ఆరగింపవో మాయప్ప యివే
పేరిన నేతులు పెరుగులును
తేనెలు జున్నులు తెంకాయ పాలును
ఆనవాలు వెన్నట్లును
నూనె బూరెలును నురుగులు వడలును
పానకములు బహుఫలములును
పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును
కరజికాయలును ఖండమండెగలు
పరిపరివిధముల భక్ష్యముల
కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ
గుడుములు నిడ్డెన కుడుములును
సుడిగొను నప్పాలు సుకినప్పాలును
పొడి బెల్లముతోఁ బొరఁటుచును
కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు నేలకి కాయలును
పాయరాని యంబాళపుఁగాయలు
నాయతమగు దధ్యన్నములు
ఒడికవుఁ గూరలు నొలుపుఁ బప్పులును
అడియాలపు రాజాన్నములు
బడిబడిఁ గనకపుఁ బళ్ళెరములతోఁ
గడువేడుక వేంకటరమణా
ఇది ఆరవసంపుటం లోని సంకీర్తనం. ఇందులో, అన్నమాచార్యుల వారు వేంకటరమణుడికి ఆరగింపు నివేదిస్తున్నారు. చాలా భక్క్ష్య భోజ్యాదికాన్ని ప్రస్తావిస్తున్నారు. కొన్నింటిని చూదాం.
ముందుగా ఒక మాట.
ఈ సంకీర్తనం నాకు ఆర్కీవ్ డాట ఆర్గ్ లోనూ, యూట్యూబ్ లోనూ కనిపించింది. ఇది సుశీల, నాగేశ్వరనాయుడు గార్లు ఆలపించింది. ఆపాతమధురమైన సుశీల గాత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నాయుడు గారి గళం కూడా బాగుంది. ఐతే అదనంగా ఆరగింపవయ్యా అంటూ తరచూ వారి గానంలో వాడుక చేయటం నాకైతే అభ్యంతరం చెప్పదగిన విషయంగా అనిపించింది. అదీకాక నాయుడు గారు పాటను పల్లవితో మొదలు పెడుతూ ఆరగించవయ్యా అన్నారు. ఏదో ఒక మాటనే వాడుక చేయాలి కదా అన్నది మరొక అభ్యంతరం. అన్నమయ్య ఆరగింపవో అన్నప్పుడు పాటలో ఆద్యంతం అదే మాటను వాడుక చేయాలి. లేక పోతే మనం అన్నమయ్యకు మెఱుగులు దిద్ది ఆయనకే విద్య నేర్పినట్లు ఎబ్బెట్టుగా ఉంటుంది కదా.
ఈ సంకీర్తనలంలో అన్నమాచార్యుల వారు కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు అని మిరపకాయలను ప్రశంశించి చెప్పటం గమనించండి.
అన్నమయ్య జీవించిన కాలం మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503 వరకు. ఈ సమాచారం వికీపీడియా నుండి స్వీకరించాను. అలాగే వికీపీడియాలో మిరపకాయ సమాచారం చూదాం. ఆపేజీలో "1493లో వెస్టిండీస్‌కి రెండో నౌకాయానం చేసిన కొలంబస్కు ఫిజీషియన్ అయిన డిగో అల్వరేజ్ చన్కా, మొట్టమొదటగా మిరపకాయలను స్పెయిన్‌కు తీసుకొని పోవడంతో పాటు వాటి వైద్యపరమైన ప్రభావాల గురించి 1494లో అక్షరబద్దం చేశారు." అనీ, ఆ తరువాత "స్పెయిన్ నుంచి మిరపకాయలను పొందిన పోర్చుగీస్ వీటిని భారతదేశంలో సాగుచేయడం సైతం మిరప అనేది అన్ని దేశాలకు విస్తరించడానికి మరో ముఖ్యమైన కారణంగా నిలిచింది" అనీ చూడవచ్చును. వికీపీడీయా ప్రకారం మిరపకాయలు మొదట భారతదేశంలోని పోర్చుగీసు కాలనీలకూ ఆతరువాత మెల్లగా ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి.
ఈ కీర్తనలో అన్నమయ్య నేరుగా మిరియపు కాయలు అని మిరపకాయలను పేర్కొన్నారు కదా, భారతదేశంలోని ప్రవేశించిన మిరపకాయ కేవలం 1494 - 1503 మధ్యకాలంలో తిరుమల దాకా వ్యాపించటం అంత నమ్మశక్యం కాదు. పైగా విశ్వామిత్రసృష్టి అని మనవాళ్ళు దూరం పెట్టకుండానూ, ఆగమశాస్తం తాలూకు అభ్యంతరాలు దాటుకొని పూజారుల మడి ఇళ్ళలో దేవుడి ప్రసాదంలోనికి అంత త్వరగా మిరపకాయలు దూరగలవా? మీరే ఆలోచించండి. నాకైతే నమ్మకం లేదు. బహుశః మిరపకాయలు ఆ పోర్చుగీసు వాళ్ళు పట్టుకొని రాకముందే మనదేశంలో వాడకంలోంకి వచ్చి ఉండవచ్చును అనిపిస్తోంది నాకు.
ఈ కీర్తనలో తెంకాయ అన్నమాట కనిపిస్తుంది. తెంకాయ అంటే టెంకాయ అన్నమాట, తెన్ అంటే దక్షిణాది అని అర్ధం. దక్షిణప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందని కాబోలు ఈపేరు. అన్నట్లు తెనుగు అన్న మాటలో తెన్ కూడా ఇదే నట.
కరజికాయలు అన్నమాట కూడా ఉందిక్కడ. ఇప్పుడు మనం కజ్జికాయలు అంటున్నాం కాని పూర్వరూపం కరజికాయలు అన్నమాట.
ఇక్కడ అంబాళపు కాయలు కనిపిస్తున్నాయి కదా అవి అడవిమామిడి లేదా నల్లమామిడి పండ్లు అన్నమాట. ఈ చెట్టును శాస్త్రీయంగా Spondias mangifera అంటారు.
ఇప్పుడందరూ ఇడ్లీ అని అరవమాటకు పెద్దపీట వేసేస్తున్నారు కాని మొన్నమొన్నటి వరకూ ఇడ్డెన్లు అనే అనే వాళ్ళం.
ఖండమండిగెలు అంటే పాలూ చక్కర గోధుమపిండితో చేసే భక్ష్యం అట. బహుశః మన గోరుమీటీల వంటివేమో.
ఈ సంకీర్తనాన్ని అన్నమయ్య బ్లాగులో కూడా చూడవచ్చును.