నీ వున్నావు నిజముగను నే నున్నాను ఋజువుగను
దేవా నీవు కాపురుషులకు తెలియరావని యెఱుగుదును
తాపత్రయమున చిక్కిన వారు తల్లడిల్లుట నెఱుగుదును
నీ పదపద్మములందే రామా నిత్యసుఖంబని యెఱుగుదును
నాపై నీకు గల ప్రేముడియు నిక్కముగా నే నెఱుగుదును
పాపము పుణ్యము రెండును వదలుట పద్ధతి యని నే నెఱుగుదును
మధ్యమధ్యలో జగములు పుట్టి మాయమైనవని యెఱుగుదును
అధ్యక్షుడ వీ సృష్టికి నీవని యాత్మలోన నే నెఱుగుదును
మిధ్యాప్రకృతి మాయకు లొంగి మిడికే వారల నెఱుగుదును
అధ్యాత్మము నేమంత యెఱుంగని యాచార్యుల నే నెఱుగుదును
ద్యావాపృధ్వుల వ్యాపించిన నీ తత్వము చక్కగ నెఱుగుదును
భావింపగ భువి నీదగు క్రీడాప్రాంగణమని నే నెఱుగుదును
నీవే క్రీడార్థముగా నన్నిట నియమించితివని యెఱుగుదును
నీవని నేనని వేరుగ లేమని నిక్కముగా నే నెఱుగుదును