రాజసులోచనం బ్లాగు (http://rajasulochanam.blogspot.in/)లోని ఒక టపాకు (http://rajasulochanam.blogspot.in/2015/03/blog-post_2.html) నేను చేసిన వ్యాఖ్యకు మరింత వివరణగా ఇది వ్రాస్తున్నాను.
నేను దివంగత బి.వి.రామన్ గారి వీరాభిమాని నేమీ కాను. కాని ఒకప్పుడు వారి Astrological Magazine of Inida మాసపత్రికను తరచుగానే ఆసక్తిగా చదివే వాడిని. ఇప్పుడెందుకు చదవటం లేదలా అంటే, దానికి సవాలక్ష కారణాలున్నాయి. అది వేరే సంగతి. ఆయన ఆ పత్రికకు వార్షిక సంచికను ప్రత్యేకగా చాలా ఎక్కువ పేజీలతో ఎక్కువ సరంజామాతో నూత్న ఆంగ్లసంవత్సరారంభసంచికను దాదాపు ఒక నెల రోజులు ముందే విడుదల చేసేవారు. అది ప్రత్యేకంగా కొని మరీ చదివే వాడిని. ఇదంతా ఎందుకు ప్రస్తావించానంటే ఆయన ప్రతివార్షికసంచికలోనూ రాబోయే సంవత్సరకాలంలో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను గురించి అంచనాలను ప్రకటించేవారు. అలాగే ఆ సంచికలో గతసంవత్సరపు అంచనాలు ఏమేరకు ఫలించినదీ కూడా విశ్లేషించేవారు.
నేను దివంగత బి.వి.రామన్ గారి వీరాభిమాని నేమీ కాను. కాని ఒకప్పుడు వారి Astrological Magazine of Inida మాసపత్రికను తరచుగానే ఆసక్తిగా చదివే వాడిని. ఇప్పుడెందుకు చదవటం లేదలా అంటే, దానికి సవాలక్ష కారణాలున్నాయి. అది వేరే సంగతి. ఆయన ఆ పత్రికకు వార్షిక సంచికను ప్రత్యేకగా చాలా ఎక్కువ పేజీలతో ఎక్కువ సరంజామాతో నూత్న ఆంగ్లసంవత్సరారంభసంచికను దాదాపు ఒక నెల రోజులు ముందే విడుదల చేసేవారు. అది ప్రత్యేకంగా కొని మరీ చదివే వాడిని. ఇదంతా ఎందుకు ప్రస్తావించానంటే ఆయన ప్రతివార్షికసంచికలోనూ రాబోయే సంవత్సరకాలంలో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను గురించి అంచనాలను ప్రకటించేవారు. అలాగే ఆ సంచికలో గతసంవత్సరపు అంచనాలు ఏమేరకు ఫలించినదీ కూడా విశ్లేషించేవారు.
ఆ సంచికలు ఎన్నడూ హేతువాదులు పరిశీలించినట్లు నా దృష్టికి రాలేదు. పరిశీలిస్తే వాటిలో నిజానిజాలను బట్టి వారికి జ్యోతిషం పట్ల అవగాహన మరికొంత నిర్దుష్టంగా రూపుదిద్దుకునేది. కాని చిత్రమేమిటంటే, జ్యోతిషం అనేదానిపైన ఏమాత్రం అధ్యయనమూ చేయకుండానే తరచుగా జ్యోతిషానికి వ్యతిరేకంగా వీరావేశంతో మీడియాలో హడావుడి చేస్తుంటారు. పుస్తకాలూ వేస్తుంటారు.
జ్యోతిషంపై హేతువాదుల పుస్తకాలు అంటే ఒక విషయం గుర్తుకు వచ్చింది. చెబుతాను. చాలా కాలం క్రిందటం అంటే గత ఎనభయ్యవ దశకంలో విజయవాడనుండి ప్రచురితమైన ఒక పుస్తకం జ్యోతిషంపైన నిప్పులు చెరిగింది. అది ఒక చిన్న పుస్తకం.
నా మస్తకం అప్పుడున్నంత పదునుగానూ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి దానిలో నుండి ఒక విషయం ప్రస్తావిస్తున్నాను. ఉన్నవి పన్నెండే రాశులు. అందులో కేవలం తొమ్మిది గ్రహాలను అమర్చి చూపి రాశిచక్రం అంటారు. పన్నెండు గళ్ళల్లో తొమ్మిది గ్రహాలను కేవలం కొద్ది రకాలుగానే అమర్చగలం కదా. అంటే ఒకే రాశి చక్రం అనేక మందికి వస్తుంది....
ఇలా సాగింది ఆ పుస్తకంలో తర్కం.
మీ కిందులో తప్పు ఏమన్నా ఉందా లేదా అన్న విషయం కొంచెం సేపు ఆలోచించుకొని ఆ తరువాత క్రింద నేను ఇచ్చే తర్కం చూడండి దయచేసి!
రాశి చక్రంలో ఒక గ్రహం ఉన్న స్థానాన్ని ఒక అంకెతో సూచిద్దాం అనుకుందాం. మనం నిత్యం వాడే దశాంశ గణన విధానంలో అంకెలు పదే ఉన్నాయి. కాని మనకి మన్నెండు రాశులున్నాయి కాబట్టి ద్వాదశాంశ విధానంలో అంకెలు వాడుదాం. ఇవి సున్న నుండి పది వరకూ పది, అపైన A, B అనే మరొక రెండు అంకెలు.
అలాగే గ్రహాలు తొమ్మిది అనుకున్నాం కాబట్టి మనం ఒక తొమ్మిది అంకెల పొడుగున్న సంఖ్యగా ఒక రాశిచక్రం అమరికను సూచించవచ్చును. గ్రహాలకు వారాల క్రమంలో రవి, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అనీ ఆపైన రాహు, కేతు అనీ తొమ్మిదింటికి ఎడమనుండి కుడికి అమరిక అనుకుందాం.
అన్నట్లు, లగ్నం అనేదొకటి కూడా రాశిచక్రంలో గుర్తించి తీరుతాం కదా. అది పదవ గ్రహం లాంటి దనుకుందాం. దానిని పదవస్థానంలో గుర్తిద్దాం.
ఒక రాశి చక్రం ఉదాహరణకి:
రవి | చంద్ర | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | రాహు | కేతు | లగ్నం |
1 | 5 | A | 0 | 6 | 2 | B | 7 | 2 | 8 |
ఇప్పుడు గమనించండి. ప్రతిరాశిచక్రాన్నీ మనం ద్వాదశాంశ విధానంలో పదిస్థానాల సంఖ్యగా వ్రాయవచ్చునని స్పష్టం అవుతున్నది కదా.
ఒక చిన్న ప్రశ్న.
దశాంశ విధానంలో మూడుస్థానాల సంఖ్యలు ఎన్ని ఉంటాయి?
సమాధానం, 10 x 10 x 10 = 1000 అని కదా,
ద్వాదశాంశ విధానంలో పది స్థానాల సంఖ్యలు ఎన్ని ఉంటాయి?
జవాబు. 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 x 12 = 6191,73,64,224.
అంటే, 6191 కోట్ల పై చిలుకు భిన్నమైన రాశిచక్రాలుంటాయన్న మాట.
భారతదేశ జనభా 1947లో ఇంచుమించు 30 కోట్లని గుర్తు. ప్రస్తుతం 100కోట్ల పై చిల్లర. ప్రపంచ జనాభా ప్రస్తుతం 732,47,82,000 అంటే 732 కోట్ల చిల్లర.
దీనిని బట్టి ప్రస్తుతంలో కాని గతంలో కాని ఎన్నడూ ప్రపంచజనాభా గణితం ప్రకారం సాధ్యమయ్యే రాశిచక్రాలకన్నా ఎక్కువగా లేదు. ముందు ముందు అది 6191 కోట్లకు చేరితే మనుష్యులను మేపేంత తిండిని భూమి పండించలేదు.
ఒక్క విషయం దాపరికం లేకుండా చెప్పవలసింది ఉన్నది. బుధుడూ శుక్రుడూ రవికి సమీపంలోనే ఉండి తీరాలి. అలాగే రాహుకేతువులు ముఖాముఖీ రాశుల్లోనే ఉండి తీరాలి. కాబట్టి గణితసాధ్యమైన 6191కోట్ల కన్న కొద్దిగా తక్కువగా రాశిచక్రాలు సాధ్యం.
అవునూ, ఇదంతా సోది ఎందుకు చెప్పానూ? ఒక హేతువాద పుస్తకంలో ఉన్న అమాయకపు అవగాహనను ఎత్తి చూపటానికే కదా?
ఇలాంటి తప్పుడు అవగాహనల వాళ్ళూ జనానికి శాస్త్రీయదృక్పధాన్ని పంచటం కోసం జ్యోతిషాన్ని ఎగతాళి చేస్తూ పుస్తకాలు రాస్తుంటే, జనానికి విజ్ఞానం అందుతోందా? ఆ పేరుతో అజ్ఞానం అందుతోందా?
ఒకప్పుడు మహేంద్రలాల్ సర్కార్ అని గొప్ప వైద్యశిఖామణి ఉండేవారు. ఆయన హోమియో వైద్యాన్ని తిట్టిని తిట్టు తిట్టకుండా చెరిగి పారేస్తూ పెద్ద ఉపన్యాసం సభాధ్యక్షస్థానం నుండి ఇస్తే అంతా భళాభళీ అన్నారు. బాగుంది. కాని ఆయన స్నేహితుడు మరొక డాక్టరు గారు తప్పుపట్టారు. హోమియో వైద్యం గురించి నీకు స్వయంగా ఎంత తెలుసూ అని నిలదీసారు. సర్కారు గారు ఆలోచనలో పడిపోయారు. జర్మనీ నుండి హోమియో వైద్యం గురించిన గ్రంథాలు సేకరించి వాటిలో మునిగి తేలారు.
తరువాత ఏమయ్యింది?
సర్కారుగారు స్వయంగా హోమియో వైద్యుడిగా అవతారం ఎత్తి యావజ్జీవం హోమియోపతీకే అంకితం ఐపోయారు. బెంగాల్లో ఆయనపేరున కాలేజీ కూడా ఉందనుకుంటాను.
మరి ఈ సోది ఎందుకు చెప్పానూ?
హేతువాదులయ్యేది కాకపోయేది జ్యోతిషం అనేదాన్ని సుబ్బరంగా విమర్శించవచ్చును. నేనే బోలెడు విమర్శ రాయగలను. అది వేరే సంగతి. చెప్పొచ్చేదేమిటంటె, జ్యోతిషాన్ని చెరిగిపారేద్దామనుకునే వాళ్ళు ముందుగా బుధ్దిగా జ్యోతిషంలో మంచి పాండిత్యం సంపాదించాలి. అప్పుడు విమర్శించితే అదొక అందం.
నూటికి నూరు శాతం ఋజువు చేయటం అనేది వేరే సంగతి. ముందు వినయంగా జ్యోతిషాధ్యయనం చేస్తే చాలా విషయాలే తెలుస్తాయి.
ఇంకా చాలా సంగతులు రాయవచ్చును ఈ విషయంలో. కాని పాఠకులకు నేను చెప్పదలచినది ఇప్పటికే అర్థమై ఉంటుంది కాబట్టి ఆట్టే గ్రంథం పెంచటంపై ఆసక్తి లేదు.
ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. నేను కూడా ఒక జ్యోతిషపండితుడి సూటి ఫలితాలకు ఆశ్చర్యపోయిన తరువాత ఈ జ్యోతిషం అంటే ఏమిటో అన్న కుతూహలంతోనే అధ్యయనం చేసాను. నాకు నచ్చినవి అనేక విషయాలున్నాయి, నచ్చనివీ ఉన్నాయి కొన్ని కొన్ని.