కారణజన్ములు కానిది ఎవరు కారణమన్నది కర్మము కనుక
ధారుణి కర్మఫలమ్మును గుడువ జోరున వత్తురు జీవులు కనుక
హరి సర్వేశ్వరు డాతడు తక్క మరియందరిపై ముసిరిన మాయ
గరువము బరపి ఘనముగ బుధ్ధి నరిషడ్వర్గపు చెలిమికి ద్రోయ
పరిపరి విధముల పాపాచరణబాహుళ్యము నిర్భాగ్యుల జేయ
నరకము చేరి నానాబాధలు వరసగ కుడిచి సమయము డాయ ॥కారణ జన్ములు॥
ఏమాత్రము సద్గ్రంథపఠనము ఏమాత్రము సద్గురు సేవనము
ఏమాత్రము సత్సాంగత్యము ఏమాత్రము శ్రీహరి సేవనము
ఏమాత్రము వైరాగ్యలక్షణము ఏమాత్రము పరతత్త్వభావనము
నోమనిదే గలదే పరము పామరత్వమున చెడగ జీవనము ॥కారణ జన్ములు॥
శ్రీమంతులని మిడెకెడి వారు చీకుచింతలకు నడలెడి వారు
ధీమంతులమని నుడివెడి వారు కామందులమని గడపెడు వారు
కాముని కొలువును విడువని వారు రాముని నామము నుడువని వారు
ఏమని మోక్షము చెందెడు వారు భూమికి రాకెక్కడికిని బోరు ॥కారణ జన్ములు॥