చంద్రవర్త్మ. రాము డల్పుడని రావణు డనియెన్ రామబాణమున ప్రాణము వదిలెన్ కాముకుండు నరకంబున కరిగెన్ భామతోడ రఘువల్లభు డరిగెన్ |
చంద్రవర్త్మ
దీని గణవిభజన ర - న - భ - స. యతిస్థానం 7వ అక్షరం.
ఇది స్వాగతవృత్తానికి కవలసోదరి. ఎందుకంటే స్వాగతానికి గణవిభజన ర - న - భ - గగ కదా. అంటే స్వాగతంలోని చివరి 'గగ' అనే చతుర్మాత్రాగణానికి బదులుగా 'స' అనే మరొక చతుర్మాత్రాగణాన్ని పెడితే సరిపోతుంది. స్వాగతంలో చివర రెండుగురువుల్లో మొదటిదాన్ని రెండు లఘువులుగా మార్చితే చంద్రవర్త్మ అవుతుందన్న మాట.
ఎవరైనా పూర్వం ఈ వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.
నడక వ్యవహారం చూస్తే ఇలా వస్తుంది.
రాము - డల్పు - డని - రావణు - డనియెన్
రామ - బాణ - మున - ప్రాణము - వదిలెన్
కాము - కుండు - నర - కంబున కరిగెన్
భామ - తోడ - రఘు -వల్లభు - డరిగెన్