శిఖరిణి. ధనాశం భూలోకంబున శుభదమౌ ధర్మము నెడన్ మనుష్యు ల్నిత్యంబున్ విముఖులగుచున్ మానక సదా ఘనంబుల్పాపంబుల్ సలుపుదురయా కావగదవే మనశ్చాంచల్యంబుల్ రఘుపతి వెసన్ మాన్పి కృపతో |
ఈ శిఖరిణవృత్తం కొంచెంగడ్డు పద్యమే అని చెప్పాలి. దీనిలో గురువులూ లఘువులూ గుంపులుగా వచ్చేస్తాయి మరి. ఈ వృత్తంగణవిభజన య - మ - న - స - భ - వ అని. అంటే మొత్తం 17 అక్షరాలు. యతిస్థానం 13వ అక్షరం. ఈ శిఖరిణీవృత్తంలో పాదానికి గురులఘువుల అమరిక ఇలా ఉంటుంది:
I U U U U U I I I I I U U I I I U
య మ న స భ వ
చూసారా? ఈ వృత్తంలో మొదట్లోనే ఐదుగురువులు వరసగా వస్తాయి. ఆ కష్టం చాల దన్నట్లు అ వెంటనే వరసపెట్టి ఐదు లఘువులు వస్తాయి.
సంస్కృతంలో ఐతే ఈ వృత్తంలో బండి లాగించెయ్యవచ్చునూ అనటానికి శంకరాచార్యులవారే సాక్షి. వారి అమోఘమూ అద్వితీయమూ ఐన సౌందర్యలహరీస్తోత్రం పూర్తిగా శిఖరిణీవృత్తాల్లోనే ఉంది.
తెలుగులో మాత్రం శిఖరిణీ స్తోత్రం వ్రాయటం కత్తిమీదసాము అనే చెప్పాలి.
అందుకనే తెలుగు కవులుశిఖరిణీవృత్తాన్ని ఆదరించినట్లు కనిపించటం లేదు.
పండిత నేమాని సన్యాసిరావుగారి అధ్యాత్మ రామాయణము గ్రంథంలో నుండి ఒక శిఖరిణి
నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
నమస్తే రుద్రాయ త్రిదశనుత విజ్ఞాన నిధయే
నమస్తే శర్వాయ ప్రమథ గణ వంద్యాయచ నమో
నమస్తే తామ్రాయ శ్రిత భవ భయఘ్నాయచ నమః
ఐతే తెలుగు గ్రంథంలోని ఒక సంస్కృతవృత్తమే కాని ఇది తెలుగుపద్యం కాదు. యతిప్రాసలను పాటించి తెలుగుపద్యం అనిపించుకోవటమే ఇక్కడ జరిగింది.
ప్రబంధకవులెవరైనా శిఖరిణీవృత్తాన్ని వాడారా అన్నది అనుమానమే.
ఆధునికకాలంలో ఈ శిఖరిణీ వృత్తాన్ని గురించిన చిన్న ప్రయత్నం ఒకటి శంకరాభరణం బ్లాగులో జరిగింది. దాని వివరాలు ఇక్కడ ఇక్కడ చూడవచ్చును. అ ప్రయత్నంలో భాగంగా శ్రీశంకరయ్యగారి శిఖరిణీ వృత్తాన్ని ఎత్తి చూపుతున్నాను:
పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా!
ఆధునికకాలంలో ఈ శిఖరిణీ వృత్తాన్ని గురించిన చిన్న ప్రయత్నం ఒకటి శంకరాభరణం బ్లాగులో జరిగింది. దాని వివరాలు ఇక్కడ ఇక్కడ చూడవచ్చును. అ ప్రయత్నంలో భాగంగా శ్రీశంకరయ్యగారి శిఖరిణీ వృత్తాన్ని ఎత్తి చూపుతున్నాను:
పురారాతీ! శూలీ! మునిజననుతా! మోక్షఫలదా!
స్మరద్వేషీ! భర్గా! శశిధర! హరా! మాధవసఖా!
సురూపా! సర్వజ్ఞా! సుబల! శుభదా! శోకదహనా!
పరాకేలా? స్వామీ! పతితుఁడను, కాపాడుము శివా!
ఈ ప్రయత్నంలో శంకరయ్యగారు సఫలీకృతులనే చెప్పాలి. సంబోధనాప్రథమా విభక్తి ద్వారా వచ్చిన దీర్ఘాక్షరాలు బాగానే సహాయ పడటాన్ని మనం గమనించవచ్చును. ఇంకెవరన్నా శిఖరిణీ వృత్తాలుప్రయత్నించారేమో తెలియదు.