ఘడియఘడియకు నీనామ గానమాయె నాకు
నుడులనుడుల నీపేరే నోరు పలుకుచుండె
ఇతరక్రియాకలాపముల నెన్నిటినో చేయుచునే
ప్రతిక్షణమును రామనామ భావనతో గడుపనా
అతులితమగు రామనామామృతమునుసేవించి
యతిశయించుభాగ్యమే యబ్బె నది నీ దయతో
దినదినమును పొట్టకై దేశమెల్ల తిరుగుచునే
మనసు నిండియున్న నిన్ను మానక భావించనా
అనుక్షణము నీ తత్త్వము నాత్మలో చింతించుట
యనునది నాబాగ్యమే యబ్బె నది నీదయతో
పడును గాక యీ యుపాధి పడవలసిన నాటికి
చిడిముడి పడనేల నాకు చెడదుగా నాదీక్ష
చెడక నిలచు నీ యాత్మను చెందియున్న నీదయ
విడువకనది నీపాదసీమ విహరించును నిరతము