4, అక్టోబర్ 2013, శుక్రవారం

తెలంగాణా వస్తే దోపిడీ అంతమవుతుందా?


ఈ రోజు  ప్రజ బ్లాగులో వచ్చిన  తెలంగాణా వస్తే దోపిడీ అంతమవుతుందా  అన్న ఈ ప్రశ్నకు నా జవాబు ఒక వ్యాఖ్య నిడివికి మించి ఉండటం వలన ఇక్కడ ఒక టపాగా వ్రాస్తున్నాను.

శ్రీ జీ.వి.కృష్ణారావుగారు అనువదించిన పుస్తకం ఆదర్శరాజ్యం (ప్లేటో) పుస్తకాన్ని చాలా చిన్నప్పుడే చదివాను.  అప్పటికి నేను టీనేజ్ పిల్లవాణ్ణి కూడా కాదు. అందుచేత ఆ పుస్తకంలోని చాలా విషయాలు గుర్తులేవు.  పైగా అది ఒక ఉద్గ్రంథం. ఒక్క విషయం మాత్రం బాగా మస్తిష్కంలో నాటుకుపోయింది.  ఆ పుస్తకంలో,  బలవంతుడి ప్రయోజనమే న్యాయం  అనే సిథ్థాంతాన్ని సోక్రటీస్ పూర్వపక్షం చేస్తాడు చాలా చక్కగా.  నిజంగా ఆదర్శరాజ్యం అంటూ ఉంటే దోపిడీ ప్రసక్తే ఉండదు.  పాలకులూ, పాలితులూ అందరూ పరమసజ్జనులే. అంతే‌కాదు, చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళూ పరమసజ్జనులే.  ఐతే, ఇలాంటి పరిస్థితి కేవలం ఊహల్లో మాత్రమే సాధ్యపడుతుంది.  అందుకే ఆదర్శరాజ్యం కూడా ఒక అందమైన ఊహ మాత్రమే.  కాబట్టి దోపిడి లేని రాజ్యం ఉండదు.   కాబట్టి, ఊహాజనితమైన ఆదర్శరాజ్యంలో తప్ప, అన్ని రకాల రాజ్యవ్యవస్థల్లోనూ  బలవంతుడి ప్రయోజనమే న్యాయం అన్నది అనుభవంలోనికి వస్తుంది ఎప్పుడూ.

ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తే,  కొత్తగా వచ్చే తెలంగాణా రాష్ట్రంలోనూ దోపిడీ నిరాటంకంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.  ఆంధ్రప్రదేశంగా సమైక్యంగా ఉన్నప్పుడు దోచుకునేందుకు అందరికీ సమానంగా అవకాశా లుండేవి సైధ్ధాంతికంగా.  నిజం ఎలాగున్నా, తెలంగాణావారి ఆలోచనలో సీమాంధ్రులు అవకాశాన్ని తెలంగాణావారి కన్నా ఎక్కువ తెలివిగా వాడుకున్నారు.   ఇప్పుడు తెలంగాణారాష్ట్రం వచ్చాక తెలంగాణావారికి కూడా ఆ అవకాశం ఇబ్బడిముబ్బడిగా లభిస్తుంది.  దోపిడీ అవకాశం లేని వాడికి, అవకాశం‌ రాని వాడికీ, అటువంటి ఆలోచనలు లేని వాడికీ ప్రవర్తనలో, సమైక్యరాష్ట్రంలోనూ ప్రత్యేకరాష్ట్రంలోనూ కొత్తగా వచ్చే‌మార్పు ఉండదు.  కొత్త తెలంగాణారాష్ట్రంలో అవకాశం అందిపుచ్చుకో గల వాళ్ళుగా మరికొంతమంది బయలుదేరుతారు.  సమైక్యరాష్ట్రంగా ఉన్నప్పుడు అవకాశం ఉపయోగించుకున్న కొంతమందికి మాత్రం వేరే దార్లు వెతుక్కోవలసి వస్తుంది - దోపిడీదారుల్లో మరికొంత మంది దోపిడీ కొనసాగించుకునే కొత్త ఉపాయాలు కనుగొంటారు.

సీమాంద్రులు దోపిడీ చేస్తున్నారని చాలాకాలంగా నానాయాగీ చేస్తున్నారు తెలంగాణా వాదులు.  తెలంగాణాలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశరాష్ట్రంలో ఇన్నాళ్ళుగా జరిగిన అభివృధ్ధి అంతా హైదరాబాదులోనే‌ కేంద్రీకృతమై ఉంది - దీనిలో సీమాంధ్ర భాగస్వామ్యం హెచ్చూ, ఇప్పుడు హైదరాబాదుపై తెలంగాణాకే పూర్తి హక్కు అనటం అన్యాయమూ అని సీమాంధ్రవాళ్ళు ప్రస్తుతం తీవ్రంగా అందోళన చేస్తున్నారు.  రెందు వర్గాల ఆందోళనలోనూ ఎంతోకొంత నిజం లేదనలేం.  ఎక్కడ నిజం ఎన్నిపాళ్ళు అన్న రాజకీయ చర్చకు ఇది స్థలమూ కాదు, సమయమూ కాదు.  ఐతే, తెలంగాణారాష్ట్రం వస్తే ఇంక సీమాంధ్రులు దోచుకునే అవకాశం ఉండదూ అని ఇన్నాళ్ళూ చెప్పిన తెలంగాణా నేతలే మళ్ళా చాలా కాలం పాటు ప్రతి తెలంగాణారాష్ట్ర సమస్యకూ సీమాంధ్రవారి గతకాలపు లేదా వర్తమానకాలపు దోపిడియే కారణమని పాట పాడుతూ ఉంటారు. ఇది సహజం.  ప్రతి సమస్యనూ ఎదుర్కునే క్రమంలో నెపం వేరే చోట వేయటం అనే తతంగం జరుగుతూనే ఉంటుంది.   తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా అనేకానేక యేళ్ళ పాటు ప్రతిసమస్య మీదా కాంగ్రెసు వారు ఇదే రకంగా రాగాలాపన చేయటం అందరికీ విదితమే.  చెప్పవచ్చే‌ ముక్క ఏమిటంటే, సీమాంధ్రవాళ్ళను ఇంకా చాలా కాలం తెలంగాణా వాళ్ళు ఈ‌ నెపంగా దూషిస్తూనే ఉంటారు.  కాబట్టి దోపిడి తెలంగాణాలోనే‌ జరుగుతున్నా సీమాంధ్రులు మాటలు పడటం‌ తప్పదు.

దోపిడీ అనేది ఇద్దరిలో ఒకరు మరొకరిని దోచుకోవటం అనేదొకటే కాక మరో‌ కోణం కూడా ఉంది.  మూడో మనిషీ‌ చేయవచ్చు ఆ ఇద్దరినీ దోపిడీ!  స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ,  రాచకుటుంబంగా మనదేశంలో‌, కాంగ్రెసు పార్టీ పేరుతో స్థిరపడిపోయిన నెహ్రూ-గాంధీ కుటుంబం చేతిలోనే ఎక్కువకాలం అధికారపు పగ్గాలు ఉన్నాయి.  కాంగ్రెసు అయ్యేది కాకపోయేది ఢిల్లీ‌గద్దెకు ఎక్కిన ఏ దొరతనమూ తెలుగువారి ఆశలనూ అభివృధ్ధినీ ఏమాత్రమూ పట్టించుకోలేదు.  చిత్రం ఏమిటంటే, ఐనా ఎప్పుడూ తెలుగువారు నియోగాంధీల పార్టీకి వీరవిధేయులుగా కట్టలు కట్టలుగా ఓట్లూ సీట్లూ‌ కట్టబెడుతూనే ఉన్నారు.  నిరాదరణకూ, వివక్షకూ, దోపిడీకీ గురి అవుతూనే ఉన్నారు.  చివరకు ప్రధాని పదవిని నిర్వహించిన వ్యక్తినీ ఈ‌ కాంగ్రెసుపార్టీ మరణానంతరం కూడా దర్జాగా అవమానిస్తూనే‌ ఉంది. మొన్న ప్రధాని ప్రసంగంలో‌ పీవీ ప్రసక్తి ఉంది.  ఆ ప్రసంగానికి కాంగ్రేసు వారు ప్రకటించిన పాఠంలో పీవీ ప్రసక్తిని తొలగించారు.  తెలంగాణా అనే‌కాదు, తెలుగునాట అనేకానేక ప్రాంతాలు అభివృధ్ధికి ఆమడదూరంలో ఉన్నాయి.  కల్పాకం అణువిద్యుత్తు కేంద్రం‌ ప్రారంభించిన ఇందిరాగాంధీ దాన్ని జాతికి అంకితం ఇచ్చారు - నూరుశాతం విద్యుత్తునూ తమిళనాడుకే ఇచ్చారు!   ఆంధ్రాలో దొరికే సహజవాయునిక్షేపాలలో ఆంద్రప్రదేశానికి ముష్టిస్థాయిలో విదుపుతున్నారు!  ఈ రోజుకూ రైలుబండి ముఖం చూడని వారు కోనసీమలో బోలెడు మంది!   ఇదంతా ఎందుకు ప్రస్తావించాను?  దోపిడీ అనేది తెలుగునాట ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతాన్ని దోచుకోవటం అనే అర్థంలోనే కాదు.  మొత్తం తెలుగువారందర్నీ ఇన్నాళ్ళూ ఢిల్లీ‌ పెద్దలు దోపిడీ చేస్తూనే ఉన్నారని గుర్తు చేసేందుకు.  తెలంగాణారాష్ట్రం ఏర్పడితే ఈ దోపిడీ‌ ఆగుతుందా?  ఒకవేళ అది మరింత పెద్ద దోపిడీగా  పెరుగుతుందా?  ఇష్టం లేని వాళ్ళూ ఐకమత్యమే బలం అన్న కథను గుర్తు చేసుకోండి.  విడిపోయి రెండు రాష్ట్రాలలో పడ్డ తెలుగువారిని మరింతగా దోచుకుందుకు ఢిల్లీ పెద్దలకు మరింత సులువు ఇప్పుడు.  కాదంటారా?

కొత్తగా వచ్చే ప్రతి మార్పూ నవవసంతం అని ఆశపడటం‌ మానవసహజం.  తప్పులేదు.
కాలమే నిర్ణయించాలి ఆ వస్తున్నది వసంతమా, గ్రీష్మమా అన్నది.