23, మే 2017, మంగళవారం

మధురగతి శివరగడసృష్టి సమస్తము శివాజ్ఞచే నగు
సృష్టి వికాసము శివాజ్ఞచే నగు
సృష్టి విలాసము శివాజ్ఞచే నగు
సృష్టిని సర్వము శివాజ్ఞచే నగు
సృష్టికి తుష్టియు శివాజ్ఞచే నగు
సృష్టి లయంబును శివాజ్ఞచే నగు
జీవుని రాకడ శివాజ్ఞచే నగు
జీవుని పోకడ శివాజ్ఞచే నగు
జీవుని యునికియు శివాజ్ఞచే నగు
జీవుని మనికియు శివాజ్ఞచే నగు
జీవుని యోగ్యత శివాజ్ఞచే నగు
జీవుని భాగ్యము శివాజ్ఞచే నగు
జీవుని భోగము శివాజ్ఞచే నగు
జీవుని యోగము శివాజ్ఞచే నగు
జీవుని విభవము శివాజ్ఞచే నగు
జీవున కభయము శివాజ్ఞచే నగు
జీవికి తెలివిడి శివాజ్ఞచే నగు
జీవికి మోక్షము శివాజ్ఞచే నగు
జీవికి ధర్మము శివాజ్ఞయే యగు
జీవికి సత్యము శివాజ్ఞయే యగు
జీవన ధర్మము శివాజ్ఞచే నగు
జీవికి శుభములు శివాజ్ఞచే నగు
ఏవిధముగ నవి యెసగునొ తెలియుము
భావన చేయుము బంధము విడువుము
శివకైంకర్యము చేసిన శుభమగు
శివమాహాత్మ్యము చెప్పిన శుభమగు
శివపూజనముల చెలగిన శుభమగు
శివనామంబును చేసిన శుభమగు
శివశివశివ యని శివచిహ్నంబగు
ధవళవిభూతిని దాల్చిన శుభమగు
శివశివశివ యను శివసేవకులగు
శివమూర్తులతో చేరిన శుభమగు
అవిరళశివతీర్థాటన పరుడగు
శివభక్తున కతి శీఘ్రమ శుభమగు
అనారతంబును హరుని నామము
రసనాగ్రంబున రాజిలు నీమము
కలిగి రహించిన కడుగడు శుభమగు
కలుషవనంబుల గాల్చెడి  శుభమగు
శివశివ శివశివ శివశివ యనుచును
భవభవ భవభవ భవభవ యనుచును
హరహర హరహర హరహర యనుచును
స్మరహర స్మరహర శరణం బనుచును
శరణము పురహర శరణం బనుచును
శరణము భవహర శరణం‌ బనుచును
శరణము పశుపతి శరణం‌ బనుచును
శరణము త్ర్యంబక శరణం‌ బనుచును
శరణ ముమాపతి శరణం‌ బనుచును
శరణము ధూర్జటి శరణం బనుచును
పరమానందము బడసిన శుభమగు
పరమశుభంబగు పరమశుభంబగు
పరమశుభంబగు పరమపదంబున
హరుడు నిలుప నత్యంత ముదంబున
అటునిటు దిరిగిన  నటమట కలుగును
ఇటులుండినచో హితమే కలుగును
శివునే తలచుము శివునే కోరుము
శివునే నమ్ముము శివునే చేరుము

(రేపు 24న మాసశివరాత్రి సందర్భంగా శివపరంగా మధురగతి రగడ)

9 కామెంట్‌లు:

 1. ఈ మధురగతి శివరగడ స్వరపరిచిన మధురస్వ"రగడ" (రగడ = మెలొడీ) అవుతుందండి - నాకు భలే నచ్చేసింది. ఓం నమశ్శివాయ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లలితగారూ,
   మీకు నచ్చినందుకు సంతోషం. ఈరోజున నా బ్లాగు చదివేవారి సంఖ్య అన్నదే తక్కువ. ఇంకా నా రచనలను ఎవరైనా స్వరబధ్ధం చేసి ఆలపించటమా? అంత ఆశ లేదండి. ఏదో‌ ఉన్నన్నాళ్ళూ‌ దైవసంకీర్తనం చేసుకుంటే చాలు - వీలున్నప్పుడు బ్లాగుల్లో అవి ప్రకటించటమే చేయగలనేమో‌ కాని ఆశలకు పోలేను కదా. ఈ మధ్య కాలంలో ఆఫీసుపనికి తప్ప ఘడియతీరట‌ం కూడా గగనంగా ఉండి చలా ఆవేదనగా ఉంటున్నది. లోలోన నామజపం తప్ప బ్లాగుతెరచి నాలుగు పద్యాలు వ్రాసుకొనేందుకు కూడా సమయం‌ దొరకటం‌లేదు. దొరికినంతలోనే యీ‌వ్రాతలన్నీ.

   తొలగించండి
 2. చాలా రోజుల తరవాత!
  బాగుంది, ప్రక్రియ కొత్త, నాకు తెలియనిదే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రగడలు దేశిఛందస్సులు. వీటిలో‌ ద్విపదల్లోలాగా ప్రాసనియమంతో రెండేసి పాదాలొక పద్యం. మధురగతికి పాదానికి నాలు చతుర్మాత్రాగణాలు మధ్యలో విరచి యతి. నిజానికి పదహారు మాత్రలొకపాదం అంటే బాగుంటుంది. రగడల్లో అందం అల్లా వాటికి కల అంత్యప్రాసా నియమం.

   తొలగించండి
 3. తాడిగడప శ్యామలగారూ!ఇంత వీనుల విందైన,రమ్యమైన రగడని చదివాక నాకు ఒక ఆలోచన కలిగింది!! నేను ఆటిజం మీద ఒక సాంఘిక నాటకం 'నీలిరంగు రిబ్బను' అనే పేరుతొ వ్రాస్తున్నాను. నా నాటకంలో ఒక వినూత్న జానపద కళా రీతిని పరిచయం చేయాలనిపించింది. మీ బ్లాగు పేరులో అంటే శ్యామలీయం అనే పేరులో 'ఆటిజం' సంకేతమైన నీలం రంగు ఉంది!! నేను పద్య రచన చేయలేను, నా కోసం నా నాటకాన్ని ప్రదర్శించే కళాకారుల కోసం ఆటిజం అనే మనో వికృతి మీద రగడ వ్రాస్తే, బాగుంటుంది అని మిమ్మల్ని వేడుకొంటున్నాను! ఇట్లు.. శ్రీదర్.ఎ (క్షీరగంగ బ్లాగరు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదాలు! నా బ్లాగులో ఈ రోజు టపా కొట్టిన 'శ్రీరంగ నీతులు' చదవండి. దానిని మీ పద కవితా విన్యాసంతో తీర్చి దిద్దండి. ...శ్రీధర్.ఎ.

   తొలగించండి


 4. ---


  శయ్యాసౌభాగ్యంబుల్
  వయ్యా రపునడక పద్య వాగ్ఝరి బాగుం
  దయ్యా మీ మధురగతియు
  సయ్యాటగ సాగెనయ్య శ్యామల రాయా !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యతిప్రాసల సంగతేమో తెలీదుగాని
   పద్యం బాగుంది :)

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.