22, జూన్ 2016, బుధవారం

ఫలించిన జోస్యం - 4 (అయాచితజోస్యం కథ )


(మొదటిభాగం    రెండవభాగం    మూడవభాగం)


క్రమంగా మా శ్రీనివాసుడు మాకొక ఙ్ఞాపకంగా మిగిలిపోయాడు. కాలం అనేది మనస్సులకు తగిలే గాయాలకు మరపు అనే మందుపూత వేస్తుంది. అందరమూ మెల్లగా వాస్తవజగత్తులోనికి వచ్చాం.

ఒకటి రెండు సార్లు మాత్రం నాన్నగారు శ్రీనివాస్ ఉంటే ఎంత బాగుండేది అని విచారంగా అన్నారు నాతో.

మా నాన్నగారు ఉద్యోగరీత్యా కొత్తపేటలో పదేళ్ళపాటు నివాసం ఉన్నారు. ఆరోజుల్లో ఉపాధ్యాయులపట్ల లోకానికి గొప్ప గౌరవం ఉండేది. ఈనాడు అంత గౌరవం ఉందా అన్నది అనుమానమే.

అప్పుడప్పుడు నాన్నగారు ఒక మాట అనేవారు. కలెక్టరు ఉద్యోగం చేసినవాడికి రాచమర్యాదలు జరగవచ్చు. కాని అ ఉద్యోగానంతరం సాధారణంగా అతను పదిమందిలో ఒకడే. ఒకసారి ఉపాధ్యాయుడిగా పనిచేసాక జీవితాంతం అందరూ మాష్టారూ అంటూ గౌరవంగా నమస్కరిస్తారు అని.  మా నాన్నగారితో నేను జజార్లో నడుస్తూ వెళ్ళుతున్నప్పుడు అనేకమంది వాహనాలు - అవేలెండి సైకిళ్ళు - దిగి నమస్కారం చేసి ఆయన్ను పలకరించటం నా స్వానుభవంలో చాలా తరచుగా చూసాను. అందుచేత నాకూ‌ ఉపాధ్యాయవృత్తి పట్ల చాలా ఆకర్షణ ఉండేది.

ఒకటి రెండుసార్లు మా యింటికి యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు గారు వచ్చారు. ఆయన కపిలేశ్వరపురం జమిందారు గారు. తూర్పుగోదావరి జిల్లాపరిషత్తుకు ఆయన ఛైర్మన్ కూడా. ఆయనకూ మానాన్నగారికీ స్నేహం‌ ఎలాగో నాకు వివరం తెలియదు. మా నాన్నగారికంటే ఆయనే కొద్దిగా పెద్దవారు. పాఠశాలల నిర్వహణ విషయంలో మా నాన్నగారికి మంచిపరిఙ్ఞానమూ నైపుణ్యమూ‌ ఉన్నాయని జిల్లావ్యాప్తంగా మంచి పేరు ఉండేది. అప్పుడప్పుడూ ఆయన పిలుపు మేరకు నాన్నగారు పరిషత్ కార్యాలయానికి కాకినాడ వెళ్ళిన సందర్భాల్లో‌ కొన్ని సార్లు ఆయన వెంట నేనూ‌ ఉన్నాను - అక్కడ నాన్నగారికి కార్యాలయంలో చాలా ఆదరణా పలుకుబడీ ఉండేవన్నది నా ప్రత్యక్షానుభవం పైన తెలిసిన సంగతులే.

పిల్లల చదువుల నిమిత్తం తాను చదువుకొన్న ఊరు కొత్తపేటకే వచ్చి నాన్నగారు స్థిరపడినట్లున్నా ఉద్యోగికి బదిలీలు తప్పవు కదా. ఇప్పటికి తప్పదని నాన్నగారికి రంపచోడవరం బదిలీ చేసారు. అదొక సమస్యాత్మకమైన ఉన్నత పాఠశాల. పిల్లల్లో ముఠాలూ టీచర్లలో ముఠాలుగా పరిషత్తువారికి అదొక తలనొప్పి ఐపోయిందట. బహుశః మా నాన్నగారి సలహామేరకే అక్కడి స్టాఫ్ అందరినీ చెల్లాచెదరుగా బదిలీలు చేసి కొత్త స్టాఫ్ ఏర్పాటు చేసారు. ప్రధానోపాధ్యాయులుగా నాన్నగారు బదిలీ మీద వెళ్ళారు.

రంపచోడవరం చేరేనాటికి నా అమలాపురం చదువు పూర్తి కావటంతో డిగ్రీ చేతికి వచ్చి నేను ఉద్యోగప్రయత్నాలు మొదలు పెట్టాను. టైప్ రైటింగ్ లోయర్ పరీక్షలకు సిధ్ధంగా ఉన్నా ఆ బదిలీ‌కారణంగా పరీక్షలు ఇవ్వటం వాయిదా వేసుకోవలసి వచ్చింది. మాకు అక్కడ ఒక క్వార్టర్స్ ఇచ్చారు. దాంట్లో కరంటు సదుపాయం‌ లేదు! ఆ ఊరికి వార్తాపత్రికలు‌ సమయానికి వచ్చేవి కావు ఆరోజుల్లో. నా ఉద్యోగప్రయత్నాలు కొంచెం‌ నింపాదిగానే సాగుతున్నాయి. అప్పటికే జిల్లాపరిషత్తులో అన్‌ట్రైన్‌డ్ టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు పంపుకున్నాను. పత్రికల్లో వచ్చిన వాటికీ దరఖాస్తులు పంపుతున్నాను. ఏ ప్రయత్నాలూ  ఫలోన్ముఖం కాక నిరాశగా ఉండేది.

నేను కొత్తపేటలో ఉన్నప్పుడు ఎలా మా మాతామహుల ఇంటికి దాదాపు ప్రతి వేసవిసెలవుల్లోనూ వెళ్ళి వచ్చేవాడినో అలాగే రంపచోడవరంలో ఉన్నా వెళ్ళాను. నేను వెళ్ళేది ముఖ్యంగా నాకు ప్రాణసమానురాలైన మా బేబీపిన్నిని చూడటం‌ కోసమే.

అలా వెళ్ళిన ఒక సందర్భంలో ఒకనాడు అక్కడికి లక్ష్మీనారాయణగారు వచ్చారు. వారి సోదరి ఇల్లే‌ కదా. నిజం చెప్పాలంటే కొంచెం‌ బియ్యం‌ వగైరా అడగటానికే అయన ఆరోజున వచ్చారు. ముందుగదిలో నేనూ బలరామకృష్ణులూ‌ ఉన్నట్లున్నాం. వాళ్ళు నా మేనమామలు - నాకంటే చిన్నవాళ్ళు.  లక్ష్మీనారాయణగారు వచ్చి మాతో కబుర్లు వేసుకున్నారు.

మా బేబీపిన్ని వచ్చి నన్ను లోపలికి పిలిచింది ఏదో‌ పనిమీద. ఈలోగా ఈయనే పలకరించారు నన్ను.

ఉన్నట్లుండి నీ డిగ్రీ‌ అయ్యింది కదా ఉద్యోగప్రయత్నాలు చేస్తున్నావా ఎక్కడన్నా అంటూ నా చేయి అందుకొని పరిశీలించటం‌ మొదలు పెట్టారు. నేను కూడా అయన నా చేయి చూసి ఏమి చెబుతారా అని ఎదురు చూస్తున్నాను. ఆయన చెప్పేదేదో విన్నాక లోపలికి వెళ్ళవచ్చు కదా అనుకున్నాను.

ఫలానా బాంక్ వాళ్ళ పరీక్షలు వ్రాసానండీ అని చెప్పాను ఆయనకు. 'అదేమీ‌ కలిసిరాదులే. నీకు ఏదో టెక్నికల్ లేదా సైన్సు  సైడ్ జాబ్ వస్తుంది మూడు నాలుగు నెలల్లోనే ఏదో‌ పెద్ద చోటే' అన్నాడాయన.

నేను కొంచెం‌ తరచి అడగబోయాను.

ఇంతలో లోపల వంటగదిలో నుండి మా అమ్మమ్మగారి కంఠం గర్జించినట్లే వినిపించింది. 'ఒరే శ్యామలరావూ లోపలికిరా అర్జంటుగా' అని. నేను వస్తున్నానా లేదా అని చూడటానికి కాబోలు మా బేబీపిన్ని వచ్చి తొంగిచూసింది కొంచెం‌ కోపంగా.

నేను లోపలకు వెళ్ళగానే చీవాట్లు పడ్డాయి 'నీకు బుధ్ధుందా లేదా?' అని.

నాకేమీ‌ అర్థం కాలేదు. మా అమ్మమ్మగారే కొంచెం శాంతించి 'వాడికి చేతులూ‌ జాతకాలూ చూపించద్దు ఎప్పుడూ.  వాడి నోరు మంచిది కాదు. కాస్సేపు ఇక్కడే కూర్చో అన్నది. అప్పుడర్థమైంది ముందే బేబీపిన్ని ఎందుకు లోపలికి పిలిచిందో.  మాట్లాడకుండా వంటిట్లోనే కూర్చున్నాను ఆయన బయటకు వెళ్ళేదాకా.

తరువాత మా అమ్మమ్మగారింట్లో నేను తెలుసుకున్నది ఏమంటే లక్ష్మీనారాయణగారు మంచి విద్వత్తు కలవాడే కాని నోటి ఏది అనిపిస్తే ఫెడీఫెడీ మని అనెయ్యటమే‌ కాని అవతలవాళ్ళు ఏమనుకుంటారూ ఇలా చెప్పవచ్చునా అన్నది ఆలోచించి చూసే మనిషి కాదు. ఎప్పుడూ ఏవో అపశకునం‌ మాటలే చెబుతూ‌ ఉంటాడు.  ఆయన కేదో దిక్కుమాలిన వాక్శుధ్ది లాంటిదేదో ఉన్నట్లుంది. తరచుగా అయన మాటలు అక్షరాలా జరుగుతాయి. అందుచేత ఆయన నోటి మాటకు భయపడి ఎవ్వరూ అయనతో‌ జ్యోతిషవిషయాల్లో సంప్రదించరు. అందుకే కాబోలు లౌక్యంగా ప్రియోక్తులు పలకటం చేతకాని ఆయన విద్యకు రాణింపు లేకుండా పోయింది.

అప్పుడు నాకు అర్థమైంది. ఆరోజున మా అమ్మగారు ఎందుకు మా నాన్నగారిని అంతగా వారించటానికి సంఙ్ఞలు చేసారా అన్నది.

ఏదైతే నేమి అదంతా గతం.

కాని ఈ సారి ఐతే ఆయన అయాచితంగా ఒక జోస్యం చెప్పాడు నాకు. నేను ఆశలు పెట్టుకొన్న బాంక్ జాబ్ రాదు పొమ్మని. అది చివరికి నాకు రానేలేదు. ఆ బాంక్ పరీక్షలకోసం నేనూ నా సహాధ్యాయి ఎఱ్ఱాప్రగ్గడ కొప్పేశ్వర ప్రసాదూ విజయవాడ వెళ్ళి పరీక్షలు వ్రాసాం. తరువాత కాలంలో అతను చెప్పిన మాట ఏమిటంటే విజయవాడ సెంటరు నుండి ఒక్కరంటే ఒక్కరూ‌ ఎంపిక కాలేదట.

ఇకపోతే లక్ష్మీనారాయణగారు చెప్పిన అయాచిత జోస్యంలో రెండవభాగం ఉంది. కాని అదెలా నిజమయ్యేనో తెలియటం లేదు నాకు. అలా మరొక మూడు నెలల కాలం గడిచింది.

ఉన్నట్లుండి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ నుండి ఒక ఉత్తరం వచ్చింది హైదరాబాద్‌లో ఉన్న ఇ.సి.ఐ.యల్ కంపెనీలో ఉద్యోగానికి వ్రాతపరీక్షకు వెళ్ళమని.

మొత్తం 650మంది పైగా దేశవ్యాప్తంగా అభ్యర్ధులు ఆ వ్రాతపరీక్షకు హాజరైతే అందులో ఒక 28మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. చివరికి ఎంపికైనది కేవలం 8మందిమి. అందులో మొదటి వాడిని నేను. మొదటి నలుగురినీ మాత్రం కంప్యూటర్ గ్రూప్‌లో జాయిన్ చేసుకున్నారు. నాతో‌పాటి చావలి నరసింహం, హోతా జానకీదేవి, సుబ్బారావు అనే ముగ్గురు ఎంపికయ్యారు కంప్యూటరు గ్రూపులో చేరటానికి.  అక్కడ ఒక సంవత్సరం‌పాటు కంప్యూటర్ సైన్సూ ప్రోగ్రామింగూ‌ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డాను. అలా లక్ష్మీనారాయణగారి జోస్యంలో రెండవ భాగమూ పూర్తిగా సత్యంగా తేలింది.


(ఐదవభాగం రేపటి టపాలో)