శ్రీరామ నీనామమే చేయుచున్నాను
చేపట్టి రక్షించరా దేవ
వారాశిగర్వాపహారి భవవారాశిని
పడియుంటి రక్షించరా దేవ
నీనామమే గాక నేనన్య మెఱుగను
నిండార దయచూపరా దేవ
మానవేంద్రుడ నేను మానవాధముడనే
మన్నించి రక్షించరా దేవ
నీపాదములె సాక్షి నీవాడనే నేను
చేపట్టి రక్షించరా దేవ
కోపించవద్దు నాదోషంబులను జూచి
గోవింద రక్షించరా దేవ
నీసాటిదైవంబు లేడంచు చాటించు
నీ భక్తునిక బ్రోవర దేవ
దాసానుదాసుండ ధర్మవిగ్రహ నన్ను
దయచేసి రక్షించరా దేవ