21, సెప్టెంబర్ 2025, ఆదివారం

ఇంకచాలు మాధవా

మనసు విరిగిపోయెరా మాధవా యీ
మనుజజన్మ మింకచాలు మాధవా

విలువలేదు నామాటకు వేడుకేమిరా సుంత
విలువలేదు నాచేతకు వేడుకేమిరా
విలువలేదు నాబ్రతుకుకు వేడుకేమిరా యింక
పిలిపించుకొనర నిన్ను వేడుకొందురా

బ్రతికితి నొకబ్రతుకునే భగవంతుడా అట్టి
బ్రతుకు శిధిలమాయెరా భగవంతుడా
బ్రతుకలేను దీనుడనై భగవంతుడా ఇంక
బ్రతుకును చాలించనిమ్ము భగవంతుడా

రానీయర నీకరుణను రామచంద్రుడా యింక
రానీయర నీపిలుపును రామచంద్రుడా
రానీయర శాంతస్థితి రామచంద్రుడా యింక
రానీయకు మరల జన్మ రామచంద్రుడా