20, జులై 2013, శనివారం

శ్రీ చాగంటివారిపై వివాదం సమంజసమా?

భాస్కరంగారు ఒక టపా వ్రాసారు ఈ‌ విషయం మీద.  అది చాలా చక్కగా ఉంది. నా మాటగా రాద్దాం అనుకున్న ఈ‌ వ్యాఖ్య పెద్దది అయిపోయింది. అందుకని ఈ టపా.

ధూర్జటిగారి  కాళహస్తి మాహాత్మ్యం ప్రబంధంలో, తిన్నడి కథ ఉంది. అందులో  శివబ్రాహ్నణుడు అనే భక్తుడు, బోయవాడు తిన్నడి మొరటుపూజకు లబలబ లాడుతుంటాడు.  అది చూసి శివుడు, ఆ శివబ్రాహ్మణునితో ఇలా అంటాడు:

క. ఠవఠవపడ నేటికి మది
శివగోచర నీకు, నన్నుఁ జెంచొకఁదు శ్రుతి
వ్యవహారేతర మతమునఁ
దవిలి మహాభక్తిఁ గొలువ దయపుట్టుటయున్

గీ. ఆ కిరాతుని పూజ నంగీకరించి
నాఁడ దద్భక్తి నీవును నేఁడు చూతు
గాని నా వెన్క దిక్కునఁ గానకుండ
నడఁగి యుండుము తడయక యతడు వచ్చు

దీనిని బట్టి శ్రుతివిరుధ్ధం అయిన పూజనూ భగవంతుడు అంగీకరించాడు అని తెలుస్తోంది. అయితే, అది అమాయకత్వం‌ కారణంగానే జరిగిన వ్యవహారం.  అందుకే శివుడు అంగీకరించాడు. వేదధర్మం తెలియని వారూ వేదోక్తంగానే పూజలు చేయాలీ, లేకపోతే పాపం దోషం అనటం సరికాదు కదా! అయితే తెలియని వారు చేస్తే శివానుగ్రహం కలిగిందికదా అని తెలిసిన వారూ వేదధర్మాన్ని విడిచి పెట్టటం మహాదోషం.  అనేకమంది నిరక్షరాస్యులకు వేదోక్త విధానాల గురించి అవగాహన ఉండదు.  కాబట్టి అట్లాంటి గ్రామ్యపూజావిధానాలు దోషభూయిష్ఠం అని వాదించరాదు.


ఉపాధిబేధం చేత అధికారబేధం ఏర్పడుతోంది. అన్ని ఉపాధులకూ వేదప్రామాణ్యం అని ఎవరూ పట్టుబట్టరు కూడా.  

శ్రీకాళహస్తీశ్వరశతకంలో ధూర్జటి ఇలా అంటాడు:

ఏ వేదంబు పఠించె లూత భుజగం బే శాస్త్రముల్ సూచె తా
నే విద్యాభ్యసనం బొనర్చె కరి  చెం చేమంత్ర మూహించె బో
ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా కావు మీ పాద సం
సేవా సక్తియె కాక నిక్కమరయన్ శ్రీకాళహస్తీశ్వరా

అందుచేత విద్యాగంధం లేని బోయని భక్తీ, పూజావిధానాలు ఒకలా, వేద విరుధ్దంగా ఉండటంలో ఏ దోషమూ లేదు. విద్యాగంధమూ, వివేకవిజ్ఞానాలూ ఉన్న వారు, తమతమ స్థితికి తగిన ప్రామాణికమైన విధానాలను తప్పరాదు.

శ్రీ చాగంటివారు తమ ప్రవచనాల్లో చాలా స్పష్టంగా వేదప్రామాణ్యవిధిగా ఉన్న విషయాలనే చెబుతున్నానని అంటారు. శ్రుతి ప్రమాణానికి విరుధ్ధం కానంతవరకూ‌ స్మృతులూ ప్రమాణాలే. సృతి, స్మృతులకు విరుధ్దం కానంత వరకూ పురాణాలు ప్రమాణగ్రంథాలే.  ఇతిహాసాలు పురాణసమానాలు. ఐనా, అవి వేదసమ్మితాలుగా ప్రసిధ్ధికి వచ్చాయి.
"వేదవేద్యే పరే పుంసి జాతే థరథాత్మజే వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షాద్రామాయణాత్మనా" అని శ్రీమద్రామాయణమానికీ, పంచమవేదం అని మహాభారతానికీ ప్రశస్తి. వాటియందు శ్రుతిప్రతిపాద్యధర్మవ్యవస్థ ప్రతిఫలించటమే దానికి కారణం.

షోడషోపచారాదిక పూజనాలూ, పారాయణాదికాలూ ఋషి ప్రోక్తాలు. వేదసమ్మత విధానాలు. అటువంటప్పుడు లోకాచారంలో వైదికవిధివిధానాలకు ఈ కాలంవారు కొత్తరూపాలు కలిగించుతూ ఉన్నప్పుడు ఆయా కొత్తవిధానాల ఆర్షతను చాగంటి వారు పరిశీలించి, ప్రశ్నించటంలో‌ తప్పు పట్టవలసింది యేమీ లేదు. ఒకవేళ చాగంటి వారు అనాచారాలనూ, దురాచారాలనూ ప్రశ్నించకపోతేనే ఆశ్చర్యపోవాలి.

పూర్వం శ్రీశంకరభగవత్పాదులవారు అవతరించిన సమయంలో కూడా చదువుకున్న వారిలోనూ, వేదప్రామాణ్యతావిరుధ్ధంగా ఆచారాలు చెడి అనాచారాలుగా ప్రబలిపోయిన పరిస్థితి. అటువంటి దానిని ప్రశ్నించి, అటువంటి వివిధమతశాఖలను సంస్కరించి, అనాచారాలను ఖండించి పరిస్థితిని శంకరాచార్యులవారు చక్కదిద్దారు. 

ఎవరికైన కటువుగా అనిపించవచ్చును గాక, నేడూ అటువంటి అవ్యవస్థ యేర్పడి ప్రబలుతోంది. అందుచేత వేదప్రమాణవిరుధ్ధమైన అనాచారాలను శ్రీచాగంటి వంటి వారు ఖండించవలసిన అవసరం కూడా తప్పకుండా తలెత్తుతోంది. 


ఈ నాడు ఎందరెదరు బాబాలు, స్వామీజీలు, గురువులు, యోగులు - వీధివీధికీ భగవదవతారాలమని పూజలందుకుంటూ వెలిగిపోతున్నారో మీకూ‌ తెలుసు కదా? వీటిలో ప్రతివారికి వేలాది దేశవిదేశీ భక్తగణం.  మా స్వామి మాకు భగవంతుడే, ఆయనే సృష్టిస్థితిలయ కారకుడు, ధూపదీపనైవేద్యాలతో పూజిస్తాం - వారికే పురుషసూక్తంతో పూజిస్తాం అని ఈ‌ భక్తులు ఎంత గొప్పగా హడావుడి చేస్తున్నారో చెప్పనలవి కాకుండా ఉంది. కాదంటారా?

ఈ చాగంటివారి ప్రవచనాలమీద  TV9 వారు వివాదం లేవదీసిన నాడే, ఆ చానెల్ వారికి నేనొక లేఖ రాసాను. దానికి జవాబు యేమీ ఇప్పటికీ రాలేదు.  ఆ లేఖ పాఠం ఆసక్తి గలవారికోసం, ఇప్పుడు ప్రకటిస్తున్నాను.

ఆర్యా,
ఈ రోజు మీ ఛానెల్ చూడటం జరగలేదు,  పని మీద సిటీలో తిరుగుతూ ఉండటం వలన.   కొద్ది సేపటి క్రిందట ఇంటర్నెట్లో చూచాను ఒక విషయం.
తెలుగు బ్లాగుల్లో "పారాయణం లో పిడికల వేట" ప్రోగ్రాం పేరుతో మీ ఛానెల్ వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మీద బురద చల్లే ప్రయత్నం చేసినట్లుగా టపాలు వచ్చాయి.  దయచేసి ఒక విషయం గమనించండి, దేనినైనా వివాదాస్పదం అంటూ చిత్రీకరించి వార్తా ఛానెళ్ళు కార్యక్రమాలు ప్రసారం చేయటం వెనుక  ఉద్దేశం తరచుగా సత్యాసత్యాలగురించి కాక సదరు ఛానెళ్ళ ప్రచార తాపత్రయం హెచ్చుగా ఉంటోంది.  మీ ఛానెలు అటువంటి పనులు చేయదని మీరు అనవచ్చు. అది వేరే సంగతి.  కాని వ్యాపారదృక్పధం కాక జనోధ్దరణకార్యక్రమంగా ఏదైనా ఛానెల్ నడుస్తోందని నమ్మేంత అమాయకత్వంలో ప్రజలు లేరని మీతో‌సహా అన్ని ఛానెళ్ళూ గ్రహించుకోవాలి.

మీతో సహా అన్ని ఛానెళ్ళలోనూ చర్చల పేరుతో‌జరిగేవి కేవలం ప్రహసనాలే అని అందరికీ తెలుసు. వంచనలూ ఆత్మవంచనలూ నిష్ప్రయోజనం.

మీరు చాగంటి వారిమీద నిందలు వేయదలచుకుంటే అలాగే కానివ్వండి. ఎటు ఉండే జనం అటు ఎప్పుడూ ఉంటారు.

ఇంత కాలం మీ ఛానెల్ వారు కొంతలో కొంత నయం అన్న అభిప్రాయంలో‌ ఉన్నాను.  ఒక వేళ ఆ అభిప్రాయాన్ని సమీక్షించుకోవలసి వస్తుందేమో‌ తెలియదు.

చివరికి సగటు తెలుగు వాడి పరిస్థితి?  ఏ వార్తా పత్రికలోని వార్తనూ‌ నమ్మే పరిస్థితి లేదు.  ఏ ఛానెల్ వారి కథనాలనూ నమ్మే‌ పరిస్థితి లేదు.  ఇంటర్నెట్‌లో వచ్చే‌ కథనాలకు ఎలాగూ విశ్వసనీయత తక్కువే.  ఘనత వహించిన దొరతనం వారు అనుగ్రహించే వార్తా ప్రసారాలను ఎలాగూ విశ్వసించలేము కదా?  ఇంకా మిగిలిన దారి అంటూ ఉన్నదా?

ఇలాంటి పరిస్థితి మనదేశంలోనే ఉందో ఇతరదేశాలదీ ఇదే‌ కర్మమో తెలియదు.

విశ్వసనీయత గురించి ఆలోచించవలసిందిగా మీతో సహా తెలుగు వార్తామాధ్యమానికి ఇదే నా విజ్ఞప్తి. పనికిమాలిన వార్తాకథనాలూ నిందాపూర్వకమైన మిడిమిడి విజ్ఞానులతో చర్చాకార్యక్రమాలూ కట్టిపెడితే మంచిది.

భవదీయుడు
తాడిగడప శ్యామలరావు.


ఆ వివాదం బయటకు వచ్చిన తరువాత అనేకమంది అనేకరకాలుగా దానిమీద టపాలూ వ్యాఖ్యలూ వ్రాసారు. 

మనవు అని ఒక బ్లాగులోవ్రాసిన టపాలోని అభిప్రాయాల మీద నా వ్యాఖ్యను జోడించాను కూడా.  ఆ బ్లాగుటపా 'కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే.' అని.  మొత్తం నా వ్యాఖ్య అంతా ఇక్కడ వ్రాయటం అనవసరమైన స్థలకాలహరణోద్యోగం కాబట్టి ఒక ముఖ్యభాగం మాత్రం ఎత్తి రాస్తున్నాను:

విషయానికి వస్తే చాగంటి వారు  దైవాన్ని 'తుఛ్ఛమైన' కోరికలు కోరటం సమంజసం కాదన్నారు కాని ధర్మబధ్దమైన కోరికలు కోరరాదని అనలేదు కదా?  ఆర్తోజిజ్ఞాసురర్థార్ధీ అని భగవానుడే చెప్పాడు.  ఇక్కడ అర్థము అంటే ధర్మబధ్ధమైన అర్థము అనే కాని తదన్యం‌ కానేరదు.  కోర్టుకేసులో ఆవలి పార్టీ ఓడిపోవాలని మ్రొక్కు కోవటం చేసిన యిరుపక్షాల వారిలో ఒకరిదైనా అక్రమమైన కోరిక కాదా?  గుర్రప్పందెంలో గెలవాలనో‌ లాటరీ రావలనో కోరుకోవటమూ తుఛ్ఛమే కదా?  పెద్దల వాక్యాలకు సొంతతెలివితో అర్థాలు తీయక ప్రమాణబుధ్ధితో గ్రహించటం నేర్చుకోవటం హితకారి అయిన ఆలోచన అని నా ఉద్దేశం.  ప్రతివారు మాకు మేమే ప్రమాణం అనుకోవటం సంఘవినాశ హేతువు. నేను అల్పజ్ఞుడనని మీ వివేకం మీకు బోధిస్తే నన్ను మన్నించండి.

ఏది ఏమైన ఒక విషయం స్పష్టం. పెద్దలు మనకు నచ్చినట్లే మాట్లాడాలీ లేకపోతే వారు తప్పుచేసినవారూ అనటం హర్షణీయం కాదు.  వారు ఏమి చెప్పినా మన అభ్యున్నతి కోరి చెబుతున్నారు. ఇష్టమైన పక్షంలో, చేతనైనంతవరకూ ఆ మంచి మాటలను ఆదరించి ఆచరించండి.  లేదా ఊరుకోండి.  పెద్దల జ్ఞానంలో లక్షోవంతుకూడా లేని మనం వారిని ఆక్షేపించి నోరుమూయించాలను కుంటే, అది జాతికి మంచి చేయదు. 

నాన్సెన్స్. మాకు మేమే ప్రమాణం అంటారా?  మంచిది. మిమ్మల్ని జయించే వారు లేరు. ఇంక యెవరూ, మీకు మంచి చెప్పలేరు, చేయలేరు. ఇతరులెవరూ కూడా మీకు చెడు చేయలేరు - ఎందుకంటే ఆ చెడేదో మీకు మీరే స్వయంగా చేసుకుంటున్నారు కాబట్టి.  ఇక మీ యిష్టం. 

స్వస్తి.