18, జనవరి 2018, గురువారం

మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు - 1


నిన్న శంకరాభరణం బ్లాగులో వాగ్దానం చేసినట్లుగా సమస్యాపూరణాలను గురించి కొన్ని టపాలు వ్రాస్తున్నాను.

ఇప్పుడు వ్రాయబోయేవన్నీ మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణలు.

ఈ మోచెర్ల వెంకన్న గారు నెల్లూరు మండలం వేంకటగిరి సంస్థానంలోని తెట్టు గ్రామ నివాసి అయిన నియోగి భ్రాహ్మణులు. ఈయనా వారి సోదరుడు దత్తప్ప గారూ మంచి ఆశుకవులు.

ఒకరోజున వెంకన్న గారింటికి అభ్యాగతుడుగా ఒక సంస్కృతపండితుడు వచ్చి తనగోడు చెప్పుకున్నాడు. ఆయన రాజదర్శనానికిపోతే అవమానం జరిగింది.

రాజుగారు తెలుగులో పద్యాలు చెప్పగలరా? అని అడిగారు.

ఈయనేమో అయ్యా నేను వయ్యాకరణిని, సంస్కృతంలో శ్లోకాలు చెప్పగలను కాని తెలుగులో కవిత్వం చెప్పలేను అన్నాడు.

రాజుగారు తెనుఁ గెఱుఁగఁడు సంస్కృతంపు తెన్నే మెఱుఁగున్ అని చెప్పి చులకనగా అన్నారు.

ఈ కథనం విని వెంకన్న గారు బాగా నొచ్చుకొని ఆ పండితుడితో పదవయ్యా స్వామీ నీకా రాజు  చేతనే సన్మానం చేయిస్తానూ అని ఆయనను వెంటబెట్టుకొని వెళ్ళి రాజుగారికి తెలుగు కవులు వచ్చారని కబురు పెట్టారు.  రాజు గారు ఆహ్వానించి మీ దే ఊరండి అని అడిగి తెట్టేనా అని హాస్యం చేసారు.

వెంకన్న గారికి మండి ఇలా అన్నారు.

తెట్టు కుమారకృష్ణజగతీవరనందన రాజ్యలక్ష్మికిం
బట్టు ధరాంగనామణికిఁ బాపట బొట్టు రిపూరగాళి వా
కట్టు సముజ్వలధ్ధృతికి గట్టు బుధాళికి వేల్పుఁ జెట్టు వా
గ్దిట్టల కున్కి పట్టును మదీయ నివాసము యాచభూపతీ

ఈ ఆశువుగా వచ్చిన అంత్యానుప్రాసలతో నిండి మనోహరంగా ఉన్న పద్యం విని రాజుగారు మహదానంద పడ్డారు. స్వరం మారింది

అయ్యా తమపేరేమి?

నా పేరు వెంక నందురు
భూపాలకమకుట నీలపుంజమిళిందో
ద్ధీపితపాదాంబుజ కరు
ణాపర వెలుగోటి యాచనరనాథేంద్రా

రంగం సిధ్ధమైంది. రాజు గారికి కవిగారిని సత్కరంచాలని కోరిక కలిగింది, సభాసదులకు కవి ప్రతిభను మరింతగా వెల్లడించి ఆపని చేస్తే బాగుంటుంది కదా.

రాజు గారి ప్రశ్న. అయ్యా తమరు గంటకు ఎన్ని పద్యాలు చెప్పగలరు?
(ఇక్కడ నాదొక సందేహం గంట అనా ఘడియ అనా అని? దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు గంట అన్నారు)

వెంకన్న గారి జవాబు చూడండి. ఊరక పద్యములు చెప్పుట కాదు. ఆశువుగా సమస్యలనే పూరించగలను. కావలసినచో పరీక్షించుకొనవచ్చును.

ఇంకేమి సమస్యలే సమస్యలు పూరణాలే పూరణాలు. అదీ ఆశువుగా.

ఒకటా రెండా? ఇంచుమించు ఒక యాభై దాకా సమస్యాపూరణాలు.

అవన్నీ మనం వచ్చే టపాల్లో చూదాం.