15, మే 2020, శుక్రవారం
నరవేషములో తిరుగుచు నుండును
నరవేషములో తిరుగుచు నుండును నానారకముల పశువులు
హరిహరి మీరా పశువుల మందల కతిదూరముగ నుండవలె
తిండితీర్ధములు దేవునిదయ యని తెలియని వాడొక పశువు
తిండియావలో దేవుని మరచి యుండెడు వాడొక పశువు
దండిగ సంపద లుండిన చాలని తలచెడు వాడొక పశువు
కండలు పెంచుచు గర్వాంధతతో నుండెడు వాడొక పశువు
హరి యను వాడొక డున్నా డనియే యెఱుగని వాడొక పశువు
యెఱుక చాలక హరియే లేడని యెగిరెడి వాడొక పశువు
యెఱిగియు హరిపై నమ్మక ముంచక తిరిగెడి వాడొక పశువు
హరి భక్తులను పరిహసించుచు మొఱిగెడు వాడొక పశువు
హరియే రామాకృతియై వచ్చుట నెఱుగని వాడొక పశువు
వరవిక్రముడగు రాముని రక్షణ వలదను వాడొక పశువు
తరణికులేశుని తత్త్వము లోలో తలచని వాడొక పశువు
నిరతము రాముని నిందించుచు సంబరపడు వాడొక పశువు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)