9, ఏప్రిల్ 2018, సోమవారం

నరులకష్టము లన్ని నారాయణ


నరులకష్టము లన్ని నారాయణా నీవు
నరుడవై  తెలిసితివి నారాయణా

పరమపురషుడ వయ్యు నారాయణా గర్భ
    నరకమున జొచ్చితివి నారాయణా
దురితాత్ములను గూల్చ నారాయణా నీవు
    ధరమీద కలిగితివి నారాయణా
పరిణయవేళనే నారాయణా నీకు
    పరశురాముడు తగిలె నారాయణా
ధరనిచ్చుటకు మారు నారాయణా నిన్ను
    తరిమిరే యడవులకు నారాయణా

అడవి నసురుల వలన నారాయణా నీకు
    పడరాని పాట్లాయె నారాయణా
కడకొక్క తుంటరి నారాయణా సతికి
    నెడబాపెనే నిన్ను నారాయణా
కడచి వారాన్నిధిని నారాయణా తుళువ
    మడియించితివి నీవు నారాయణా
పుడమి నేలెడు వేళ నారాయణా సతిని
    విడువవలసి వచ్చె నారాయణా

ఈ రీతిగా నీకు నారాయణా పుడమి
    ఘోరాపదలు గలిగె నారాయణా
ధీరత్వమును జూపి నారాయణా ధర్మ
    వీరత్వమును జూపి నారాయణా
ఆరాధ్యదైవమై నారాయణా మాకు
    దారిచూపితి వయ్య నారాయణా
శ్రీరామచంద్రుడని నారాయణా నిన్ను
    నోరార పొగడెదము నారాయణా