ఈ పాడు కోవిడ్ మా తమ్ముడు తాడిగడప సత్యశ్రీరామచంద్రమూర్తిని పొట్టన బెట్టుకుంది.
కొద్ది రోజులు ఆ రక్కసితో పోరాడి అలసి చివరకు నిన్న 11వ తారీఖు కాకినాడలో ఉదయం 5:53సమయంలో పరమపదం చేరుకున్నాడు.
స్వయంకృషితో పైకి వచ్చిన వాడు మాతమ్ముడు. 1975లో, మానాన్న గారి మృతి అనంతరం నా అభ్యర్ధనపత్రం మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు గారు తక్షణం స్పందించి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారు మాతమ్ముడికి. వాడు చిన్నవాడు. అప్పుడప్పుడే డిగ్రీ పూర్తిచేసి ఉన్నవాడు. నేనా హైదరాబాదులో ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం మాత్రం ఐనది అప్పటికి.
ఆతరువాత అతడి ఎదుగుదల అంతా అతడి స్వయంకృషి ఫలితమే. చివరకు మంచి హోదాలోనే జిల్లాపరిషత్ సర్వీసు నుండి పదవీవిరమణ చేసాడు. ఆ తరువాత కూడా వారు మాతమ్ముణ్ణి వదలలేదు. కొత్తగా వచ్చే బేచ్ అఫీసర్లకు అడ్మిస్ట్రేటివ్ ప్రొసీజర్ల గురించి ట్రయినింగు క్లాసులు కండక్ట్ చేయమని పిలిచే వారు. అలా ఎందరికో కోచింగ్ ఇచ్చాడు. ఇక పెంక్షనర్ల కోసం అవిశ్రాంతంగా సహాయం అందిస్తూనే ఉండే వాడు. సామాజిక కార్యక్రమాల్లోనూచురుగ్గా ఉండేవాడు. ఇలా కాకినాడలో అందరికీ తలలోనాలుకలా ఉండే మాతమ్ముణ్ణీ కరోనా బలితీసుకుంది.
ఉద్యోగరీత్యా నేను హైదరాబాదుకు రావటం వలన మానాన్నగారి నిర్యాణానంతరం మా అమ్మగారూ మిగిలిన సోదరసోదరీమణులూ అందరూ కూడా హైదరాబాదుకు వచ్చేసారు నాదగ్గరకు. కాని జిల్లాపరిషత్ సర్వీసు కావటం వలన మా తమ్ముడు మాత్రం తూర్పుగోదావరిలోనే ఉండిపోవలసి వచ్చింది. అతడొక్కడూ కాకినాడలో, మిగిలిన అందరమూ హైదరాబాదులో అన్నమాట. ఐనా అస్తమానూ మాకోసం హైదరాబాదు పరుగెత్తుకొని వస్తూ ఉండేవాడు.
మేమంటే సహజమైన అభిమానం అనేకాదు. అతను మిక్కిలి స్నేహశీలి. ఎందరినో ఆదరంగా చూసేవాడు. ఎందరికో చదువు విషయంలో సహాయం చేసేవాడు. ఎప్పుడు చూసినా ఏబంధుత్వమూ లేని ఎవరో పిల్లలు ఒకరిద్దరు ఆతని ఇంట్లో స్వంతమనుష్యుల్లాగా తిరుగుతూనే ఉండేవారు.
ఇంకా ఎంతో చెప్పవలసింది ఉంది ఆతని గురించి. విడిగా వ్రాస్తాను వీలు చూసుకొని.
ఈ సర్వజనప్రియిడి మృతి విషయం మరునాడు అంటే నేటి స్థానిక పత్రికలలో కూడా వచ్చింది.
అతడి ఫోటోలు, కొన్ని కొన్ని ఆడియో వీడియో రికార్డులు చివరకు మాకు అతడి జ్ఞాపికలుగా మిగిలాయి.
రామకీర్తనలను అచ్చులో చూడాలని రామానికి ప్రగాఢమైన కోరిక. మన తెలుగు వాళ్ళు పుస్తకాలు చదువుతారా అదీ కొని మరీను. అందులోను కీర్తనలూ గట్రా అంటే ఎవరికి ఆసక్తి ఉంటుందిరా పోనివ్వు అని అంత సుముఖంగా ఉండే వాడిని కాను. ఐనా అదే విషయం ఏదో ఒక సందర్భం చూసుకొని ప్రస్తావిస్తూనే ఉండే వాడు.
ఈ 9వ తారీఖు సాయంత్రం ఐదున్నర మా రామానికి నేను పంపిన చివరి వాట్సాప్ సందేశం.
మధ్యాహ్నం డా. సందీప్ గారితో మాట్లాడాను. ఇంకా కొన్నిరోజుల పాటు ఆక్సిజన్ అవసరం అన్నారు. ముఖ్యంగా ఆహారం సరిగా తీసుకోవాలని నొక్కి చెప్పారు. సహించకపోయినా ధారకం లేకపోతే చిక్కుకదా. పుష్టిగా తినవలసిందే. త్వరలోనే నయం అవుతుంది. పైనెలలో నీచేతులమీద రామకీర్తనలు పుస్తకం విడుదల చేయాలి నువ్వు. ఏమీ దిగులు పడకుండా ఆహారం-మందులు-విశ్రాంతితో తొందరగా ఇంటికి వచ్చేయి.
-అన్నయ్య.
ఇలా ఉత్సాహపరుస్తూ ఉంటే ఐనా మానసికంగా ధైర్యం తెచ్చుకొని మాకు దక్కుతాడన్న ఆశతోనే రామకీర్తనలూ పుస్తకమూ అంటూ ఆశపెట్టాను. చిన్నపిల్లవాడికి మందుతాగితే మిఠాయి ఇస్తానని చెప్పినట్లు! ఐనా మా దురదృష్టం. వాణ్ణి దక్కించుకోలేక పోయాం.
నాయనా రామం, నీగురించి ఇలా వ్రాసుకోవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదురా తండ్రీ!