ప్రముదితవదన. నిరుపమ మగు నీ దయా దృష్టికై సురలు మునులు జోరుగన్ మూగగా నరుడ నిలువ నాకు చోటుండునా పరమపురుష పాహిమాం రాఘవా |
ప్రముదితవదన
ఈ ప్రముదితవదన వృత్తానికి గణవిభజజ న-న-ర-ర . అంటే పాదానికి 12అక్షరాలన్నమాట. లక్షణ గ్రంథాలు యతిస్థానం 8వ అక్షరంగా చెబుతున్నాయి.
గణవిభజ ప్రకారం న - న - ర - ర అన్నప్పుడు, మాత్రలు 3 + 3 + 5 + 5 = 16 అవుతున్నయి. యతిస్థానం 8వ అక్షరంగా తీసుకొన్న పక్షంలో (3+3+2)+(3+5) మాత్రలుగా సమమాత్రావిభజవస్తుంంది. కాని యతిస్థానం ఒక లఘువుపై వస్తున్నది. ఈ పక్షంలో ప్రముదితవదన వృత్తపాదం నడక ననన-ననన-నా ననా-నాననా అన్నట్లుగా వస్తుంది.
అంతకంటే 7వ అక్షరంగా ఉంటే గురువుపైన యతిస్థానం తీసుకోవటం బాగుంటుందని నా అభిప్రాయం. అలా చేసినప్పుడు ఈ ప్రముదితవదన నడక ననన-ననన నాననా-నాననా అన్నట్లుగా సుభగంగా అనిపిస్తున్నది. ఈ విధానంలో పూర్వీత్తరభాగాలలో అక్షరసంఖ్య కూడా సమానం అవుతున్నది. అందుచేత యతిస్థానం 7వ అక్షరంగా ఎన్నుకొని వ్రాస్తున్నాను.
ఈ ప్రముదితవదనకే ప్రముదితవదన, ప్రభాత, మందాకినీ, గౌరీ, చంచలాక్షీ అనే పేర్లు కూడా ఉన్నాయని ఛందం పేజీలో కనిపిస్తోంది. అలాగే ప్రముదితవదన అనే పేరుతో మరొకవృత్తం కూడా ఉన్నదని ఒక ఈమాట వ్యాసం ద్వారా తెలుస్తోంది, దాని లక్షణాలు ప్రముదితవదనా న-స-న-న-లగ, యతిస్థానం14వ అక్షరం
ప పద్యం నడక విషయానికి వస్తే ఇలా ఉన్నది.
నిరుపమ మగు | నీ దయా | దృష్టికై |
సురలు మునులు | జోరుగన్ | మూగగా |
నరుడ నిలువ | నాకు చో | టుండునా |
పరమపురుష | పాహిమాం | రాఘవా |
ఇలా ప్రతిపాదమూ మూడు కాలఖండాలుగా వస్తుంది. ప్రతికాలఖండంయొక్క నిడివీ ఆరేసి మాత్రలుగా కనిపిస్తోంది. పాదంలో రెండవ, మూడవ కాలఖండాలకు మరొక అదనపు మాత్రాప్రమాణం సాగదీత వస్తున్నదన్న మాట.
ఈ ప్రముదితవదన వృత్తానికి పూర్వకవి ప్రయోగాలు తెలియవు.
( ప్రముదితవదన వృత్తం పై మలిటపా )