[ ముందుమాట: నిన్న శ్రీగుండువారు వగల ప్రేమలు చాలు అంటూ ఒక ఖండిక ప్రకటించారు. అందులో వారు సీమాంధ్రవాళ్ళు నీలంవారి శతజయంతిని ఘనంగా నిర్వహించి పీవీగారి వర్థంతిని ఏమాత్రం పట్టించుకోకుండా అవమానించారని ఆరోపిస్తూ "ఆ మహాత్మునికి జయంతి యంత ఘనము!యీ మహాత్ముని వర్థంతి యింత వెగటె?" అని అన్నారు.
వారి ఆ టపాకు నా స్పందన పంపితే అందులో బహుశః వారి దృష్టిలో సద్విమర్శాగౌరవానికి నోచుకోకపోవటం వలన కాబోలు ఆ నా స్పందనను ప్రకటించలేదు. అలా జరగటం సాధారణవిషయమే కాబట్టి, అ స్పందన ప్రతిని అక్షరదోషాల వంటివి దిద్ది, చివరన ఒకటి రెండు వాక్యాలు చేర్చి ఒక టపాగా వేస్తున్నాను ఈ బ్లాగులో.]
బాగుంది. ఆడిపోసుకోవటం ఆపి, ఒక్క ముక్క ఆలకించండి.
నిజానికి దివంగత మహనీయులైన నీలంవారిని గాని పీవీగారిని గాని ఎవరు కించపరచటమూ హర్షణీయం కాదు.
మాజీ రాష్ట్రపతి నీలంవారి శతజయంతి మీరు అనుకుంటున్నంత ఘనంగా జరగనేలే దన్నది పచ్చినిజం. ఆ వేడుకేదో అంతంతమాత్రంగానే జరిగినా, పీవీగారి వర్థంతి అంతమాత్రంగా కూడా జరగలేదని మీ అనుమానం కావచ్చును.
పీవీగారిమృతి సందర్భంగా స్వంతపార్టీకి ఎంతోఘనకీర్తి తెచ్చిపెట్టిన ధీవిశాలుడైన పీవీగారికి కాంగ్రెసుపార్టీవారు ఎంత ఘనంగా అంతిమమైన వీడ్కోలు పలికారో తలుచుకుంటే ప్రతితెలుగువాడి హృదయమూ బాధతోనూ కోపంతోనూ ఊగిపోతుంది. ఘోరావమానంగా జరిపించారు కాంగ్రెసువారు ఆ మహానేతకు వీడ్కోలు. ఇదంతా సోనియమ్మగారి ఆధ్వర్యంలోనే జరిగింది. కాదని బుకాయించే అమాయకులుంటారని అనుకోను. ఆ విధమైన దుష్ప్రవర్తనతో పీవీకి అవమానం జరిపించిన సోనియాను నేడు నెత్తిన పెట్టుకొని దేవతలాగా కొలుస్తూ, ఆమెకు గుడులూ గోపురాలు కడుతూ తెలంగాణావీరజననాయకమ్మన్యులు కూడా పీవీగారి దివ్యస్మృతికి ఎటువంటి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అది మాని సాకులు వెదకుతూ దివారాత్రములూ నిత్యం సీమాంధ్రులను తిట్టిపోయటమే పనిగా పెట్టుకోవటం అనేది మంచి పనేనా? అలోచించుకోండి.
ఒక్క విషయం గ్రహించండి. తెలుగువారికి ఢిల్లోలో ఎన్నడు సరైన గౌరవం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండీ అక్కడ అంతా అరవపెత్తనం. స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో కాంగ్రెసువారికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి అది కూడా ఒక ప్రధాన కారణం. వీలైనప్పుడల్లా తెలుగువారిని అవమానించటానికి అక్కడ నిత్యం ప్రయోగాలమీద ప్రయోగాలు నడుస్తూ ఉంటాయి. ఈ రోజు చిదంబరమూ ఆ తానులో ముక్కే - మీ కేదో నేడు ఒరగబెడుతున్నాడని కాక విస్తృతమైన పరిధిలో ఆలోచించగలిగితే మీకూ బోధపడుతుంది.
ఇకపోతే తమ ఖండికలో శ్రీగుండువారు యధాప్రకారం తమ ధోరణిలో సీమాంధ్రులపై "స్వార్థపరులయ్య మీరలు స్వార్థపరులు" అనీ, "హృదయాన ఘోర విషము దాచుకొన్నట్టి మీర లధర్మపరులు"అనీ, "నీది నటనె" అనీ పాత నిందారోపణలనే పునరుద్ఘాటించారు.