8, జులై 2016, శుక్రవారం

రెండు పద్యకంఠీరవాలు!



వరంగల్లులో అష్టావధానం అంటూ శంకరాభరణం బ్లాగులో కంది శంకరయ్య గారు ఒక టపా ప్రచురించారు. ఆ టపాలో సదరు సభకు పిలిచే ఆహ్వానపత్రాన్ని ఫోటోతీసి వేసారు. అందులో ముఖ్య అతిధి గారు సహస్రపద్యకంఠీరవ బిరుదాంకితులు. శంకరయ్యగారిని సహస్రపద్యకంఠీరవ అంటే ఏమిటో బోధపడలే దండీ అని ప్రశ్నిస్తే ఆయన నాకు ఇచ్చిన జవాబును ఇక్కడ ప్రచురిస్తున్నాను.

శ్యామల రావు గారూ, వారికి ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఆ బిరుద మిచ్చారో నాకు తెలియదు. ఈరోజు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి డా. ఇందారపు కిషన్ రావు (ప్రసిద్ధ అష్టావధాని) గారి ఇంటికి వెళ్లినప్పుడు వా రన్నారు "ఈ సహస్ర పద్య కంఠీరవ ఏమిటి? ఆయనను ఏకధాటిగా వేయి పద్యాలు అప్పగించే సామర్థ్యం ఉంది. అందుకు సహస్ర పద్య పఠన కంఠీరవ అనో సహస్ర పద్య ధారణా కంఠీరవ అనో అనాలి. కాని సహస్ర పద్య కంఠీరవ అనడం తప్పు" అన్నారు.

ఈ జవాబులో ఏకధాటిగా పద్యాలు అప్పగించే సామర్థ్యం గురించిన ప్రస్తావన చదవగానే నాకు నా చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

మా నాన్నగారు కీ.శే. తాడిగడప వేంకట సత్యనారాయణగారు 60ల్లో తూర్పు గోదావరిజిల్లా గెద్దనాపల్లెలో ప్రాథమికోన్నతపాఠశాలకు ప్రథానోపాధ్యాయుగా ఉండేవారు. పాఠశాలా విద్యార్థులకు మా పాఠశాల వార్షికోత్సవం వచ్చిన సందర్భంలో రకరకాల పోటీలు పెట్టేవారు. వార్షికోత్సవాలు చాలా సందడిగా జరిగేవి.

ఒకసారి పద్యాలను అప్పగించటం పైన పోటీ నిర్వహించారు.

ఆ సంవత్సరం నాతోపాటు మా బేబీపిన్ని కూడా చదువుకొన్నది ఆ పాఠశాలలో.

ఇద్దరం కంటికి కనబడ్డ ప్రతిపద్యాన్నీ బట్టీ పట్టటం మొదలు పెట్టాము.

ఈ పోటీ జరిగే విధానంలో ఒక మెలిక పెట్టారు. మొదటగా ప్రతి అభ్యర్థీ వేదికమీదకు రాగానే వచ్చిన పద్యాల లిష్టును జడ్జీలకు అందించాలి. వాటిలోనుండి జడ్జీలు చదవమని అడిగిన ప్రతి పద్యాన్నితప్పుల్లేకుండా చదవాలి. అంతేనా అనకండి. జడ్జీలు అడిగితే పద్యం అర్థాన్నీ వివరించాలి మరి. అదీ మెలిక.

పాఠ్యపుస్తకంలోని పద్యాలు అన్నీ పిడి వేసేసాం. నా కంటే మా పిన్ని ఒక క్లాసు పెద్ద. ఐనా నా పుస్తకంలోనివీ తన పుస్తకంలోనివీ అన్నీ పట్టేసాం. అప్పట్లో ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో కూడా పద్యాలు వచ్చేవి. ఇంట్లో అవి బోలెడున్నాయి. అవన్నీ బట్టీ ఐపోయాయి.

కొన్ని శతకాలు కూడా ఉన్నాయి మా యింట్లో. వాటిల్లోనుండీ వీలైనన్ని భట్టీయం వేసాం

పద్యం దొరకగానే బట్టీ పట్టటం. ఒకరి కొకరు అప్పచెప్పుకోవటమూ మొదటి ఘట్టం.

ఆతరువాత మా నాన్నగారి దగ్గరకు పరిగెత్తి ఆ పద్యం అర్థం చెప్పమని ఒకటే పోరు పెట్టటం.

ఇలా వందలమీద పద్యాలను కంఠగతం చేసుకున్నాం.

ఇద్దరమూ చెరొక నాలుగువందల పద్యాలూ లిష్టులు వేసి ఇచ్చాం.  పాపం మిగతా పిల్లలంతా పదిపరకపద్యాల లిష్టులే సమర్పించా రనుకుంటాను.

నన్నొక ఇరవయ్యో పాతికో పద్యాలను అడిగారు ఒకటి అప్పగించగానే మరొకటి చొప్పున. చాలా వాటికి అర్థాలు కూడా అడిగారు.

మా పిన్నినీ అలాగే అడిగారు.

ఇద్దరం సమఉజ్జీగానే చెప్పాం.

ఒక్క చోట కాబోలు తాను అర్థం వివరించటంలో కొంచెం తడబడిందనో లేదా తనకంటే నేనొక యేడాది చిన్నవాడిని కదా అనో నాకు మొదటిస్థానమూ ఆమెకు రెండవస్థానమూ ఇచ్చారు. మరీ చిన్నపిల్లలం కదా అని బహుమతులే ఇచ్చారు కాని న్యాయంగా పద్యధారణాకంఠీరవ అన్న బిరుదం కూడా ఇస్తే ఎంత బాగుండేదీ అని!

తదనంతర కాలంలో ఆమె భాషాప్రవీణ పట్టా పుచ్చుకొని నిడదవోలులో తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేసింది.

నాకైతే ఆ రోజుల్లో మా నాన్నగారు ఇచ్చిన ప్రోత్సాహం తెలుగుభాషపైన నాకు కొంచెం పట్టు సంపాదించుకుందుకూ, మాతృభాషపైన అభిమానం పెరిగేందుకూ బాగా తోడ్పడింది.

అన్నట్లు నేను పద్యాలను వ్రాయటం మొదలు పెట్టిన కొత్తలో మా నాన్నగారు బాగా ప్రోత్సహించటానికి గాను ఆయన స్వయంగా నాతో పాటు పద్యాలను అల్లుతూ ఉండేవారు.