చంద్రిక. నరుని బ్రతుకు నాటకంబుగా నరసి విరతు డాశ్రయించు నీ పరమశుభదపాదపద్మముల్ సరసహృదయ జానకీపతీ |
చంద్రిక.
ఈ చంద్రికావృత్తానికి గణవిభజన న - న - ర - వ. యతిస్థానం 7వ అక్షరం. నడక ప్రకారం ఈచంద్రికావృత్తానికి గణ విభజనను న-న-హ-హ-గ అని చెప్పటం సబబుగా ఉంటుంది.
ఈ వృత్తానికి సుభద్రిక, భద్రిక, అపరవక్త్ర ,ప్రసభ అనే పేర్లుకూడా ఉన్నాయని ఛందం పేజీలో కనిపిస్తోంది. ఈ వృత్తాన్ని అనంతుడు భద్రక అనీ చంద్రిక అనీ పిలుస్తారని చెప్పాడు.
వేరొక వృత్తం, గణవిభజన న-న-త-ర-గ ఉండి యతిస్థానం 8వ అక్ష్రరంతో ఉన్నదానికి కూడ చంద్రిక అన్న పేరున్నట్లు ఒక నరసింహ బ్లాగు పేజీలొ కనిపిస్తోంది.
ఈ చంద్రికావృత్తానికి ఛందం పేజీలో పేజీలోకనిపిస్తున్న ఉదాహరణ:
ఇతఁడు నలుఁడ హీన మూర్తియా
యతన మఖిల మైన శూరక
ర్మతతికి సరి రాదు వీనికిన్
క్షితి శతశతసేనయైననున్
వృత్తాల మధ్య తరచు పోలికలు ఉంటూ ఉండటం గమనించాలి మనం. ఈ చంద్రికావృత్తానికీ మొన్న చెప్పుకున్న ప్రముదితవదన వృత్తానికీ చాలా పోలిక ఉంది. ప్రముదితవదనకు గణవిభజన న-న-ర-ర ఐతే ఈ చంద్రికకు గణవిభజన న-న-ర-వ. అంటే చివరి గణం ఒక్కటే తేడా అన్నమాట. ప్రముదితవదన చివరను ర-గణం (UIU) బదులు చంద్రికలో వ-గణం (IU). ఈ రెండు వృత్తాలకూ మొదటి తొమ్మిది స్థానాలూ సమానం, మళ్ళా చివరి రెండూ స్థానాలూ సమానం. ప్రముదితవదన నుండి పదవ స్థానం గురువును తొలగిస్తే అది చంద్రిక అవుతుంది.
ఈ చంద్రికా వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు సరిగా తెలియవు. కాని విశ్వనాథవారు చంద్రిక అన్న వృత్తాన్ని వాడినట్లుతెలుస్తోంది. అది పైన చెప్పిన రెండు రకాల చంద్రికావృత్తాల్లో ఏదో వివరం తెలియదు.
చంద్రిక నడకవిషయం చూస్తే పైన నేను వ్రాసిన పద్యం ఇలా ఉంది:
నరుని | బ్రతుకు | నాట | కంబు | గా |
నరసి | విరతు | డాశ్ర | యించు | నీ |
పరమ | శుభద | పాద | పద్మ | ముల్ |
సరస | హృదయ | జాన | కీ ప | తీ |
ఇక్కడ పాదంలో చివరి గురువును కొంచెం లాగి త్రిమాత్రగా స్వీకరించవచ్చును. ఇలా అన్నీ త్రిమాత్రాగణాలతో నడుస్తూ ఈవృత్తం రూపకతాళానికి తగినట్లు ఉంది.
చంద్రికలు వ్రాయటం సులభంగానే కనబడుతోంది కాబట్టి ఆసక్తి కలవారు తప్పక ప్రయత్నించండి.