22, ఏప్రిల్ 2025, మంగళవారం

ధ్యానవిధాన దండకం


శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంచున్ సదా భక్తితో ధ్యానముం జేయు వారే కదా ధన్యు లో రామ యట్లౌటచే నిత్యమున్ దేవ నీదివ్యరూపంబు హృద్దేశ మందుంచి పూజించి నీదివ్యతత్త్వంబు నాత్మన్ విచారించి హర్షించి నీదివ్యనామంబు జిహ్వాగ్ర మందుంచి ప్రేమానుభావంబు లోనించి ధ్యానించగా నిన్ను సంకల్పముం జేసి మున్ముందుగా తండ్రి  వాత్సల్య మొప్పంగ నీదివ్యనామంబు నాసవ్యకర్ణంబునం జొన్పి నీయందు సద్భక్తి నాలోన నిండించి నన్నున్ కటాక్షించి రక్షించెనే దేవు డా శ్రీహరున్ విశ్వనాథున్ గరూత్తంశు హృద్బూమి నర్చించి నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ పంచాంగశుద్ధిన్ విచారించి యారంభముం చేయగా నేటికన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ నిత్తావు యోగ్యంబు నచ్చో టయోగ్యంబంచు తర్కించుచున్ కాలముం బుచ్చగా నేటికిన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ నుంకించుచో నింతకాలంబు ధ్యానంబు సాగింతు నేనంతకాలంబు సాగింతు నంచున్ ప్రమాణించగా నేటికిన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ సంకల్పముం జేసి యీ సంఖ్యతో పూర్తి యాసంఖ్యతో పూర్తి యంచుం ప్రమాణించగా నేటికిన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ నీ వస్త్రమాల్యాదులం దాల్చు టొప్పంచు నాభూష లాయంగరాగంబు లొప్పంచు వేషంబుపై శ్రధ్ధముఖ్యంబుగా నెంచగా నేటికిన్ నీదివ్యనామంబు జిహ్వన్ ప్రవర్తింపగా జేయ లోనెంచి ధ్యానంబుచే గల్గు నీసత్ఫలంబంచు నాసత్ఫలంబంచు బుధ్ధిన్ విచారింపగా నేటికిన్ నీయందు సద్భక్తి దీపించినం జాలు నీనామం దెంతయున్ రక్తి రూపించినం జాలు నాహారశయ్యాదు లడ్డంబులే కావు నిద్రాద్యవస్థల్ విచారింప నడ్డంబులే కావు భోగంబు రోగంబు నడ్డంబులే కావు లోకానుమోదాపవాదంబు లడ్డంబులే కావు కావంచు నాబుధ్ధిలో దేశకాలాదు లేమెంచకన్ దేహసౌఖ్యాదు లేమెంచకన్ లోకవృత్తంబు లేమెంచకన్ తుఛ్ఛమౌ కోర్కు లేమెంచకన్ నీదివ్యనామంబుపై శ్రధ్ద నిండార నీయందు సద్భక్తి నాలోన పొంగార ప్రేమాతిరేకంబుతో నిన్ను ధ్యానింతు శ్రీరామచంద్రా నమస్తే నమస్తే నమస్తే నమః

20, ఏప్రిల్ 2025, ఆదివారం

నాకేల పలుకవు

నాకేల పలుకవురా రామ
నీకిది న్యాయమ రఘురామ

నేనేమి పలికితి నీ నామమే గాక
నేనేమి చదివితి నీచరితమే గాక
నేనేమి నమ్మితి నీసత్యమే గాక
నేనేమి చాటితి నీకీర్తినే గాక

నేనేమి వలచితి నీరూపమే గాక
నేనేడ నిలచితి నీమ్రోలనే గాక
నేనేమి పాడితి నీఘనతనే గాక
నేనెవడ నైతిని నీబంటునే గాక

నేనేమి తరచితి నీ తత్త్వమే గాక
నేనేమి చేసితి నీ ధ్యానమే గాక
నేనేమి కోరితి నీకరుణయే గాక
నేనేమి తలచితి నిను చేరుటే గాక

కొలువైయున్నాడు

కొలువైయున్నాడు కోదండరాముడు
    చెలులార యిటురారే
కొలుచువారల కెల్ల నీరామచంద్రుడు
    కొంగుబంగారమే 

చేరి యుందరు మీరు శ్రీరామచంద్రుని
    చిత్తశుద్ధిగ కొలువరే
కూరిమితో మీరు శ్రీరాముని కొలిచి
    కేరింతలు కొట్టరే

వారిజాక్షుని మహిమ వర్ణించు కృతులను
    ధారాళముగ పాడరే
ఆరాముని గొప్పలను పొగడుచును మీరు
    హారతు లందించరే

దాశరథి దొడ్డదయను పొగడుచు మీరు
    దండములు పెట్టరే
పాశహస్తుని బాధ మాకింక లేదని
    పదిమందిలో చాటరే

తారకరాముని పూజించి భవచక్ర
    తాడన మొనరించరే
చేరి శ్రీరాముని శ్రీపాదములు సం
    సారము తరియించరే

18, ఏప్రిల్ 2025, శుక్రవారం

దండకం

శ్రీరామ నీనామమే దక్క నే నన్యదేవాళి నామంబు లేరీతిగా బల్క నుంకింతు శ్రీరామ నీతత్త్వమే గాక నే నన్యతత్త్వంబులం బుధ్ధిలో నెన్న నేరీతి నూహింతు శ్రీరామ నీరూపమే గాక యే యన్యదేవాళి రూపంబులం జూడగా నాత్మ నూహింతు శ్రీరామ నీదివ్యచారిత్ర్యమే గాక యే యన్యచారిత్ర్య పారాయణం బెట్లు నేజేతు శ్రీరామ నీభక్తసంఘంబులం గాక నే నన్యులం జేరగా నెట్లు భావింతు శ్రీరామ నీ దివ్యక్షేత్రంబులం గాక యే యన్యస్థానంబు లం దెట్లు నేనుందు శ్రీరామ నీపూజలే గాక చేయెత్తి నేనన్యదేవాళి నేరీతి పూజింప నూహింతు శ్రీరామ నీదివ్యసత్కీర్తినే గాక నేనన్యదేవాళి నేరీతి కీర్తింపగా నెంతు శ్రీరామ నీపాదదాసుండనై యుండి యేరీతి గానన్యదేవాళికి న్మ్రొక్క నుంకితు శ్రీరామ మచ్చిత్తసింహా‌సనాసీన చిన్మూర్తి నిన్నే కదా నేను నిత్యంబు ధ్యానింతు శ్రీరామ నీవే కదా నాకు సర్వంబు నీవే కదా నాకు సత్యంబు నట్లౌటచే దేవ శ్రీరామ నీదివ్యధామంబు జేరంగ లోలోన నిత్యంబు సద్భక్తితో నేను చింతింతు సద్భక్తమందార దేవాధిదేవా మహోదార కారుణ్యముం జూపి నన్నేలుకోవయ్య సౌమిత్రిసీతాసమేతా మరుత్పుత్ర సంసేవ్యమానాంఘ్రిపద్మా మహాయోగిహృత్పద్మధామా సదానంద సాకేతరామా పరంధామ వైకుంఠధామా విరించ్యాది సంస్తుత్యదివ్యప్రభావా నమస్తే నమస్తే  నమస్తే నమః

17, ఏప్రిల్ 2025, గురువారం

శ్రీరఘురామ సీతారామ

శ్రీరఘురామ సీతారామ
ధారాధరసుశ్యామ

జయజయ రామ జగదభిరామ
జయ శుభనామ జానకిరామ

ఇనకులసోమ మునిజనకామ
జనహితకామ జానకిరామ

భయహర రామ పావననామ
జయకర రామ జానకిరామ

శ్రితజనపాల దితిసుతకాల
సతతదయాళ జానకిలోల

అతిబలధామ దితిజవిరామ
నతసుత్రామ జానకిరామ

జయ గుణధామ జయ రణభీమ
జయ రఘురామ జానకిరామ