స్వాగతం. ధీవరుండు నిజ తేజ మెసంగన్ దేవదుందుభుల దిక్కులు మ్రోయన్ దేవసంఘములు తీయగ పాడన్ రావణాసురుని రాము డడంచెన్ |
ఈ స్వాగతం అనే వృత్తానికి పాదానికి నాలుగే గణాలు. అవి ర - న - భ - గగ. గురులఘుక్రమం UIUIIIUIIUU యత్తిస్థానం 7వ అక్షరం. పాదానికి కేవలం 11 అక్షరాలతో ఇది కూడా ఒక చిట్టిపొట్టి వృత్తం అన్నమాట.
ఈ స్వాగతవృత్తానికి ముందు మరొక గురువును చేర్చితే అది నీరాంతికం (UUIUIIIUIIUU) అవుతుంది. గురువుకు బదులుగా రెండు లఘువులను చేర్చితే అది కలహంస (IIUIUIIIUIIUU) అవుతుంది. సౌలభ్యంకోసం క్రీగీటులతో వీటిలోని స్వాగతాన్ని సూచింవాను.
ఈ వృత్తానికి పాదాంతంలో అనుప్రాసను కూర్చటం కూడా మనం చూడవచ్చును.
పింగళి సూరనగారి కళాపూర్ణోదయం ప్రబంధంలో తృతీయాశ్వాసం చివరన ఒక స్వాగతం ఇలా ఉంది:
నిర్విరామ ధరణీ భర ణాంకా
గర్వితారి జయకర్మ విశాంకా
సర్వదిక్చర విశంకట కీర్తీ
శర్వరీ రమణ సన్నిభ మూర్తీ
ఇక్కడి అంత్యానుప్రాసలను గమనించండి.
శ్రీ నేమాని సన్యాసిరావుగారి స్వాగత వృత్తం చూడండి:
మౌనివర్య! జనమాన్య చరిత్రా!
జ్ఞానసారనిధి! స్వాగతమయ్యా!
మాననీయ గుణ! మంగళదాతా!
పూని నీ పదము మ్రొక్కెద స్వామీ!
ఈ వృత్తంలో అంత్యానుప్రాసను పాటించలేదు నేమానివారు.
గమనిక: ఈ టపాశీర్షికను అపార్థం చేసుకోకండి. అందులో ఉన్న "స్వాగతం" అనే పదం ఈ వృత్తం పేరును సూచించేది మాత్రమే. ఇంత చిన్న చిన్న విషయం చెప్పాలా ప్రత్యేకంగా అనకండి. ఈ మాటను పట్టుకొని ఆవేశపడ్డ వారి అనుచిత స్పందననూ (వేరే చోట) గమనించాకే ఈ గమనికను ఈ టపా క్రింద చేర్చటమైనది.