ప్రసాద్ ఆత్రేయ.
మంచి కవి, పండితులు.
కొన్ని పుస్తకాలు ప్రచురించారు.
ఒకప్పుడు హైదరాబాదులో ఈ.సీ.ఐ.యల్. కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసారు.
ప్రస్తుతం విశాఖపట్నం వాస్తవ్యులు.
హోమ్ క్వారంటైన్ ఆయన పరిస్థితి.
కరోనాకు ఎవరైనా ఒకటే.
ఆయన నాకన్నా చాలా పెద్ద వారు.
నాకు చాలా ఆత్మీయులు.
నాకు మేనమామ గారు. అంటే మా అమ్మమ్మ గారి సోదరి కుమారులు.
ఆయన కొడుకుల్లో ఒకడు అమెరికా మనిషి.
మరొక కొడుకు విశాఖపట్నం లోనే ఉంటాడు.
"రాడు. వాడిని చూసి పదకొండేళ్ళైంది" అంటా రీయన.
ఐనా ఇప్పుడు ఎవరు వస్తారు? ఎవరు పలకరిస్తారు.
సొంత అపార్ట్మెంట్ లోపల ఒంటిరిగా బేలగా ఉన్నారు.
కరోనా వస్తూనే ఒంటరితనాన్ని బహుమానంగా ఇస్తుంది.
హాస్పిటల్ వైద్యం వి.ఐ.పీలు కాని వాళ్ళకి దుర్భరమైన జనరల్ వార్డు సౌకర్యం రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది.
ఇతరులు స్పెషల్ రూమ్ తీసుకుంటే వైద్యం బాగుంటుందేమో తెలియదు.
కాని ఇల్లూ ఒళ్ళు గుల్ల అవటం అన్నది ఖాయం.
ఆ స్పెషల్ అందని అందాల చందమామే మన బోటి సామాన్యులకు.
ఈ దేశంలో ముసలాళ్ళు టాక్సులు కట్టటానికీ, వైద్యశాలకు బిల్లులు కట్టుకకోవటానికీ ఉన్నారు.
వి.వి.ఐ.పీలో, కాకపోతే కనీసం వి.ఐ.పీలో కాని ముసలి వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోరు దేశంలో.
ఈమాట శంకరులు ఎప్పుడో చెప్పారు.
ఇప్పుడు ప్రసాద్ గారిని చూసే వాళ్ళెవరూ లేరు.
సరైన సదుపాయాలు లేవు.
వేళకింత సరైన ఆహారమూ అందించే వారు లేరు.
సరైన వైద్యం చెసే వారూ లేదు.
నా కింకేం మాట్లాడాలో తెలియటం లేదు.