ఈరోజున ఆంధ్ర ప్రదేశ్ కి 2019 లో బాబు మరలా సి.ఎం ఐతే కలిగే లాభాలేంటి? అనే ఒక టపా చూసాను పతంగిసాంబ నేటిబారతం బ్లాగులో . అది చదివి కేవలం సరదాగా నేను అలాంటి టపా ఒకటి వ్రాస్తున్నాను.
- లోటస్ పాండ్లు. ఇవి ఇబ్బడిముబ్బడిగా నిర్మించబడతాయి. ముందు అన్ని ప్రముఖ నగరాల్లోనూ, మెల్లగా ప్రజల కోరికను కాదనకుండా ఊరూరా లోటస్ పాండ్లు నిర్మిస్తారు. అవి అటు పార్టీ కార్యాలయాలుగా నూ ఉపయోగిస్తాయి, ఇటు ముఖ్యమంత్రి గారికి రకరకాల (పాద)యాత్రల్లో విడుదుల్లాగానూ ఉపయోగిస్తాయి. అంతకంటే ముఖ్యంగా ఆంధ్రా అందాలను అవి ఎంతో గొప్పగా ఇనుమడింప జేస్తాయి. పర్యాటకం అభివృధ్ధి అవుతుంది. లోటస్ పాండ్ సందర్శకుల వలన వచ్చే రాబడిలో 10% రాష్ట్రఖజానాకు విరాళంగా ఇస్తారు. జగన్ గారు ప్రజానాయకుడిగా ప్రజలతరపున మిగతా సొమ్మును వినమ్రంగా స్వీకరిస్తారు.
- సామంతరాష్ట్రంగా ప్రత్యేకహోదా. అందరూ ప్రత్యేకహోదా కావాలీ కావాలీ అంటూ తెగ గడబిడ చేస్తున్నారు. కాని ఇప్పటికే మన అంద్రాకు ఒక ప్రత్యేకహోదా ఉందన్న సంగతిని మాత్రం తెలుసుకోలేక పోతున్నారు. ఇది రాష్ట్రవిభజన నాటికే ఏర్పాటయ్యింది కాని గుడ్డి ఆంధ్రాజనం తెలుసుకోలేక పోయారు. ఒకే గవర్నర్ అంటే మరేమిటీ, గవర్నర్ సాయంతో తెలంగాణాయే ఆంధ్రాను పాలిస్తుందని కేంద్రం ఏనాడో నిర్ణయించింది. తెలుసుకొని తరించండి బడుధ్ధాయిలూ! అందుచేత ప్రత్యేకహోదా అంటే, ఇంతవరకూ భారతదేశంలో సామంతరాష్ట్రాలు లేవు. ఇకపై ఆంధ్రా అనేది తెలంగాణాకు సామంతరాష్ట్రంగా ఉంటుంది అనే ప్రత్యేక హోదా అన్నమాట.
- పారదర్శకమైన పాలన. స్వంతంగా ఆంధ్రాప్రభుత్వం అంటూ తీసుకోవలసిన నిర్ణయాలు పెద్దగా ఏమీ ఉండవు.అన్ని నిర్ణయాలూ డిల్లీ అనుమతితో హైదరాబాదులో కేసీఆర్ గారి ఫార్మ్హౌస్ నుండే వస్తాయి.ప్రజల సౌకర్యార్థం పెద్దదొరలు ఈ వినయవిధేయ ఆంద్రారాములకు చెప్పే తలంటుతూ ఉంటారు లెండి. ఎందుకంటే వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు ఆనిర్ణయాలు నచ్చినా నచ్చక పోయినా. ఒక అవకాశం ఇచ్చి చూడటం అంటే ఏమిటో బాగా తెలిసివస్తుంది. ఇంక జనం చేతిలో ఏ అవకాశమూ ఉండదు నోరెత్తటానికి అని
- పోలవరానికి ఫుల్ స్టాప్. బాబుగారి అవినీతి సామ్రాజ్యం కూల్చివేయాలంటే తప్పదు మరి. అయినా ఆంధ్రాకు మాత్రం లాభం కలిగే ప్రాజెక్టుల వలన ఇతరరాష్ట్రాలకు ఇబ్బంది ఐతే ఎలా చూస్తూ ఊరకుంటారు ప్రభువులు?
- బందరుపోర్టు పరాధీనం. మీ కెందుకండీ ఆ పోర్టు ఆంధ్రులూ? తెలంగాణం వారికీ ఒక పోర్టు ఉండవద్దా? వాళ్ళకు సముద్రం లేకుండా అన్యాయం చేసిన మిమ్మల్ని ఏం చేస్తే పాపం ఉందీ? అందుకే ఒక్క బందరేమిటి అన్ని పోర్టులూ తెలంగాణా భాగస్వామ్యంతో నడుస్తాయి. బందరులా అన్నీ 100 శాతమూ తీసుకోరట లెండి. ఎంతన్నా చాలా మంచివాళ్ళు కదా మన తెలంగాణా ప్రభువులు
- జలవివదాల పరిష్కారం. చక్రవర్తులకు సామంతరాజులతో తగువులు వస్తే ఎవరు గెలుస్తారు? ఇప్పటి దాకా ఏదో గింజుకుంటున్నారు కాని. ఇకపై అన్ని జలవివాదాలూ పరిష్కారం అవుతాయి. నీళ్ళనీ పైనున్న రాష్ట్రంగా తెలంగాణాకే హక్కుభుక్తం అవుతాయి. ప్రభువులదయాధర్మసంప్రాప్తమైన నీళ్ళచుక్కలతో పండించుకొని తింటారో లేదో మీయిష్టం.
- కరెంటు వివాదాలు పరిష్కారం. ఇవీ నీళ్ళవివాదాల్లాగే పరిష్కారం అవుతాయి. ఇంక ఆంద్రాలో హాయిగా రోజుకు 24 గంటల చొప్పున మాత్రం పవర్ కట్ అమలు అవుతుంది.
- పరిశ్రమలకోసం దేశాలు తిరిగే శ్రమ ఉండదు. నీళ్ళు కరెంటూ కూడా లేని రాష్ట్రానికి పరిశ్రమలా? అవన్నీ మే< చూసుకుంటాం కదా అంటారు ప్రభువులు. ఇచ్చిందేదో తిని చచ్చినట్లు పడుండక హాయిగా పరిశ్రమలూ అభివృధ్ధీ అంటూ హైరాన పడే శ్రమ మీకెందుకు ఆంధ్రులూ?
- ప్రాంతీయపార్టీలు అంతరిస్తాయి. మరి జగన్ పార్టీ కూడానా అనకండి తెలివి తక్కువగా. ఆయన పార్టీ జాతీయ పార్టీ అవుతుంది. జగన్ పార్టీకి హైదరాబాదులోనో మరెక్కడో కూడా ఒకటో రెండో సీట్లు ఇప్పించటం జరుగుతుంది. తెలుగుదేశం లాంటి కుహనా జాతీయపార్టీలు అంతరింపజేయ బడతాయి. అదెలా అన్నారంటే మీకంటే మూర్థులు ఇంకెవరూ ఉండరు. తెలంగాణాలో కాంగ్ర్రెసే అంతరిస్తోంది చూడటం లేదా? ఇంక ప్రభువుల పార్టీ ఒకటీ, వారి సామంతుల పార్టీ ఒకటీ మాత్రం ఆంద్రాలో మిగుల్తాయి. ఈ సామంతుల పార్టీ ఎన్నాళ్ళుంటుందీ అని అడగరనే అనుకుంటాను.
- అమరావతి. దీన్ని ప్రభువిధేయమేతావులు భ్రమరావతి అంటున్నారు. ఇంక భ్రమలు అక్కర్లేదు. పరిపాలన అంతా హైదరాబాదు కేంద్రంగానే అని స్థిరపడ్డాక, ఆంధ్రారాజధానికి పేరుకో ఎకరం పొలంలో ఓ రెండు బిల్డింగులు చాలవూ? ఇప్పటికే సేకరించిన భూములూ పుట్రలూ అంటారా? ఎంతమాట, వాటిని ప్రభువులూ సామంతులూ వృధాగా పోనివ్వరు లెండి. ఎలా సద్వినియోగం చేయాలో వారికి చక్కగా తెలుసును, మీరేం దిగులు పడకండి.
- సంక్షేమ కార్యక్రమాలు. కొత్తగా అంద్రాకు అంటూ ఏమీ అవసరం ఉండదు. తెలంగాణావారికే ఆంధ్రాసంక్షేమం అప్పగిస్తుంది కేంద్రం.
- ఉపాధి కార్యక్రమాలు. వాటి కోసం ఎందుకు దండగమారి ఖర్చులు ఆంధ్రాలో? ఆంధ్రాయువకులకు ఉపాధికావాలంటే తెలంగాణా వారు కూలిపనికి పిలవటానికి సిధ్ధంగానే ఉంటారు. బీహారీ యువకులు రావటం లేదా హైదరాబాదుకు, ఆంద్రావాళ్ళూ రావచ్చును. పెత్తనం చేయటానికి రాకూడదు కాని కూలి చేయటానికి రావచ్చును. ఆంధ్రాలోనే ఉపాధి కావాలీ అంటే ఎలా? మీదసలే బీద రాష్ట్రం. పైగా సామంత రాష్ట్రం.
ఇలా జనగన్న వచ్చేసాక, అన్ని చిక్కులూ తీరిపోయి ఆంధ్రావాళ్ళు హాయిగా బానిస బ్రతుకులు బ్రతికేయవచ్చును.
కాదని బాబును ఎన్నుకున్నారో మరో ఐదేళ్ళపాటు ఎవరిమీదో ఒకరిమీద పోరాడుతూనే ఉండాలి మరి. అంత ఓపిక ఉందా మీకు? ఆలోచించుకోండి.
కాదని బాబును ఎన్నుకున్నారో మరో ఐదేళ్ళపాటు ఎవరిమీదో ఒకరిమీద పోరాడుతూనే ఉండాలి మరి. అంత ఓపిక ఉందా మీకు? ఆలోచించుకోండి.