29, ఆగస్టు 2013, గురువారం

ఆధ్యాత్మికవేత్తలూ - వైద్యసలహాలూ.

ఈ‌ రోజున  హరిసేవ బ్లాగులో  డయాబెటిస్ - ఒక ప్రాణశక్తి సంక్షోభం :సద్గురు  అని ఒక టపా వచ్చింది.  దానిమీద కామెంటు పెట్టటం మొదలు పెట్టితే, నా వ్యాఖ్య పెద్దదిగా అవుతుందన్న సందేహం కలిగింది.  అందుచేత, ఒక కామెంటుగా అక్కడ ఉంచటం బాగుండదని అనిపించింది. అందుకే ఒక టపా రూపంలో నా అభిప్రాయాలు ఇక్కడ వ్రాస్తున్నాను.

ఈ ఆధ్యాత్మిక వేత్తలు అనబడే వాళ్ళు వారివారి ఆధ్యాత్మిక సందేశాలని అందించటానికి మాత్రమే పరిమితంగా మాట్లాడితే బాగుంటుంది. తెలిసీ తెలియకుండా ప్రతివిషయంలోనూ వ్యాఖ్యానించటం చాలా తప్పు.

తెలిసీ తెలియని విషయాల్లో ఈ‌ ఆధ్యాత్మిక వేత్తలు తలకాయ దూరుస్తూ ఉండటానికి కారణం ఏమిటో?


ఈ  అధ్యాత్మిక వేత్తలకి చాలా అనుసరణ (following) ఉంటుంది.  ఆ కారణంగా వాళ్ళు తరచూ ధైర్యంగా అన్ని విషయాల మీదా మాట్లాడతారు.  ఒక వేళ తమ మాటలు వివాదం రేకెత్తించినా ఇబ్బంది లేదు. సినిమాకి negative talk  కూడా మంచి publicity అవుతుందన్న మాట ఒకటి మనకు తెలుసు.  అలాగే, తమ వ్యాఖ్యానాలతో వివాదాలు వస్తే ఈ ఆథ్యాత్మిక వేత్తలకీ గురువులకీ ప్రచారం పండుతుందన్న మాట.  ఏ వివాదం లేదనుకోండి. తప్పో ఒప్పో జనం వింటున్నారు కాబట్టి ఈ వేత్తలు దర్జాగా తమతమ బోధల్ని విస్తరించుకుంటూ పోతారు,  తమకు ఏ‌ మాత్రమూ సరైన అవగాహన లేని రంగాల్లోకి కూడా.

ఇప్పుడు, ఈ సద్గురుగారి ప్రవచనం చూద్దాం.


మీరు మధుమేహ(డయాబెటిస్) వ్యాధిగ్రస్తులైతే చక్కెరతో మీకు సమస్య కాదు, మీ ప్యాంక్రియాస్(క్లోమ గ్రంథి) సరిగా పనిచేయడం లేదు, అంతే! 

చూడండి, ఈ‌ మాటల్లో కొత్తదనం ఏముంది?  క్లోమగ్రంథి సరిగా పనిచేయక పోవటంతో మధుమేహం వస్తుందని నేటి వైద్యశాస్త్రానికి తెలియదని ఈ సద్గురుగారి అభిప్రాయమా?  అదే చెప్తారు చూడండి.

అల్లోపతి (ఇంగ్లీష్) వైద్యంలో ప్యాంక్రియాస్‌ను ఎలా ఉత్తేజపరచాలో వారికి తెలియదు.

అల్లోపతీ అని పిలిచే ఆధునిక వైద్యంలో క్లోమగ్రంథిని ఉత్తేజపరచటం మీద తగిన శ్రధ్ధ పెడతారు.  ఇంకా ఈ విషయంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు.

అల్లోపతి పైపై లక్షణాలనే చికిత్స చేస్తుంది. వైద్యులు మీ వ్యాధి లక్షణాలకే చికిత్స చేస్తారు.

అ మాట పూర్తిగా నిజంకాదు.  అసలు ఈ‌ ఆరోపణను చేసింది హోమియో వైద్యవిధానాన్ని కనిపెట్టిన హానిమన్ అనే వైద్యుడు.  అదీ రెండున్నర శతాబ్దాలకు పూర్వం. ఆయన గురించీ ఆ వైద్యం గురించీ హోమియో పతీ టపా లో చదవండి. అప్పటి సంగతి ఏమో కాని ఆ తర్వాత ఆధునిక వైద్యం చాలా చాలా అభివృధ్ధి సాధించింది.

యోగాలో మధుమేహ వ్యాధిని చాలా మౌలికమైన సంక్షోభంగా గుర్తిస్తాము. దానిని తేలికగా తీసుకోము. అసలు శరీర వ్యవస్థే దెబ్బతింటోందని, అందుకే వ్యాధి వస్తోందని గుర్తిస్తాము.

ఆనందమే. కాని శరీరవ్యవస్థ దెబ్బతినటం వల్ల మధుమేహం రావటం లేదు.  అది వచ్చాక శరీరంలోని వ్యవస్థలు దెబ్బతింటున్నాయి.  అది రావటానికి కారణం మాత్రం క్లోమగ్రంథి సరిగా పనిచేయకపోవటం.  మొత్తం వ్యవస్థ పని చేయక పోవటం కాదు.

డయాబెటిస్‌ను ఒక వ్యాధిగా కాక, అది శరీరంలోని ప్రాణశక్తి వ్యవస్థ దెబ్బతినడం మూలంగా వచ్చిందని గ్రహించి, దానిని సరిచేయడం వల్ల అది నయమౌతుంది. అందువల్ల మనుషులు తమ శక్తి వ్యవస్థను బాలెన్స్ చేయడానికి కొంత యోగ సాధన చేయడానికి ముందుకు వస్తే అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

అసలు ఈ‌ వాక్యాలు ఏం చెబుతున్నాయో గమనించారా?  ప్రాణశక్తి అనే వ్యవస్థ ముందు దెబ్బతింది.  కాబట్టి మధుమేహం వచ్చింది.  యోగాతో ఈ‌ ప్రాణశక్తిని బాలెన్సు చేయవచ్చును. అందుచేత, యోగసాధన చేసి మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయట పడండి.  ఇదీ‌ చివరకు సద్గరుగారి సలహా.

ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక వేత్తగారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలీ అంటే,

- తమకు మధుమేహం గురించి ఆధునిక వైద్యం పేరుతో‌జరుగుతున్నది వట్టి దగా అని తెలుసు కోవాలి.

- మధుమేహానికి ఆధునిక వైద్యం చేస్తున్న డాక్టరు దగ్గరకు వెళ్ళ కూడదు.

- మధుమేహానికి అంటూ ఆధునిక వైద్యం ఇచ్చిన మందులు వాడ కూడదు. అవి అదుపు చేయగలవేమో కాని వ్యాధిని నయం చేయవు.

- యోగా సాధన మంచిది మధుమేహానికి.  అలాగే అన్ని దీర్ఘవ్యాధులకీ, అదే పరమ వైద్యం.  చివరికి కాన్సరు కైనా సరే.

- మంచి యోగా గురువుని ఆశ్రయించాలి.

- శ్రధ్ధగా యోగా సాధన చేయాలి.


 తగ్గిందా మధుమేహం?  చూసారా మరి గురువుగారు చెప్పినట్లే జరిగింది కదా?
 ఏమిటీ? మీ మధుమేహం తగ్గలేదా? మీ ప్రారబ్ధకర్మ చాలా గట్టిది.  అంతా మీ కర్మ.

ఇదండీ చివరికి తేలింది.

చాలా కాలం క్రిందట నా స్నేహితుడు ఒకతను, గోధుమగడ్డితో సంపూర్ణారోగ్యం అని చదివి,  తెగ మేసాడండీ‌ ఆ గడ్డిని.  ఫలితంగా జబ్బుపడి డాక్టర్ల చుట్టూ తిరిగాడు కొన్నాళ్ళ పాటు.

అలాగే శ్రీమంతెన రాజుగారు ఆరోగ్యం కోసం సలహాలు ఇస్తూంటారు.  టీవీల్లోనూ వస్తారు. చాల పుస్తకాలూ ఉన్నాయి ఆయనవి.  చివరికి ఆయనే, తాను ప్రచారం చేస్తున్న జీవనశైలి వల్లనే తీవ్రంగా జబ్బు పడ్డాడని చదివాను.  ఈ మధ్య  బాబా రాందేవ్ అని ఒకాహన తెగ హడావుడి చేస్తున్నాడు.  ఆయన ఒక క్వేక్ అన్నారో డాక్టరుగారు మొన్ననే.

ఈ‌ మధ్య అనేకానేక ఆయుర్వేదం మందులూ వస్తున్నాయి మధుమేహానికి సరైన వైద్యం ఇదే నంటూ.  ఒక్క విషయం గ్రహించండి.  మూలికలూ భస్మాలూ వాటితో తయారయ్యే ఈ ఆయుర్వేదం మందులు ఎలా పని చేసేదీ పరిశోధనల్లో ఎక్కడా ఋజువు లుండవు. చాలా మంది చేసేది, కేవలం‌ ప్రచారం నమ్మి వాడటమే!  కాని ఈ‌ ఆయుర్వేదం మందులూ, అల్లోపతీ డాక్టరుగారు ఇచ్చే‌ మందులూ‌ కలేసి వాడటం అంత క్షేమకరం కాదు.  ముఖ్యంగా మీ అల్లోపతీ డాక్టరుగారికి చెప్పకుండా ఆస్సలు వాడకూడదు.  ఈ మూలికల్లోని రసాయనాలకూ,  మీ డాక్టరుగారు ఇచ్చే మందుల్లోని రసాయనాలకూ మధ్య ఎలాంటి రాసాయనిక చర్యలు మీ పొట్టలో జరుగుతాయో ఎవరికీ ఏమీ తెలియదు.  మీదు మిక్కిలి అయిపోతే ఆందోళన పడటం కన్నా, ముందే మేల్కోండి.  జాగ్రత్త పడండి!

ప్రతిదానికీ ఈ మధ్య యోగా అని టైటిల్ ఒకటి తగిలించటం ఫ్యాషన్ అయిపోయింది.  అధ్యాత్మిక విద్యలో చెప్పే యోగానికి ఈ నియోయోగాలకీ ఏ సంబంధమూ లేదు.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే,  మీ ఆరోగ్యంతో మీరు ప్రయోగాలు చెయ్యకండి.  అవి తరచుగా వికటిస్తాయి.  వైద్య పరమైన పరిజ్ఞానమూ, అధికారమూ లేని వాళ్ళు చెప్పే వైద్యపరమైన సలహాలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలెయ్యండి.   అలాంటి సలహాలు ఇచ్చే మహనుభావులకి వీలైనంత వరకూ, చాలా దూరంగా ఉండండి.