సుమంగళి. ఎలనాగ సీత పతినే మురిపించన్ కలహంస సిగ్గుపడగా నడయాడున్ కలవాణి కోకిలకు గానము నేర్పున్ తిలకించు భక్తులను దీనత మాన్పన్ |
ఈ సుమంగళీవృత్తానికి గణవిభజన స-జ-స-స-గ. గురులఘుక్రమం IIUIUIIIUIIUU. 9వస్థానం వద్ద యతిమైత్రి. ఈ వృత్తానికే కలహంస అని మరొక పేరు కూడా కనిపిస్తోంది.
ఈ సుమంగళీవృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.
ఈవృత్తం నడక చిత్రంగా ఉంది. IIUIUIIIUIIUU అన్న గురులఘుక్రమం IIUI UIII UII UU అని నాలుగు ఖండాలుగా కనిపిస్తోంది. ఇలా 5+5+4+4 మాత్రలుగా ఇది ఎలాంటి తాళానికి ఒదుగుతుందో మరి. చివరి రెండు చతుర్మాత్రాగణాలనూ మరొక మాత్రకు సాగదీసి అవీ పంచమాత్రాత్మకం చేస్తే అప్పుడు త్రిస్రగతిలో రూపకతాళంలో ఉంటాయని చెప్పవచ్చును.
ఎలనాగ | సీత పతి | నే మురి | పించన్ |
కలహంస | సిగ్గుపడ | గా నడ | యాడున్ |
కలవాణి | కోకిలకు | గానము | నేర్పున్ |
తిలకించు | భక్తులను | దీనత | మాన్పన్ |