పగబట్టిన మేక |
ఆలు మగలును వారి యందాల సుతుడు మువ్వురే యైన నిత్యంబు నవ్వులొలకు చక్క నైనది సంసార మొక్క టుండె పరగ మేకల మందకాపరులు వారు |
హాయిగా నుండ నొక నాటి యర్థరాత్రి పిల్లవానికి యొడ లేమొ వెచ్చబడెను తల్లిదండ్రులు మిక్కిలి తల్లడిల్లి తలచి రే దృష్టిదోషమో తగిలె ననుచు |
ముధ్దు బిడ్డడు నే డిట్లు మూల్గుచుండ కారణం బేమి వీని కే గాలిసోకె భూతవైద్యుని వద్దకే పోవలయును గా దలంచిరి భీతులై కళవళపడి |
గంటగంటకు బిడ్డని యొంటి మీద జ్వరము హెచ్చుచు నుండగా చాల బెదరి గ్రామదేవత గుడివైపు మోము లుంచి మ్రొక్కుకున్నారు తల్లిరో ప్రోవుమనుచు |
భూతవైద్యుండు జూచి విభూది పెట్టె దడుపు జ్వరమది మరునాడె తగ్గిపోయె కోడిపుంజును వైద్యుడు కోరినాడు తల్లిజాతర నొక మేక చెల్లిపోయె |
గుఱ్ఱమును బలి యిమ్మని కోర దేమి ఏనుగును తెచ్చి బలి చేయ మన దదేమి పులియె కావలె నని కోర దలచ దేమి బక్కమేకను భుజియించ వలచు తల్లి |
అనుచు విలపించి విలపించి యనవరతము జబ్బుపడి చచ్చె పెంటియు చచ్చు వేళ తనకు వగదీరు పగదీరు దారి కొరకు అమ్మ నీరీతి ప్రార్థించె నాత్మ లోన |
చచ్చు మేకగ పుట్టుట పిచ్చితనము అమ్మరో నన్ను పుట్టించు మమ్మ పులిగ మా తలల వోలె మనుషు లీ జాతరలను పులుల తలలను తెగవేయబోరు గాదె |
నాదు పెనిమిటి మేకను నఱికి జంపి గంతు లేసిన వీరల యంతు జూతు వచ్చు జన్మంబు నందు నా కచ్చదీర వరము నీయవె తల్లి నా పక్ష మగుచు |
అటులె యగుగాక యని పల్కె నపుడు తల్లి పులిగ బుట్టిన మేకకు పూర్వజన్మ జ్ఞానమును నిల్చె మిగుల నాశ్చర్యముగను దాని పగదీరుటకు గూడ తరుణమాయె |
ఆలుమగలును బిడ్డయు నడవిదారి నేగు చుండగ పులి గాంచి యెగిరి దూకి పతిని పడవైచి సంతోష మతిశయించ చంపబోవుచు నంతలో సతిని జూచె |
మగడు చావగ నుండగా మగువ యచట పెద్దపెట్టున నేడ్చుచు పెద్దపులికి దండములు పెట్టుచుండె వేరొండు చేయ గలిగినది లేక కన్నీళ్ళు కారు చుండ |
అంతలో పెద్దపులియును నతివ యెడల జాలి గొని చేసె మనుజభాషణము నిటుల మేక కైనను పులికైన మీకు నైన ప్రాణమొక్కటె సృష్టిలో హీనురాల |
తొల్లి మీయింటి మేకనౌ యల్లనాడు మీరు నా జంట మేకను దారుణముగ కుత్తుకను కోసి బలిజేసి కులికినారు అమ్మ దయ పులినైతి మీ యంతు జూడ |
ఇన్ని నాళ్ళకు చిక్కితి రింక మీరు ప్రాణముల మీద నాశలు వదలు కొనక వేరు దారేమి గలదు పాపిష్టి దాన కోళ్ళ మేకల జంపెడు కుటిల బుధ్ధి |
పులిని క్రూరజంతు వటంచు పలుకుదురటె క్రూరజంతువు మనిషియే కువలయమున ఆటగా జంతువుల జంపు నల్పులార మీవి మాత్రమె ప్రాణాలు కావు సుమ్ము |
అనుచు కసిదీర నిష్ఠుర మాడి యాడి సతిపతుల వంక నతి తిరస్కారదృక్కు లను బరపి పులి వెండియు ననును కొంత సౌమ్య భాషణముల నిట్లు చాన తోడ |
ఆడుదానను బలహీను రాల నగుచు నప్పు డేడ్చితి చూడగా నిప్పు డీవు నేడ్చు చున్నావు నా ముందు హీనబలవు జాలి కలుగును వీనిని జంపబోను |
పతిని కోల్పడు నప్పటి బాధ గూర్చి యెఱుగనే నేను కావున నితని జంపి నిన్ను బాధించ బుధ్ది రాకున్న దిపుడు పొండు పొండింక బ్రతుకుడీ బుధ్ధి కలిగి |
ఇట్లు వాక్రుచ్చి యా పులి యేగె నెటకొ పుండరీకంబు చెప్పిన బుధ్ధి నెఱిగి నాట గోలెను వారెల్ల నయము మీఱ భూతదయ గల్గి యుండిరి పుడమి మీద |
15, అక్టోబర్ 2014, బుధవారం
పగబట్టిన మేక
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)