19, ఆగస్టు 2015, బుధవారం

ఆహా ఓహో అననే అనను








ఆహా ఓహో అననే అనను అందరి మాటలకు
బాహాబాహీలకు నే దిగను వలనుపదదు నాకు



నాలో నేనే రామరామయని నాదుభక్తి కొలది
వీలుచేసుకొని తలచుకొందును వెఱ్ఱిప్రేమ నాది
ఈ లోకములో ఎవరికి నచ్చును ఎవరికి నచ్చదిది
ఏల గణింతును నా మనసున కిది మేలని తోచినది
ఆహా

నా జీవితమిది నా భాగ్యమిది నా సంతోషమిది
రోజురోజునకు పెరుగుచున్నది లోకము చూడనిది
నా జన్మంబును ధన్యము చేయుచు నాదగు పుణ్యనిధి 
నా జీవనము రామార్పణము నాదు బుధ్ధి నాది
ఆహా

కొందరు హరిభక్తులుకని మెచ్చెద రందు వింతలేదు
కొందరు రామవిరోధులు తిట్టెద రందు వింత లేదు
అందరు జీవులు కర్మబంధముల కనుగుణమగు బుధ్ధి
పొంది రాముని పొగడుట తెగడుట యందు వింతలేదు
ఆహా