31, అక్టోబర్ 2019, గురువారం

శ్రీహరి వీడే శివుడును వీడే



శ్రీహరి వీడే శివుడును వీడే సీతారాముడు వీడే
ఊహలుచేసి బేధము లెంచుట యుచితమె బ్రహ్మము వీడే

క్షీరజలధిలో శయనించెడు నా చిన్మయమూర్తి వీడే
ఆ రజతాద్రిని హాయిగనుండే ఆదిదేవుడు వీడే
వీరరాఘవ ప్రఖ్యను భూమిని వెలసిన దేవుడు వీడే
కారణజగతిని చక్కగ నడిపే ఘనుడగు బ్రహ్మము వీడే

మదనునిగన్న మంచితండ్రి యగు మాధవదేవుడు వీడే
మదనాంతకుడను మంచి పేరుగల మహాదేవుడును వీడే
మదనకోటి సుకుమారరూపమున మసలెడు రాముడు వీడే
విదితముగ జగమంతట నిండి వెలిగెడు బ్రహ్మము వీడే

స్థిరపదమున ధృవబాలుని నిలిపిన దేవదేవుడు వీడే
చిరజీవిగ నా మృకండసూనుని చేసిన శివుడును వీడే
వరమిడి కపిని బ్రహ్మను చేసిన వాడగు రాముడు వీడే
నిరుపమానమగు సృష్టికి మూలము పరబ్రహ్మమన వీడే