ఉదయవేళ నిన్ను పొగడి నొకమారు మరల పొగడి
ముదమున నటు పొగడ నిటు నిదురవేళాయెరా
ముదమున నటు పొగడ నిటు నిదురవేళాయెరా
నిదురలో మునిగితినా నీ నామ మపుడు నాదు
పెదవులపై నిరంతరము కదలాడుట మానునో
అది సమ్మత మెటులగునని యందు నేమందువురా
మదినేలెడు హరి నన్ను నిదుర నైన వదలకురా
నిదురలో నాతో నీవు నిలువ నాటపాటలతో
ముదమారగ నిన్ను నేను పొగడచుండు స్వప్నములు
మదిని నింప సంతసము మంచివాడ రాముడా
ఉదయవేళ సమీపింప నిదిగో మేల్కాంచితి
సదయ నిరంతరము నిన్ను సన్నుతించుటయె గాని
మదిని తోచ దింకొక్కటి మంచికార్య మనుచు నాకు
వదలక నను బ్రోచు రామ వదలక నిను పొగడెదరా
ముదమున నను వినవేడెద మోక్ష మిమ్ము చాలు నయ్య