13, అక్టోబర్ 2014, సోమవారం

సౌందర్యలహరి - 17 (కొనసాగింపు)



మొదటి శ్లోకంవెనుకటి శ్లోకంతదుపరి శ్లోకం

ఈ 17వ శ్లోకంలో ఉన్న వశిన్యాద్యాభిః అన్నది చాలా కీలకమైన పదప్రయోగం అని చెప్పుకున్నాం‌ కదా. ఇప్పుడు దాని గురించి వివరించేందుకు ప్రయత్నిస్తాను. ఇది సాంకేతికమైన వ్యవహారం కాబట్టి పాఠకులు కొంచెం ఓపికతో, మరికొంచెం గమనికతో చదువుకోవాలని మనవి. 

శ్రీచక్రం శివ-శక్తుల ఐక్యస్వరూపం.   శ్రీచక్రంలో శక్తికోణాలు శివకోణాలు అంటు కొన్ని త్రికోణాలను గురించి గత శ్లోకాల్లో ప్రస్తావించిన సంగతి గుర్తు చేసుకోండి.  శ్రీచక్రం పిండాండం అని చెప్పబడే మానవశరీరానికి ప్రతీక. ఈ విషయం గత శ్లోకాల్లో కొన్నింటికి వ్యాఖ్యానం చేస్తూ ప్రస్తావించిన సంగతి గుర్తు చేసుకోండి.

అలాగే, శ్రీచక్రం శ్రీవిద్యామంత్రాలకు చిహ్నం. మనం శ్రీవిద్యయొక్క లోతుల్లోకి వెళ్ళి సౌందర్యలహరీ వ్యాఖ్యానం చదువుకోవటం లేదు కాబట్టి, అత్యవసరం ఐనప్పుడు తప్ప దీనిని గురించి చర్చించుకొన బోవటం లేదు.

శ్రీచక్రం బ్రహ్మాండానికి ప్రతీక.  సాంకేతికంగా పిండాండం అనేది బ్రహ్మాండం యొక్క సూక్ష్మరూపం అన్నమాట ఇంతకు ముందే చెప్పుకొన్నాం. సందర్భం వచ్చినప్పుడు శ్రీచక్రం బ్రహ్మాండసంబంధమైన ప్రతీక ఎలాగో తెలుసుకోవచ్చును.

శ్రీచక్రంలో అనేకమంది దేవీమూర్తులను గుర్తిస్తారు. వీరే వశిన్యాదులు. వీరిని గురించి ప్రస్తుతం అవగతం చేసుకోవలసి ఉంది. ఇది ఈ‌ శ్లోకానికి సంబంధించినది కాబట్టి, తప్పక పరిశీలించాలి.

శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలున్నాయి.  వీటినే నవావరణములు అని ప్రసిధ్ధంగా వ్యవహరిస్తారు. అలాగే మరికొన్ని ప్రత్యేక విభాగాలూ ఉన్నాయి శ్రీచక్రంలో.  వీటన్నింటికీ సాంకేతికంగా పేర్లూ, అధిష్ఠాన దేవతలూ, ప్రత్యేకమైన వర్ణవిశేషాలూ, బీజాక్షరాలూ, పరివార దేవతలూ ఇలాగ వేరువేరుగా ఉన్నాయి.  ఈ సాంకేతిక అంశాలతో తగుమాత్రం పరిచయం తప్పనిసరి. సాధ్యమైనంత సులభంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

మొదటి ఆవరణము. శ్రీచక్రం మధ్యలో ఉన్న బిందువు. దీనికే సర్వానందమయ చక్రం అని సంకేతం. అదిష్ఠాన దేవత శ్రీత్రిపురసుందరీ దేవి. అయ్యవారు కామేశ్వరుడు. ఇద్దరినీ కలిపి కామేశ్వరీకామేశ్వరులని పిలుస్తారు. సుధాసింధోర్మధ్యే అనే శ్లోకంలో ప్రస్తుతించబడిన తల్లి ఈమెయే. దీనికే ఓఢ్యాణపీఠం అని పేరు. ఇక్కడ యోగినీదేవి పేరు పరాపరరహస్యయోగిని.

రెండవ ఆవరణము త్రికోణం.  ఇది మొదటి ఆవరణం ఐన బిందువును చుట్టి ఉంటుంది.  బిందువే సత్వరజస్తమోగుణాలనే మూడు గుణాలని స్వీకరించి త్రికోణం అయ్యింది. ఇది సర్వసిధ్ధిప్రద చక్రం అని పేరుకలది. స్థూలంగా, కొంత సాంకేతికాంశాలు విడిచి చెప్పితే ఈ‌ త్రికోణంలోని బిందువులు త్రిమూర్తులకూ వారిదేవేరులకూ అధిష్ఠాన స్థానాలు. వీటినే వాగ్భవ, పూర్ణగిరి, జాలంధరపీఠాలని చెబుతారు.  ఈ చక్రంలో ఉన్న యోగినికి అతిరహస్యయోగిని అని పేరు.

మూడవ ఆవరణం అష్టకోణం. అంటే మధ్యస్థ త్రికోణాన్ని ఆనుకుని ఉన్న ఎనిమిది త్రికోణాల వలయం. దీనికి సర్వరోగహరచక్రం అని పేరు. ఇక్కడ ఉండే దేవతలు ఎనిమంది పేర్లూ వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలా, అరుణా, జయినీ, కౌళినీ, సర్వేశ్వరీ అనేవి. వీళ్ళనే స్థూలంగా కలేసి వశిన్యాదులు అని చెబుతూ ఉంటారు. ఈ‌ ఎనిమిది త్రికోణాలూ ఎనిమిది ప్రకృతులకు సంకేతస్థావరాలు. పంచభూతాలు, మనస్సు, బుధ్ధీ, అహంకారమూ అనే ఎనిమిది ప్రకృతులే ఈ ఆవరణంలో ఉన్న ఎనిమిది మూల ప్రకృతులూ. "భూమిరాపోనలోవాయుః ఖంమనో బుధ్ధిరేవ చ అహంకార ఇతీహ్యం మే భిన్నాః ప్రకృతి రష్టధాః" అని ప్రసిధ్ధంగా భగవద్గీతల్లోనూ‌ ఉంది కదా. అవన్న మాట.  ఐతే, శ్రీ‌శంకరులు ఇక్కడ వశిన్యాద్యాభిః అని చెప్పినది ఈ‌ ఎనిమిదిమంది దేవతలను గురించి మాత్రమే కాదు. మరికొంత  విషయం ఉంది. ఇక్కడ ఉన్న యోగినులు రహస్యయోగినులు చక్రేశ్వరి, త్రిపురసిధ్ధాంబ అనే వారు.

నాలుగవ ఆవరణం అంతర్దశారం అని పిలువబడే పది త్రికోణాల వలయం.  ఇది అష్టత్రికోణ వలయానికి ఆనుకుని ఉన్న మొదటి త్రికోణ వలయం. దీనికి సర్వరక్షాకర చక్రం అని పేరు. ఇక్కడ పదిమంది దేవతలు అధిష్ఠించి ఉన్నారు. వారి పేర్లు సర్వజ్ఞా, సర్వశక్తీ, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశీనీ, సర్వాధారస్వరూపా, సర్వపాపహరీ, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదా.  మూలప్రకృతి యొక్క విషయములూ, వృత్తులే ఈ సర్వజ్ఞాది దేవతాస్వరూపాలు. ఇక్కడ యోగినులు దేవతాగర్భములు.

ఐదవ ఆవరణం అంతర్దశారానికి పైన ఉన్న బహిర్దశారం. దీనికి సర్వార్థసాధక చక్రం అని పేరు. ఇక్కడ ఉన్న దేవతల పేర్లు సర్వసిధ్ధిప్రదా, సర్వసంపత్ప్రదా, సర్వప్రియంకరి, సర్వమంగళకరీ, సర్వకామప్రదా, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమనీ, సర్వవిఘ్నవారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ. ఇక్కడ యోగినులు కులోత్తీర్ణ యోగినులు.

ఆరవ ఆవరణం చతుర్దశారం. ఇది అన్ని త్రికోణాల వలయాల్లోనూ పైది.  ఇక్కడ పదునాలుగు త్రికోణాలున్నాయి. సర్వసౌభాగ్యచక్రం అని దీనికి పేరు.  దీని పద్నాలుగు త్రికోణాలు పద్నాలుగు లోకాలకు ప్రతీకలు.  ఇక్కడ ఉండే దేవతలు పదునాలుగు మంది పేర్లూ సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వాహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వవిజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధినీ, సర్వసంపత్పూరణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ అని. ఇక్కడ వీరే యోగినులు -వీరినే సంప్రదాయ యోగినులు అంటారు.

ఏడవ ఆవరణం అష్టదళపద్మం. దీనికి సర్వసంక్షోభిణీ చక్రం అని పేరు.  ఇక్కడ ఎనిమిది మంది దేవతలున్నారు. వీళ్ళ పేర్లు అనంగకుసుమా, అనంగమేఖలా, అనంగమదనా, అనంగమదానాతురా, అనంగరేఖా, అనంగవేగినీ, అనంగాంకుశా, అనంగమాలినీ అని.

ఎనిమిదవ ఆవరణం షోడశదళ పద్మం అంటే పదహారురేకుల పద్మం. దీనికి సర్వాశా పరిపూరక చక్రం అని పేరు.  ఇక్కడ పదహారుమంది దేవతలున్నారు. వీళ్ళ పేర్లు కామాకర్షిణీ, బుధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ అని. వీళ్ళనే‌ కర్షిణ్యాదులు అంటారు. ఇక్కడ వీరికే గుప్తయోగినులనే వ్యవహారం.

తొమ్మిదవ ఆవరణం లోపలి వెలుపలి భూపురాలు. ఇందులో లోపలి భూపురానికి మూడు భాగాలు. మొదటిది శుక్ల (తెల్లని) వర్ణం.  ఇక్కడి శక్తిదేవతలైన వామా, జ్యేష్ఠా, రౌద్రీ, అంబికా, పశ్యంతీ, ఇఛ్ఛా, జ్ఞానా, క్రియా, శాంతా అనే వారూ, వీరితో పాటు సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశా, సర్వఖేచరీ, సర్వబీజా, సర్వయోనీ అనే నవముద్రాదేవతలూ ఉన్నారు.  మధ్యభూపురం రక్త(ఎర్రని) వర్ణం కలది. ఇక్కడ బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండా మహాలక్ష్మీ అనే మాతృకాదేవతలు ఉన్నారు. తృతీయభూపురం పీత (పసుపు) వర్ణం కలది.  ఇక్కడ సప్తకోటి మంత్రాధిష్టానదేవతలు ఉన్నారు.

సమిష్ఠి భూపురం చతురస్రాకారంలో ఉంది కదా అన్నింటికన్నా పైన. దీనికి త్రైలోక్యమోహన చక్రం అని పేరు. ఇక్కడ దేవతల అష్టసిధ్ధిప్రదాయికలు అంటే అణిమాసిధ్ధి, లఘిమాసిధ్ధి, మహిమాసిధ్ధి, ఈశత్వసిధ్ధి, వశిత్వసిధ్ది, ప్రాకామ్యసిధ్ది, గరిమాసిధ్ధి, ప్రాప్తిసిధ్ది అనే వారు. వీరినే ప్రకటయోగినులు అని కూడా అంటారు.

ఇలా శ్రీచక్రం యొక్క ఆవరణలన్నీ‌ దేవీ మూర్తులకు నిలయాలు.శ్రీ శంకరులు ఈ‌శ్లోకంలో  వశిన్యాద్యాభిః అన్నది అందరినీ కలిపి స్మరించటం కోసం అన్నమాట.  ఐతే ఆచార్యులవారు వశినీ మొదలైన దేవతామూర్తులనే స్మరించారా, వివిధయోగినులనూ స్మరించారా అన్నది సందిగ్ధంగా అనిపించవచ్చును. అన్నిరకాల శక్తిమూర్తులనూ స్మరించారని చెప్పుకోవటమే సమంజసం.

ఈ విధంగా మనం వశిన్యాద్యాభిః అంటే ఏమి తెలియజేస్తోందో తెలుసుకున్నాం కదా. కాని, కొద్దిగా విస్తారమైనట్లు అనిపిస్తోంది. మన్నించాలి. నిజానికి విషయం అంతా బాగా క్లుప్తీకరిస్తేనే పరిస్థితి ఇది.

ఐతే సారస్వత ధ్యానంలో ఇదంతా దేనికి అన్న అనుమానం రావచ్చును. దానికి సంబంధించిన వివరాలు మనం వచ్చే టపాలో చదువుకుందాం.