ఎంతకును నీదయ సుంతయును రాక
చింతలును పోక నను చెడనిత్తువా
అహరహము నిను వేడు టది యెందుకో తెలిసి
తహతహ నాకెందుకో దశరథాత్మజా
బహుచక్కగ నెఱిగి పలుకాడకున్నావు
మహరాజ నీఠీవి మరి ఘనమాయె
నీయానచే కదా నేను భూమికివచ్చి
ఆయాసపడుచుంటి నని యెఱిగియును
చేయూత నొసగి నను చేదుకొన కున్నావు
ఓయయ్య నీదయకు వేయిదండాలు
నీగొప్పను చాటుచును నేను తిరుగాడగను
నాగోడును వినవుగా బాగుబాగు
రాగద్వేషములు లేని రామచంద్రా యను
రాగమును చూపు మన రాదుగా నిన్ను