మంజులయాన. కనులార భవదీయ కమనీయ రూపమున్ కనుగొందు నను నాశ కడముట్ట నీకురా తనివార నిను జూడ తగనందువా ప్రభూ మనసెల్ల రఘురామ మరి నిండి యుండవా |
ఈ 'మంజులయాన' వృత్తం కూడా నేను సృష్టించినదే. అప్పట్లో దీనికి పులిహోర అని పేరు పెట్టాను! ఇది ఒక అవధానం సందర్భంగా సృజించటం జరిగింది కాకతాళీయంగా.
అవధాని గారి అభిప్రాయాన్ని అనుసరించి (చూడండి: పులిహోర ఛందస్సుపై టపా) దీనికి ఇప్పుడు కొత్తగా 'మంజులయాన' అని పేరు పెట్టటం జరుగుతున్నది.
దీని లక్షణాలు. పాదానికి గణవిభజన స - న - భ - జ - ర. యతిస్థానం 9వ అక్షరం. ఇది నడకప్రథానమైన వృత్తం కాబట్టి గణవిభజన తదనుగుణంగా సల - సల - సల - ర అని చెప్పుకుంటే బాగుంటుంది.
ఈ వృత్తానికి జె.కె.మోహనరావుగారి పద్యం:
అలనాడు నలరాజు హరుసాన వండెగా
అలనాడు బలభీము డతివేగ వండెగా
పులిహోర యన నాల్క పొడుగాయె జూడగా
పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో
ఇందులో చివరిపాదం " పులిహోర పులిహోర పులిహోర మెక్కిపో" అనేది ఈ వృత్తలక్షణానికి ఉదాహరణగా నేను ఇచ్చినది. మోహనరావుగారు మొత్తం పద్యాన్ని పూరించా రన్నమాట.
నా కోరిక మేరకు తదుపరి అవధానానంతరం అవధాని అనిల్ గారు చెప్పిన పద్యం:
సిరి శ్యామలుడు నేడు జిగి యొప్పు చుండగా
ధరణీ జనులు మెచ్చదగి నట్లు యిచ్చిరే
సరసీరుహనిభాంఘ్రి చతురాస్యు పత్నికిన్
పులిహోర యను వృత్తమును నంకితంబుగా
నిజానికి తమాషాకు నేను అనుకోకుందా సృజించినది ఐనా ఈ తాళప్రథానమైన వృత్తానికి మంచి పరిథి ఉంది. అవధానిగారు అన్నట్లు ఈ వృత్తంలో పూర్తిస్థాయి కవిత్వప్రక్రియలు చేయవచ్చును. ఉదాహరణకు ఏదైనా ఒక ఖండిక మొత్తాన్ని ఈ మంజులయాన వృత్త పద్యాలతో పూర్తిగా హాయిగా నిర్మించవచ్చును. హాయిగా చదివించగల నడక ఉందనిపిస్తోంది దీనికి.