మనసున రాముడు మాత్రము కలడని యనగలిగితివా యది మేలు మనసిచ్చితివా రఘువల్లభుడు మరువక సేమము కూర్చునయా |
|
హరి యాత్మీయుడు కరుణామయుడై యరుదెంచిన శుభసమయమున నరుడా నీ వెటువంటి విధంబున జరిపెదవో నీ సేవలను పరిపరి విధముల పరిచర్యలతో ప్రభువుకు మోదము కూర్చెదవో పొరబడి నిర్లక్ష్యము చేసెదవో బుద్ధిహీనత బయలుపడ |
మనసున |
అక్కర వేళల పదుగుర కొకగది యమరించెడు విధమను నటుల చక్కగ కామక్రోధాదులకును సవరించితివా హరిగదిని నిక్కువ మాహరి నీచుల సరసన నిలువనేరక వెడలునయా దక్కిన యవకాశంబును విడువక దశరథనందను కొలువవయా |
మనసున |
మనసు పాతసామానుల గది వలె మారుట మంచిదికాదు సుమా పనికిమాలిన చెత్తనంతటిని పారవేసి సవరించవయా మునుకొని హరిమయమగు తలపులతో మనసును తీరిచి దిద్దవయా యినకులపతిమందిరమై యుండిన మనసే మనసని తెలియవయా |
మనసున |
22, అక్టోబర్ 2016, శనివారం
మనసున రాముడు మాత్రము కలడని
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)