4, మార్చి 2018, ఆదివారం

కేసీఆర్ గారి అంతర్యం పై ఒక ఆలోచన.



ఆంధ్రావాళ్ళు తమకు జరిగిన అన్యాయం పైన గోలగోల చేస్తున్నారు.
ఒకవేళ వాళ్ళకు తగిన మద్దతు దొరికితే ఆంధ్రులకు న్యాయం జరిగే అవకాశమూ ఉంది.

సరిగ్గా ఇప్పుడే, ఉన్నట్లుండి, ఒక గొప్ప ప్రకటన!

దేశంలోని రాజకీయం అంతా భ్రష్టుపట్టి పోయిందని కేసీయార్ గారూ హఠాత్తుగా రంకెలు వేస్తున్నారు.
దీని వెనుక ఆయనకొక ఆలోచన ఉంది.

చిన్న పామైనా పెద్దకర్రతో కొట్టమన్నారు.
ఆంద్రులు తమకు న్యాయం సాధించుకొనే అవకాశం నూటికి ఏ పదిశాతమో ఉండవచ్చును.
కానీ అది మాత్రం ఎందుకు పడనివ్వాలీ అని మనస్సులో అనుకొనే వాళ్ళూ ఉంటారు.

అటువంటి వారిలో కేసీఆర్ గారు ఒకరు అని అనుకొంటున్నాను.
అటువంటి వారికో కేసీఆర్ గారు ఒకరు కారు అనుకొందుకు అవకాశం ఏమీ లేదు కాబట్టే అలా అనుకోక తప్పదు.

రాజకీయులు అలా అలోచించే అవకాశం ఉంది తప్పకుండా.

కేసిఆర్ గారు తెలివైన వారు. అంటే చతురులు. నిర్మొగమాటంగా చెప్పాలంటే గొప్ప జిత్తులమారి.
ఆయన మాటల్లోని ఆంతర్యం తెలుసుకోండి.

రాజకీయవాతావరణంలో  ప్రస్తుతం ఆంధ్రా అనేది కేంద్రబిందువుగా సాగుతున్న చర్చను దారి మళ్ళించటమే ఆయన ఉద్దేశం.

అబ్బెబ్బే కవితగారూ కేసీఆర్ గారూ కూడా ఏదో ఆంద్రులకి వత్తాసు ఇస్తూనే మాట్లాడారే నిన్నమొన్ననే అని అనుకోవచ్చును.

రాజకీయులు మనస్సులో ఉన్న మాటనే మాట్లాడుతారన్న నియమమూ నమ్మకమూ ఏమన్నా ఉందా?

నోటితో నవ్వి నొసటితో వెక్కిరించటం రాజకీయులు చేయరనో చేయలేరనో అనుకునే అమాయక చక్రవర్తులకి ఒక దండం.

ఉభయప్రాంతాలకూ సమంగా న్యాయం జరిగేలా విభజన చేస్తాం చేస్తే గీస్తే అన్న కాంగ్రెసు, ఆంద్రులకు బుజ్జగింపు మాటలు ఎన్ని చెప్పలేదు? చివరికి చేసిందేమిటీ?

ఒక సమయంలో ఒక పెద్ద రాజకీయ దుమారం రేగితే దానిమీద చర్చను పలుచనచేయటానికి మరికొన్ని అదేస్థాయి రాజకీయ దుమారాలు సృష్టించటం ఒక మంచి దారి, వీలైతే మరింత పెద్ద రాజకీయ దుమారం రేగితే మొదటి అంంశం  చర్చనుండి ప్రక్కకు పోతుంది.

అందుకే, అలా ఆంద్రాపై జాతీయ రాజకీయరంగలో కొద్దోగొప్పోగా ఏర్పడుతున్న ఫోకస్ ఉన్నదే, దాన్ని పలుచన చేయాలన్నదే కేసీఆర్ గారి ఎత్తుగడ కావచ్చును తప్పకుండా.

జాతీయరాజకీయాల్లోనికి రానూ, నాకు ఆసక్తి లేదూ అని విస్పష్టంగానే లోగడ వాక్రుచ్చిన శ్రీమాన్ కేసీఆర్ గారికి  ఉన్నట్లుండి, జాతీయ రాజకీయాల్లోనికి రావాలని అనిపించటమూ అసలు భారతజాతికే దిశా దశా నిర్దేశం చేసి తరింపజేయాలన్న పుణ్యసంకల్పం కలగటమూ కేవలం ఉన్నట్లుండి హఠాత్తుగా బీజేపీ కాంగ్రెసు పార్టీలు రెండూ దొందూ దొందే అన్న జ్ఞానోదయం కావటం అని నమ్మటం కుదరదు.  ఎంతమాత్రమూ కుదరదు!

అందుకనే దేశరాజకీయాల్లో మూడో ఫ్రంటూ అదీ తన నాయకత్వమూ అంటూ పాట మొదలు పెట్టి ఆ చర్చతో ఆంద్రాపై జాతీయస్థాయి రాజకీయాల్లో ఫోకస్ తప్పిపోయేలా చేయాలన్నదే ఆయన ఆంతర్యం అని నమ్మవలసి వస్తోంది.

పవన్ కల్యాణ్ వంటి అమాయక చక్రవర్తులు తమను తాము రాజకీయ మేథావులుగా భావించుకొంటూ సంబరపడిపోతే పోవచ్చు కాక. సగటు భారతీయుడు ఇంత చిన్న విషయం గ్రహించలేడని అనుకోను. పొనీ సగటు ఆంద్రుడు ఇంంత అమాయకంగా  నమ్మి జైజై అనేస్తాడని అనుకోను.

వీర కేసీఆర్ అభిమానులూ, తాము రెండు పెద్దపార్టీలకూ వ్యతిరేకం కాబట్టి కేసీఆర్ గారికి స్వాగతం చెప్పటం కోసం తొందరపడిపోవాలనుకొనే కొన్ని చిల్లరపార్టీల చిన్నాపెద్దా నాయకులూ నేను అర్థం చేసుకున్న కోణంలో ఆలోచించటానికి ఇష్టపడక పోవచ్చును.

కాని ఈ కోణం కూడా తప్పక ఆలోచించదగినదే.

ఒక పులీ ఒక సింహమూ రెండూ కూడా అడవిని భక్షిస్తున్నాయే కాని రక్షించటం లేదని మరొక క్రూరమృగాన్ని అడవికి రాజును చేసినా పరిస్థితిలో ఏమీ మార్పు ఉండదు. స్వతహాగా రాజకీయులంతా క్రూరమృగాల్లాగే ఉన్నారు నేటి రాజకీయాల్లో ఎవర్నీ నమ్మే పరిస్థితి లేదు. అందరూ స్వార్థపరులే - పోనీ నూటికి తొంభైతొమ్మొది శాతం మంది ఐనా అదే బాపతు.

ఆంద్రులు ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ కేసీఆర్ గారికి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఇస్తే ఆంద్రులకు బ్రతికే హక్కు కూడా లేదని బిల్లు పాస్ చేయగల సమర్థులు.  తెలంగాణా ఉద్యమం పేరుతో ఆంద్రులపై ఎన్నెన్నో అవాచ్యాలు మాట్లాడిన మహానుభావుడు తమపై నిజంగా సానుభూతి కలిగి ఉన్నాడనో, జాతీయరాజీకీయాలకు నిజాయితీనో నిస్వార్థతనో జోడిస్తాడనే అమాయకంగా నమ్మటం అంటే కొరివితో తలగోక్కోవటమే.  తస్మాత్ జాగ్రత జాగ్రత.