22, అక్టోబర్ 2025, బుధవారం

బ్రతికి యున్నందు కేమి ఫలము


బ్రతికి యున్నందు కేమి ఫలము మనకు సీతా
పతిని కొలువకున్న నేమి ఫలము మనకు

చీమ లెన్ని పుట్టవు చిలువ లెన్ని పుట్టవు
దోమ లెన్ని పుట్టవు భూమి నెల్ల వేళల
భూమి మీద నరునిగ పుట్టి లాభ మున్నదా
రామనామ మెన్నని బ్రతుకొకటి బ్రతికిన

ఘనత కాదు కాదని కాసు లిన్ని కలుగుట
వనిత సర్వ మనుకొని ఫలిత మేమి లేదని
మనసు కెఱుక కానిది మనిషి ప్రీతిమీఱగ
ఇనకులపతి నామమే యెన్నకను బ్రతికిన

అతులితమై సిరియున్న నది యుధ్ధరించునా
వ్రతము లెన్ని చేసిన ఫలిత మెంత కలుగును
శ్రుతులు కంఠగతమై సొరిది మోక్షమబ్బునా
సతతము రామనామస్మరణ లేక బ్రతికిన