20, ఏప్రిల్ 2012, శుక్రవారం

వేగ కనరావయ్య వేదాంత వేద్య


వేగ కనరావయ్య వేదాంత వేద్య
వేగ కనరావయ్య జాగేల రామ

కొఱగాని కలలతో కలత నిద్దురె గాని   
పరమైన ఇహమైన నరయరా దయ్యయ్యొ
అరుదు చేసితి వేమి యగుపడుటయే నీవు
మరలమరల రాక మంచిదే యగు కాద

ఘనమైన రూపమ్ము గొనినీవు కనరాగ
కనులార వీక్షించి కలుషమ్ము లారగా
మనసార కీర్తించి మరి నేను పొంగితిని
తనివి తీరగ మరల దరిశనం బీవయ్య

ఒకసారి జూచి నే నొడలు మరచితి నాయె
యికమీద నినుజూచి యిల నుండ గోరనని
యొక వేళ శంకింతువో నీవు నను జూచి
యిక నిన్నే నెడబాసి యేరీతి నుందురా