7, జనవరి 2016, గురువారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 1

భారవి వ్రాసిన కిరాతార్జునీయం కావ్యంలో కిరాతుడి రూపంలో ఉన్న శివుడికీ తాపసిగా ఉన్న అర్జునుడికీ‌ యుధ్ధం పదునాల్గవ సర్గలో ప్రారంభం అవుతుంది. ఆ యధ్ధం పదునెనిమిదవ సర్గ మొదట్లో ముగుస్తుంది. ఆ సర్గతో‌ కావ్యమూ సంపూర్ణం అవుతుంది. భారవి ఆ ఇద్దరి మధ్య జరిగిన యుధ్ధాన్ని వర్ణించే‌ సందర్భంలో పదిహేనవ సర్గలో చిత్రకవిత్వాన్ని గొప్పగా వ్రాసాడు. మనకు కిరాతార్జునీయం పూర్వాపరాలన్నీ బాగానే తెలుసును. అదీకాక గత టపాలో‌ ముందు మాటలో కొంత తలస్పర్శిగా యుధ్ధానికి దారితీసిన పరిస్థితుల్నీ పరామర్శించాం. ఇప్పుడు ఎకాయెకీన చిత్రకవిత్వం ఉన్న పదిహేనవ సర్గలోనికి వచ్చేస్తున్నాం.

అర్జునుడి మీదికి బోయవాడి వేషంలో శివుడూ అలాగే బోయపరివారంగా కనిపిస్తున్న ప్రమథగణాలూ యుధ్ధానికి దిగాయి. అర్జునుడి బాణాలు ఆ ప్రమథగణాల్ని కప్పేశాయి. ఒక తామరకొలను ఉందనుకోండి. చంద్రోదయం‌ కాగానే పండువెంన్ల ఒక్కసారిగా ఆ తామరపూవులమీద కురిస్తే ఏం‌ జరుగుతుంది. అన్నీ‌ వెలాతెలాపోయి ముడుచుకొని పోతాయి వాడిపోయి. ఒక్కో తామర పూవు మీదకీ‌ ఒక్కొక్క చంద్రకిరణం‌ తాపీగా రాదు కదా. ఆన్నింటినీ ఒక్కసారిగా వెన్నెల ముంచెత్తుతుంది. ఆనీ‌ ఒక్కసారిగా వాడిపోతాయి. అలా అర్జునుడి బాణాలవర్షం ప్రమథసందోహం అందరిమీదా ఒక్కసారిగా వెల్లువెత్తింది. అందరూ శివుడిని కూడా స్మరించకుండా లబోదిబో మని పారిపోయారట. ప్రమథులు శివుణ్ణీ స్మరించకుండా ఉండగలరా? ఎవరికైనా ఆపద వస్తే‌ శివుణ్ణి తలచుకుంటారే. మరి నిత్యం‌ కళ్ళు తెరుస్తే శివుడూ కళ్ళుమూస్తే కూడా శివుడే ఐన ప్రమథులకే శివుణ్ణి వేడాలని తోచలేదా‌ అంటే. బాణాలలా ఒక్కసారి తుఫానులాగా ముంచెత్తేసరికి మనస్సులు పనిచేయక గాభరా పడి పారిపోయారన్నమాట. ఏదో‌ అర్జునుడిని తికమక పెడదాం అని తేలిగ్గా తీసుకొని వచ్చిన ప్రమథులకే ఆపద కలిగినట్లై వాళ్ళు గొప్పగా సంభ్రమం చెంది పారిపోయారు. చివరికి వాళ్ళ కంటికీ‌ మనస్సుకీ‌ శివుడు కూడా అనలేదు!

ఆ బోయసేన దురవస్థను చూసి అర్జునిడి మనస్సు దయతో‌ కరిగిపోయిందట!

స సాసిః సాసుసూః సాసో
యేయేయేయాయయాయయః
లలౌలీలాం లలోఽలోలః
శశీశశిశుశీః శశన్     (5)

ఇది ఈ 15వ సర్గలో 5వ శ్లోకం. చిత్రకవిత్వం రుచిచూపిస్తున్న మొదటిశ్లోకం ఈ‌ సర్గలో.

ఈ శ్లోకంలో‌ చిత్రమైన విషయం ఏమిటీ అంటే చూడండి శ్లోకంలోని నాలుగు పాదాల్లోనూ ఒక్కొక్క పాదానికీ ఒక్కొక్క అక్షరాన్ని గుణింతం బేధంమాత్రం చేసి వాడుతూ నిర్మించటం.

మంచి వయ్యాకరణీ, గొప్పకవీ మహాపండితుడూ‌ ఐతే‌ తప్ప ఇలాంటి శ్లోకం వ్రాయటం‌ కుదిరేపని కాదు.

జాగ్రత్తగా పగలగొట్టుకొని ఈ శ్లోకంలోని శబ్దాలను గ్రహించాలంటే సంస్కృతంలోని ఏకాక్షరనిఘంటువులూ వగైరా తెలిసి ఉండాలి. లేకుంటే మనవల్ల కాదు.

స + అసి --> సాసి. అసి అంటే కత్తి. అసిధారావ్రతం‌ అన్నమాట విన్నారా? అక్కడ అసి అంటే కత్తి అని అర్థం మీరు ఎప్పుడో తెలుసుకొని ఉంటారు. ఇక్కడ స+అసి అని సంధిచేసి సాసి అన్నాడు కవి. ఇప్పుడు సాసి అంటే అర్థం కత్తి కలవాడు అని వస్తున్నది.

స + అసుసూః --> సాసుసూః. అసుసుః అంటే బాణం. కాబట్టి సాసుసూః అంటే బాణాలు కలవాడు.

స + ఆసః --> సాసః. ఆసః అంటే విల్లు అని అర్థం. సాసః అంటే ఇప్పుడు ధనుస్సు కలవాడు అని అర్ధం వస్తున్నది కదా.

యేయ + అయేయ + ఆయయ + అయయః --> యేయాయేయాయయాయయః అవుతున్నది. యేయము అంటే ప్రయాణసాధనం వాహనం. యేయః అంటే యేయము కలవాడు. వాహనం‌మీద ఉన్న వాడన్న మాట. అయేయః అంటే వాహనం‌ లేనివాడు. అయయ అంటే అటువంటి వారిని, అయేయః అనగా వాహనాలు లేని వాళ్ళని చేస్తున్నాడు అని అర్థం. అంటే వాహనాలున్న శత్రువుల్నీ నేలమీద ఉన్న శత్రువుల్నీ కూడా చితగ్గొట్టి వాళ్ళ వాహనాలు లాక్కుంటున్నాడు అని తాత్పర్యం.

లలః అంటె అందగాడు అని అర్థం.

అలోలః అంటే ఏవిధంగానూ మనస్సు అటూ ఇటూ చంచలంగా ఉండని వాడు. అంటే మంచి ఏకాగ్రతతో యుధ్ధం చేస్తున్న వాడు అని అర్థం.

శశి +‌ఈశ --> శశీశ. శశి అంటే అందరికీ‌ తెలుసును కదా చంద్రుడని. ఈశుడంటే అధిపతి. శశీశు డంటే చంద్రుడికి ప్రభువు ఐన శివుడు అని అర్థం వస్తోంది.

శశీశ + శిశుశీః  --> శశీశశిశుశీః. శిశువు అంటే బిడ్డ. ఇక్కడ స్మరిస్తున్నది శివుడి కొడుకైన కుమారస్వామిని. కుమారస్వామిని ఎందుకంటే ఆయన గొప్ప అందగాడు. అంతే కాక గొప్పపరాక్రమశాలి. సాక్షాత్తూ దేవతలకు సైన్యాధిపతి కూడా.  ఆయన దేవసేనాధిపతి అన్న మాట అటుంచండి. ఇక్కడ శివుడి సేనలకూ నాయకత్వం వహిస్తున్నది కూడా సాక్షాత్తూ ఆ కుమారస్వామివారేను.

శశన్  అంటే పారద్రోలటం‌ అన్న అర్థం ఇక్కడ.

అందుచేత శశీశశిశుశీః శశన్ అంటే చంద్రుడి ప్రభువైన శివుడి కొడుకు కుమారస్వామిని పరిగెత్తించే వాడు. అంటె దేవసేనాని ఐన కుమారస్వామినే గెలిచే సత్తా ఉన్నవాడు అని అర్థం. అంటే యుధ్ధంలో  అర్జునిడి నైపుణ్యాన్ని ఆ కుమారస్వామి కూడా తట్టుకోలేకపోయాడని కవి హృదయం అన్నమాట.

లీలాం అంటే విలాసాన్ని, శోభను అని అర్థం.

లలౌ అంటే పొందాడు అని అర్థం.

హమ్మయ్య. అర్థాలు తీసాం‌ కదా. ఇప్పుడు మొత్తం‌ శ్లోకం లోని భావాన్ని మననం చేసుకుందాం.

ప్రమథసైన్యాన్ని అవలీలగా పారద్రోలిన అర్జునుడి పరాక్రమశోభను కవి ప్రస్తుతి చేస్తున్నాడు. అర్జునుడు నడుముకు ఖడ్గాన్ని ధరించాడు. చేతిలో విల్లమ్ములు పట్టుకున్నాడు. వాహనాలమీద వచ్చి యుధ్ధానికి దిగిన వాళ్ళనీ, పదాతిసైన్యాన్నీ చిందరవందరచేసి పారద్రోలి వాళ్ళ ఆయుధాలూ వాహనాలూ స్వాధీనం చేసుకున్నాడు. అర్జునుడు గొప్ప అందగాడు. అందలోనే‌ కాదు పరాక్రమంలోనూ‌ సాక్షాత్తూ కుమారస్వామినే మించిపోయాడు! అటువంటి వాడైన అర్జునుడు యుధ్ధరంగంలో గొప్పశోభతో‌ ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే ఆ కుమారస్వామితో అనే కాదు ఆయన తండ్రిమీదనే తెగబడి యుధ్ధం చేస్తున్నాడు కదా, అందువల్ల ఆయన శోభ చాలా గొప్పగా ఉందట యుధ్ధంలో.

ఇదీ ఈ‌శ్లోకం లోని భావం.