నరుగుదమా గుడికి మన
మందరమును శ్రీరాముని జూడగ
నరుగుదమా గుడికి
కనులవిందుగ గుడిలో కొలువై
కనబడు మన శ్రీరాముని
హనుమల్లక్ష్మణసీతాయుతుడై
యలరారే మన రాముని
ధనువును దాలిచి చిరునగవులతో
దరిసెన మిచ్చెడు రాముని
మనకోరికలను వినినవెంటనే
మన్నించెడు మన రాముని
వచ్చిన యార్తుల దయతో జూచుచు
వలదిక భయమను రాముని
హెచ్చిన కౌతుకమున తన సన్నిధికి
వచ్చిన మెచ్చెడు రాముని
ముచ్చట లడుగుచు మ్రొక్కెడు వారల
బుధ్ధుల నెరిగెడు రాముని
సచ్చరితులు విజ్ణానులు వచ్చిన
సంతోషించెడు రాముని