తిన్ననైననడత లేని నన్ను కటాక్షించితి విక
నిన్ను కాక వే రెవరిని సన్నుతింతురా రామ
ధర్మమొక్క టున్నదని తలదాల్చుట యుచిత మని
నిర్మలాచరణుల కది నిత్యరక్ష సలుపు నని
దుర్మోహపు పరిణామము దుష్కర్మాచరణ మని
కర్మఫలానుభవము చాల కఠిన మనుచు నెరుగ నట్టి ॥తిన్ననైన॥
పెద్దలాడు మాటలలో సుద్దులెరిగి వర్తించక
గద్దరినై పలువురతో కలహించుచు గడపి నట్టి
పద్దువేసి ఎత్తిచూపి పాశధరుని లేఖకుడు
గద్దించుచు పలుకుదినము కలదని తలపోయ నట్టి ॥తిన్ననైన॥
నీ పాదములకు పూజ నే నెన్నడు చేసితిని
నీ పావన నామమును నే నెంత జపించితిని
నీ పారమ్యము నమ్మని నీచులతో చేరితిని
నా పగిది వారి నైన నమ్మకముగ బ్రోతునని ॥తిన్ననైన॥