23, మార్చి 2019, శనివారం

దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో...


ఈ మధ్యన లోపలి అలలు అన్న బ్లాగును చదువుతున్నాను. దుగ్గిరాల శ్రీశాంతి గారు చాలా బాగా వ్రాస్తున్నారు. ఈరోజున ఆవిడ తాజాటపా నాయనమ్మ పూనకం... చదివాను. బాగుంది.

టపా చివరకు వచ్చే సరికి అంతే నాలుగో నాడు తెల్లారే ఇంట్లో దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో తేలాయి అని ఒక మాట చెప్పారు.

ఈ  నాయనమ్మ పూనకం... టపా చదివాక కొన్నిసంఘటనలను గురించిన విషయాలు వ్రాయా లనిపించింది.

నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత కొన్ని నెలలకే అనుకుంటాను మా నాన్నగారికి రంపచోడవరం హైస్కూలుకు హెడ్మాష్టరుగా బదిలీ అయ్యింది.

నా ఉద్యోగప్రయత్నాలు నేను మెల్లగా చేసుకుంటూ ఉండే వాడిని. కాలక్షేపం కోసం కొందరు బీదవిద్యార్థులకు ట్యూషన్ చెబుతూ ఉండే వాడిని.

అలా నా దగ్గరకు ట్యూషన్ కోసం వచ్చే వాళ్ళలో ఒకమ్మాయీ అమె అన్నగారూ కూడా ఉండే వాళ్ళు.  ఆ అమ్మాయి పేరు లక్ష్మి. ఆమె అన్న పేరు ఇప్పుడు సరిగా గుర్తుకు రావటం లేదు. సత్యనారాయణ అనో మరొకటో. వాళ్ళు తాము కిరస్తానంలోని మతం మార్చుకున్నామని చెప్పారు.

ఒకరోజు ఆ అమ్మాయి నాతో రేపు పండగ కదా, ట్యూషన్ కోసం రామండి అంది. ఆ పండగ వినాయక చవితో వరలక్ష్మీ వ్రతమో సరిగా గుర్తుకు రావటం లేదు. వాటిల్లో ఒకటి మాత్రం అవును.

నేనన్నాను కదా, అదేమిటమ్మా మీరు మతం మారారు కదా ఇంకా ఈపండగలు చేసుకుంటున్నారా అని.

అప్పుడు ఆ అన్నా చెల్లెళ్ళు తమ మతాంతరీకరణ గురించి చాలా చెప్పారు.

పిల్లలకు చర్చి తరపున మంచిమంచి చదువులు చెప్పిస్తాం అని ఎన్నో హామీలు ఇస్తే పిల్లల బాగు కన్నా కావలసింది ఏముందీ అని వాళ్ళ అమ్మానాన్నా ఒప్పుకున్నారట. అప్పటికే కొన్ని నెలలుగా వాళ్ళను మతంలోనికి రమ్మని వివిధరకాలుగా అడుగుతున్నారట కానీ ఈ హామీ మాత్రం బాగా ఆకర్షించిందట.

మొత్తానికి మతం మారారు మొత్తం కుటుంబం అంతా.

ఆ తరువాత జరిగిన కథ మాత్రం ఆశించిన దానికి భిన్నంగా ఉన్నది. వాళ్ళను చర్చిలోనికి రానివ్వటం లేదు. అదేమిటీ అంటే మీరు ఇంకా బాప్తిజం తీసుకోలేదు అని అభ్యంతరం చెప్పారట. అదేదో త్వరగా ఇవ్వండీ అంటే దానికి ఎవ్వరెవ్వరి నుండో అనుమతులు రావాలీ, వాళ్ళొచ్చి ఇవ్వాలీ వీళ్ళొచ్చి ఇవ్వాలీ అని ఏళ్ళతరబడీ తిప్పుతున్నారట.  సరే అదలా ఉంచి పిల్లల చదువులకు సాయం చేస్తామన్నారుగా అంటే అదీ బాప్తిజం మీరు తీసుకున్నాకే ఆ సాయాలు గట్రా అంటున్నారట.

వీళ్ళదా చాలా బీదకుటుంబం. అప్పటి వరకూ ఏదో బంధువులు కొద్దోగొప్పో తమస్తోమతును బట్టి చిన్నా పెద్దా సాయాలు చేస్తూ ఉండే వారట ఈ పిల్లల చదువులకు. ఈ కుటుంబం అనుకుందీ, ఇలా బందువులపై భారం  ఎన్నాళ్ళు మోపుతామూ, ఈ చర్చివాళ్ళు పిల్లలకు సాయం చేస్తే ఇటు బంధువులను ఇబ్బంది పెట్టక్కర్లేదూ మనం మరొకళ్ళని ఏమీ అడగక్కర్లేదూ ఉభయతారకంగా ఉంటుంది మతంమారటం అని.

ఇప్పుడు ఇటు ఆమతం వాళ్ళు పూర్తిగా చేరదీయనూ లేదు సాయమూ చేయటం లేదు. అటు ఉన్న బంధువులు వద్దన్నా మతం మారి వాళ్ళకూ దూరం అయ్యారు.

పూర్వం ఇంట్లో పండగలన్నీ ఉన్నంతలో ఆనందగా చేసుకొనే వారట. గుళ్ళకూ తరచూ వెళ్ళే వారట.

ఇప్పుడు అటు చర్చి రానివ్వటం లేదు. ఇటు గుళ్ళోకి వెడితే ఊళ్ళో వాళ్ళు ఆక్షేపిస్తున్నారు.

ఇలా చెప్పుకొని ఆపిల్ల కళ్ళవెంట నీళ్ళు కార్చింది.

అందుచేత పండగలన్నీ ఇప్పటికీ ఒక్కటీ మానకుండా అంతే భక్తిగా చేసుకుంటున్నారట. కాని తమ ఇంట్లోనే కొంచెం గుట్టు చప్పుడు కాకుండా తలుపులు వేసుకొనీ మరీ చేస్తున్నారట.

అప్పుడు నేనో మా అమ్మగారో గుర్తులేదు కాని ఒక ప్రశ్న వేసాము. మీ యింట్లో మీరు పండగ చేసుకుంటే తలుపులు ఎందుకు వేసుకోవటం అని.

దానికి వచ్చిన జవాబు ఏమిటంటే బంధువులు కొంచెం సానుభూతితో అర్థంచేసుకుంటున్నారట, కాని ఒకటి రెండు సార్లు చర్చి వాళ్ళు ఇంటి మీదికి వచ్చి చాలా రభస చేసి వెళ్ళారట.

మీరు సరైన దైవవిశ్వాసులు కాకపోతే మీకు బాప్తిజం ఇవ్వటం ఎలా అని కోప్పడ్డారట.

అందుకని బయటకి కిరస్తానమూ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా సనాతనధర్మమూ నడుస్తున్నాయి వాళ్ళింట్లో. దేవుళ్ళ బొమ్మలూ కాలెండర్లూ అవీ ఎవరికీ కనబడకుండా ఒక పాత పెట్టలో ఉంచారట. వాటికి పండగపబ్బాలప్పుడు పెరోల్ దొరుకుతూ ఉంటుందట.

ఇక రెండవ సంఘటన నేను హైదరాబాదుకు ఉద్యోగనిమిత్తం వచ్చాకనే జరిగింది. అది మేము సీతాఫలమండీలో ఉన్న రోజుల్లోని ఘటన.

నాకు చంద్రప్రకాశ్ అని ఒక ప్రియమిత్రుడు ఉన్నాడు. ఇప్పుడాయన విజయవాడలో ఉన్నాడు. అప్పట్లో ఒక యింట్లో నేను మా అమ్మా, అన్నదమ్ములూ అప్పచెల్లెళ్ళతో ఒకవాటాలోనూ మరొకవాటాలో ఈచంద్రప్రకాశ్ బ్రహ్మచారిగాను అ అద్దెకు ఉండే వాళ్ళం. ఈ చంద్రప్రకాశ్ మా అఫీసులోనే పనిచేసేవాడు. మా ప్రక్కవాటాలో అన్న పేరే కాని మాయింట్లోనే మా అమ్మపిల్లల్లో ఒకడిగానే మసులుతూ ఉండేవాడు. మేమిద్దంగా అంటుకు తిరుగుతూ ఉండే వాళ్ళం నిత్యమూ.

ఒకసారి అతను తమ స్వస్థలం విజయవాడకు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి చెప్పిన విశేషాల్లో ఈ సంగతి చెప్పాడు.

తమ ఇంటికి దగ్గర్లో ఒక యింట్లో ఒకమ్మాయికి దెయ్యం పట్టిందట.

దాన్ని వదిలించే క్రమంలో ఆ కుటుంబం చేసిన రకరకాల ప్రయత్నాల్లో ఒకటి ఎవరో చెప్తే, ఒక దెయ్యాలు వదిలించే ఫాదిరీ గారి దగ్గరకు వెళ్ళటం.

ఏం జరుగుతుందో చూదామని వెళ్ళిన వాళ్ళలో ఈ చంద్రపకాశ్ కూడా ఉన్నాడు.

ఆ ఫాదిరీ గారు కొంచెం హంగామా అదీ చేసినా దెయ్యం పోలేదూ, అదుపులోనికి కూడా రాలేదు.

అప్పుడు ఆయన పిల్లను తీసుకు వచ్చిన వాళ్ళతో ఏమని చెప్పాడో తెలుసా అని అడిగి చంద్రపకాశ్ చాలా సేపు నవ్వుతూ కూర్చున్నాడు.

ఏమన్నాడయ్యా అంటే, ఆ ఫాదిరీ గారు, "ఈ పిల్లను పట్టుకున్నది చాలా గడ్డు దెయ్యం. ఆ దెయ్యం పేరు కాళికా దేవి" అని.

పిల్ల తరపు వాళ్ళు తెల్లబోయి అదేమిటీ అంటే ఆయన సెలవిచ్చిన మాటలు, వినండి. "కాళికా దేవి నుండి ఎవ్వరూ కాపాడలేరు. అది చాలా మొండిదీ క్రూరమైనదీ కూడా. ఒక్క దేవుడే ఈ పిల్లనీ మిమ్మల్నీ కాపాడాలి. మీరేమో దైవ విశ్వాసులు కారు. కాబట్టి మీరంతా దైవవిశ్వాసులై ప్రార్థనలు చేసి నమ్మకంతో ఏసుప్రభువును వేడుకుంటే ఆయన ఈ అమ్మాయినీ మిమ్మల్నీ ఆ కాళికాదేవినుండి కాపాడతాడు. మరొక దారి లేదు. ఇంకెవ్వరూ కాళికను తరమలేరు ఏసు తప్ప" అని .

ఆ తరువాత ఏం జరిగిందో చెప్పమంటే, అందరూ ఫాదిరీ గారితో కొంచెం ఘర్షణ పడ్డారట, పిల్లను తీసుకొని అక్కడ నుండి ధుమధుమలాడుతూ వెళ్ళిపోయారట.

మరేమన్నా కథ నడిచిందా అంటే చంద్రప్రకాశ్ చెప్పలేడు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన నాడే బయలుదేరి అతను హైదరాబదుకు తిరిగి వచ్చాడు.

మతం మారతం అంటే హిందువులు ఏ కిరస్తానంలోని వెళ్ళటం అనే అర్థమే రానక్కరలేదు. మనలోనూ చాలాచాలా ఉపమతాలు పుట్టుకొని వచ్చాయి.

అలాంటి ఒక ఉపమతం లోనికి మా దగ్గర బంధువుల కుటుంబం ఒకటి మారింది. అది నా పెళ్ళికాక మునుపే.

ఆ కుటుంబం తాలూకు వ్యక్తుల ద్వారా సదరు ఉపమతం వారు నన్నూ మాకుటుంబాన్ని తమలోనికి ఆహ్వానించే ప్రయత్నమూ బాగానే చేసారు అప్పట్లోనే.

నిజానికి అలా మొదట ఆ ఉపమతం లోనికి వెళ్ళింది మా బంధువర్గంలోని ఒక అమ్మాయి కుటుంబం. వాళ్ళు మొదట్లో ఎంతో నిష్ఠగా రాముణ్ణి కొలిచే వారు.  శ్రీరామనవమి ఎంతో ఘనంగా చేసేవారు.  ఆవైభవాన్ని మా అమ్మగారే కళ్ళారా చూసి ఆనందించి నాకు చెప్పారు కూడా.

సరే వారంతా ఆ ఉపమతం స్వీకరించారు. క్రమంగా ఆఅమ్మాయి పుట్టింటి వారూ ఆ మతంలోనికి మారారు.

అప్పట్లో వారింట్లో ఉండే అర్చావిగ్రహాలూ అవీ అన్ని హుస్సేన్ సాగర్లో పారేసారని చెప్పి అందరూ చెప్పుకొని బాధపడే వారు. నాకు మరీ ఎక్కువ వివరాలు తెలియవు.

ఒక్కటి మాత్రం నిజం. ఆ అమ్మాయి కన్నతల్లి మాత్రం అటు స్వధర్మాన్ని విడచి రాముణ్ణి మరవలేకా ఇటు ఈ కొత్తమతంలో ఇమడలేకా చాలా అవస్థపడటం నాకు ప్రత్యక్షంగానే తెలుసు. ఈమధ్యనే ఆవిడ కా బాధనుండి భగవంతుడు విముక్తి కల్పించాడు. ఇలా మతం లోనికి మారటం వలన ఇబ్బంది పడే ఒక జీవి కథను ఒక కోడలి కథ అని నేను శ్యామలీయంలో వ్రాసాను.

ఇదంతా ఎందుకు చెప్పానంటే దుగ్గిరాల శ్రీశాంతి  గారు దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో... అని అనగానే పై సంఘటన లన్నీ మనస్సులో మెదిలాయి కాబట్టి.