. నేను వీలు చూసుకొని వెళ్ళేలోగానే తాను లోకాన్నే వీడిపోయింది.

మా అమ్మగారు స్వర్గస్థులైనపుడు నేను దగ్గర లేను. ఇంట్లో బోలెడు మంది ఆడపిల్లలు. వారందరికీ పెళ్ళిళ్ళు కావాలి కదా. అందుకు దండిగా డబ్బులు కావాలి కదా. అందుకని అయిస్టంగానే ఇ.సి.ఐ.యల్ కంపెనీకి రాజీనామా చేసి అమెరికా వలసవెళ్ళాను. మాఅమ్మగారికి ఇష్టం లేదు. పెద్దకొడుకుని పరాయిదేశం పంపటానికి ఏతల్లికి మనసు వస్తుంది చెప్పండి? కాని పరిస్థితినీ‌ కారణాలను అర్ధం చేసుకొని పంపారు ఆవిడ. కాని ఇంకా నేను అలా వెళ్ళిపోతున్నానని బక్కకోపం‌ పాపం ఆవిడను వదలలేదు. రెండేళ్ళ తరువాత కాని నాకు ఇండియాకు తిరిగి రావటం వీలు కాలేదు. సపత్నీకంగా భారతదేశం తిరిగివచ్చి అందరితో ఒక నెల కాలక్షేపం చేసి మాఅమ్మగారిని సంతోషపెట్టి తిరిగి వెళ్ళాను. ఒకటి నెలరోజులు గడిచాయో‌ లేదో ఆవిడను అస్పత్రిలో చేర్చారు ఇక్కడ హైదరాబాదులో. ఆవిడ పదిరోజులు చికిత్స తరువాత పరమపదించారు. నేను మరలా ఇండియా వచ్చేందుకు అప్పుడు అవకాశమే లేదు. అలా ఆవిడ చివరిక్షణాల్లోనూ‌ నేను దగ్గర లేకుండా ఉన్నాను.

ఇక వర్తమాన కాలం అంటే కరోనాప్రళయకాలం కదా. ఈపాడు కరోనా నా పెద్దతమ్ముడు సత్యశ్రీరామచంద్రమూర్తిని వచ్చి పట్టుకొంది. ఇంట్లో అతడి భార్యనూ‌ ఏకైకకుమారుడినీ‌ కూడా పట్టుకుంది. కాని వారిద్దరూ విడిపించుకొన్నారు. దురదృష్టవశాత్తు మాతమ్ముడు పరమపదం చేరుకున్నాడు. వారుండేది కాకినాడ. హైదరాబాదుకు అప్పట్లో 70ల్లో లాగా గోదావరిజిల్లాలు బహుదూరం కాదు. ఇప్పుడు నేను కొత్తగా ఉద్యోగజీవితం‌ అని ఎక్కడో‌ లేను. నేను విదేశాల్లో లేను. గట్టిగా మాట్లాడితే కొన్ని గంటల ప్రయాణపు దూరంలోనే‌ ఉన్నాను. కాని కోవిడ్ పుణ్యమా అని మా ప్రియసోదరుడిని చివరిచూపులు చూసుకోవటానికి కూడా వెళ్ళలేకపోయాను. రాత్రి కాకినాడలోని ఆస్పత్రి వర్గం వారు మీతమ్ముడు కోలుకుంటున్నాడనే చెప్పారు చల్లగా. ఇకరేపోమాపో యింటికి వస్తాడని ఆశపడ్డాను. ఉదయం సరిగా ఆరింటికి డాక్టరు గారు ఫోన్ చేసి వాడింక లేడనే‌ మాటను తెలియజేసారు. వాడి గురించి జ్ఞాపకంగా మారిపోయిన నా తమ్ముడు రామం అని ఒక టపా వ్రాసుకోవటం మించి ఏమి చేయగలను!

ఎప్పటినుండో రామకీర్తనలు పుస్తకాలుగా ప్రచురించమని బాగా పోరుపెడుతున్నాడు. నేను ధైర్యం చేయలేక వాయిదాలు వేస్తున్నాను. ఈమధ్యనే సరే అన్నాను. వాడెంతో సంతోషపడ్డాడు. ఇంతలోనే వెళ్ళిపోయాడు వాటిని అచ్చులో చూసుకోకుండానే. తానే ఆ పుస్తకాన్నో పుస్తకాలనో బ్రహ్మాండమైన సభచేసి మరీ విడుదల చేయించాలని ఎంతో ఉబలాటపడ్డాడు. వాడి కల నెరవేరలేదు. కొంచెం ఆగితే వాడికోసమైనా సరే నెరవేరేదేమో‌ కదా.

ఇలా ఇవన్నీ పరోక్షానుభవాలే. ఐనా కుటుంబంలో‌ జరిగినవే‌ కాబట్టి ప్రత్యక్షసాక్షుల కథనాలు ఉంటాయి కదా!

ఆరోజున అంటే 1975-అక్టోబర్-28న దీపావళి ఇంక నాలుగైదురోజుల్లో ఉందనగా నవమి నాడు మానాన్న గారు పరమపదించారు. ఆవృత్తాంతం చిత్రం. రాత్రి ఇంచుమించు ఎనిమిది గంటల ప్రాంతంలో కొంచెం ఛాతీలో పట్టినట్లుగా ఉంది కొద్దిగా వేడినీళ్ళు పెట్టి ఇమ్మని అడిగారు. కొద్దినిముషాల్లో నొప్పి ఎక్కువగా అనిపించిందట. దగ్గర్లోనే గవర్నమెంట్ హాస్పటల్ డాక్టర్ గారున్నారు. కబురు అందగానే అయన హుటాహుటిన వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్ కూడా చెప్పి వచ్చారు. ఆయన రాగానే మానాన్నగారు మంచం మీద నుండి కొంచెం‌గా లేచి 'నమస్కారం డాక్టర్ గారూ' అని అన్నారట. ఆయన మీరు ప్రశాంతంగా ఉండండి పరీక్షించాలి అన్నారట. పడకమీద వాలారు. ఉత్తరక్షణం లోనే తలవాల్చేసారట! అప్పటికి సమయం రాత్రి 8:10.

హఠాత్తుగా తీవ్రమైన హార్ట్ అటాక్ రావట‌ం వెనుక కారణాలు ఇప్పటికీ తెలియదు నాకు. నేను రాజోలు చేరుకునే సరికి మూడవరోజు ఉదయం. స్కూలు తాళాలు ఎవరడిగినా ఇవ్వద్దని చెప్పాను. కొన్నాళ్ళ తరువాత డీయీవో గారు కాబోలు వచ్చి రికార్డులు వెరిఫై చేసుకున్నారు. అప్పుడే తాళాలు తీసుకొని వెళ్ళాను. ఆశ్చర్యం ఏమిటంటే‌ స్కూలు తాలూలు అన్ని రికార్డులనూ‌ నాన్నగారు ఆరోజు ఉదయం 11గం. ప్రాంతంలో  పూర్తిగా సమీక్షించి సంతకాలు చేసారు. స్కూలుకు పదకొండు రకాలు కాబోలు అక్కౌంట్లు ఉంటాయి, డబ్బూ వగైరాతో ముడిపడ్డవి. అన్నింటికీ ఒకరిద్దరు మాష్టర్లు కూడా సహాయకులుగా ఉంటారు. వారిని కూడా పిలిపించి అన్నీ  సమీక్షించి సరిగా ఉన్నాయని నిర్ధారించి సంతకాలు చేయించారు, తానూ చేసివేసారు. డీయీవో &కో వారికి పని ఎంతో‌ సులభం ఐపోయింది. నాన్నగారికి సిక్స్త్ సెన్స్ ఉందా అని కొందరు విస్తుపోయారు. నిజానికి ఆయనకు అనారోగ్యంగా ఏమీ కనిపించనే లేదని అందరూ అన్నారు నాతో.

ఇలా ఇందరు అత్మీయులు వీడి వెళ్ళినప్పుడు ప్రతిసారీ ఇంత అన్యాయమా అనుకుంటూనే ఉన్నాను. నమ్మలేక ఎంతో‌ క్షోభ అనుభవించాను. ప్రస్తుతమూ అనుభవిస్తున్నాను.